Eco tourism ……………………
నల్లమల అటవీ ప్రాంతంలోని పచ్చర్ల, బైర్లూటి, తుమ్మలబయలు క్యాంపుల్లో ఎకో టూరిజం మెల్లగా ఊపందుకుంటోంది. వారాంతాల్లో, సెలవు రోజులలో పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఇక్కడకు వస్తున్నారు. నల్లమల అడవుల్లోని ప్రకృతి అందాలు, ప్రశాంత వాతావరణం పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఉంటాయి.
అక్కడ సహజ సిద్దంగా ఉండే ఎన్నోవన్య ప్రాణులు స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటాయి. గతంలో ఈ ప్రాంతానికి వెళ్లే అవకాశం కేవలం అటవీశాఖ అధికారులకు మాత్రమే ఉండేది. సామాన్యులకు అనుమతి ఇచ్చేవారు కాదు. కానీ ఎకో టూరిజం రావడంతో సామాన్యులకు సైతం ఈ ప్రాంతంలో పర్యటించే అవకాశం లభిస్తోంది.
అడవి అందాలను చూసేందుకు పెద్దలు,యువత,పిల్లలు ఇష్టపడతారు. ‘జంగిల్ క్యాంప్’లోని కాటేజీల్లో బస చేసి తీరికగా ప్రకృతి అందాలను తిలకించవచ్చు. ఉదయాన్నే .. సఫారీ చేసి, అడవి చెట్ల గాలులను అనుభవిస్తూ … పచ్చదనాన్ని ఆస్వాదించవచ్చు. వారాంతాల్లో హైదరాబాద్, విజయవాడ, కర్నూలు తదితర నగరాల నుంచి నల్లమలకు వచ్చే పర్యాటకులు రోజంతా హాయిగా గడుపుతారు. యాంత్రిక జీవనం నుంచి కనీసం ఒకటి రెండు రోజులైనా రిలీఫ్ పొందుతారు.
పచ్చర్ల సఫారి ట్రాక్.. ఎకో టూరిజంలో అందరినీ ఆకర్షిస్తున్నది ఈ ‘సఫారి ట్రాక్’. పచ్చర్ల జంగిల్ క్యాంప్ లో ఈ ట్రాక్ 10 కిలోమీటర్లు ఉంటుంది. ఒక్కో జీపులో ఆరుగురు ప్రయాణించవచ్చు. దాదాపు రెండు గంటలు సాగే సఫారీ యాత్ర.. భారీ వృక్షాలు, దట్టమైన పొదల గుండా ముందుకు సాగుతుంది. ఎండ తగలకుండా దట్టమైన చెట్లు , ఆ చెట్లకు అల్లుకున్న తీగలు.ఆ తీగలకు పూసిన పూలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.
మధ్య మధ్యలో పులి,ఎలుగుబంటి,కోతులు కనిపిస్తాయి. ఈ ప్రాంతం చుట్టూ లోయలతో చూడ ముచ్చటగా ఉంటుంది. ఇక్కడ జంగిల్ సఫారీ చేయాలంటే నిర్ణీత రుసుము చెల్లించాలి. నంద్యాల నుంచి పచ్చర్ల 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రకాశం గిద్దలూరుకు 35 కిలోమీటర్ల దూరం. బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో అక్కడికి వెళ్లొచ్చు.
పచ్చర్ల, బైర్లూటి, తుమ్మలబయలు క్యాంపుల్లో జంగిల్ సఫారీతో పాటు ఎకో వాక్ అవకాశం ఉంది. ఐదు నుంచి పది మంది సభ్యులు అడవి లోపలకు వెళ్లొచ్చు. గైడ్ తోడుగా వస్తాడు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అనుమతిస్తారు. ఇక్కడ 200 పక్షి జాతులు ఉంటాయి. 90 రకాల సీతా కోక చిలుకలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.
పచ్చని అడవిలో నడిచి వెళ్తుంటే అదోరకమైన అనుభూతికి లోనవుతారు.శబ్ద కాలుష్యాలకు దూరంగా ప్రశాంత వాతావరణం మనల్ని కట్టి పడేస్తుంది. ఇక తుమ్మలబయలు శ్రీశైల క్షేత్రానికి సమీపంలో ఉన్నది. ఇక్కడి జంగిల్ క్యాంప్ లో సఫారీతో పాటు, ఎకోవాక్, బర్డ్, బటర్ ఫ్లై స్కౌట్,ఆర్చరీ విన్యాసాలకు అవకాశం ఉంది.సఫారీ చేయాలంటే నిర్ణీత రుసుము చెల్లించాలి తుమ్మలబయలు శ్రీశైలం నుంచి దోర్నాల వెళ్లే దారిలో 27 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ఇక బైర్లూటి ఎకో కేంద్రం నుంచి 10 కిలోమీటర్ల మేర సఫారీ ట్రాక్ ఉంది. ఇక్కడి నుంచి మూడున్నర కిలోమీటర్లు ముందుకు వెళ్తే.. టైగర్ జోన్ ఉంటుంది. పులులు ఒక్కోసారి కనిపిస్తాయి.ఇక్కడికి సమీపంలోనే శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన ‘వీరభద్రస్వామి దేవాలయం’ ఉన్నది.ఇది శిథిలావస్థలో ఉంది.
ఈ ఆలయానికి ఎదురుగా రెండు కోనేర్లు ఉంటాయి.వేసవిలోనూ ఇవి జలకళతో కళ కళలాడుతుంటాయి. ఆలయానికి సమీపంలో ఓ జలపాతం కూడా ఉంది. అడవి మార్గాన కాలినడకన శ్రీశైలం వెళ్లే భక్తులు వీరభద్రుడిని చూడవచ్చు.
పచ్చర్ల జంగిల్ క్యాంప్లో 4 కాటేజీలు, 2 టెంట్ హౌజ్లు, బైర్లూటి క్యాంప్లో 4 కాటేజీలు, 6 టెంట్ హౌజ్లో పాటు డార్మెటరీలు అందుబాటులో ఉన్నాయి. నల్లమల వెళ్లేముందు పూర్తిగా సమాచారం తెలుసుకుని వెళ్ళండి.
@ Please call Nallamalai Jungle Camps, Manager – 7731011410 for Booking related information (From 9am to 6pm)