The family is not new to competing in two seats………………
ఇందిరా గాంధీ కుటుంబ సభ్యుల్లో … ఇందిర, సోనియా ..రాహుల్ గాంధీ రెండేసి నియోజకవర్గాల్లో పోటీ చేశారు. 1977లో ఇందిరాగాంధీ రాయబరేలీలో రాజ్‌నారాయణ చేతిలో ఓడిపోయిన తరువాత 1980 ఎన్నికల్లో ఆమె జాగ్రత్త పడ్డారు. నాటి ఎన్నికల్లో ఆమె రాయబరేలీతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మెదక్ లోక సభ స్థానం నుంచి బరిలో దిగారు.
రెండు చోట్ల నుంచీ విజయం సాధించిన ఆమె రాయబరేలీ వదులుకుని మెదక్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఇందిర కోడలు సోనియా గాంధీ 1999లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. అమేధీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. 1998 ఎన్నికల్లో అమేధీ లో బీజేపీ విజయం సాధించింది.ఈ క్రమంలో ముందు జాగ్రత్తగా సోనియా అమేధీ తో పాటు కర్నాటకలోని బళ్లారిని ఎంచుకుని బరిలోకి దిగారు.
రెండు చోట్లా ఒక మోస్తరు మెజారిటీతో గెలిచిన సోనియా గాంధీ తన అత్త ఇందిర బాటలోనే సాగారు. అమేధీ కి ప్రాతినిధ్యం వహించడానికే నిర్ణయించుకుని బళ్లారిని వదులుకున్నారు. నాటి ఎన్నికల్లో బీజేపీ లోని కీలక నేత .. ఆనాటి విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మ స్వరాజ్ బళ్లారిలో సోనియాపై పోటీ చేశారు. 56 వేల ఓట్ల తేడాతో సుష్మ ఓటమిపాలయ్యారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2019 లో తొలిసారి రెండు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగారు. వాటిలో ఒకటి అమేధీ కాగా రెండోది కేరళ లోని వయనాడ్. అయితే అనూహ్యంగా అమేధీ లో ఓడి పోయారు. వయనాడ్ లో 4.31 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ప్రస్తుత ఎన్నికల్లో వయనాడ్ తో పాటు సోనియా ప్రాతినిధ్యం వహించిన రాయబరేలీ నుంచి పోటీ చేస్తున్నారు. సోనియా రాజ్యసభ కు వెళ్లిన నేపథ్యంలో రాయబరేలీ ని నిలుపుకోవాలని రాహుల్ అక్కడ పోటీ కి దిగారు. గాంధీ కుటుంబానికి అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాలతో భావోద్వేగ సంబందాలున్నాయి.
రాయ్‌బరేలీతో నెహ్రూ-గాంధీ కుటుంబానికి నాలుగు తరాల బంధం ఉంది. అమేథీ సీటుతో గాంధీ కుటుంబానికి ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. 1977లో సంజయ్ గాంధీ ఎన్నికలలో పోటీ చేసిన నాటి నుంచి కొనసాగుతోంది. రాహుల్ తాత ఫిరోజ్ గాంధీ రాయ్ బరేలీ నుండి ఎన్నికలలో పోటీ చేయడం ద్వారానే ఎంపీ అయ్యారు.
ఆ తర్వాత నానమ్మ ఇందిరా గాంధీ దానిని తన కార్యక్షేత్రంగా మలచుకున్నారు.మొదట సంజయ్ గాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీ అమేథీ నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు.అమేథీలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓడిపోయి ఐదేళ్లవుతోంది.
కానీ ఆ ఓటమి మిగిల్చిన గాయం నుంచి అటు కాంగ్రెస్, ఇటు గాంధీ కుటుంబం ఇంకా కోలుకోలేదు..ఇపుడు రాయబరేలీలో రాహుల్ ని గెలిపించేందుకు ప్రియాంక ఇతర నేతలు శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.
———- KNM