ఆయనకు జీ బ్లాక్ అచ్చిరాలేదా ?

Sharing is Caring...

He faced many bitter experiences…………….

నూట ముప్పైమూడేళ్ళ చరిత్ర గల సర్వహిత (జీ బ్లాక్ ) మూడేళ్ళ క్రితం కాలగర్భం లో కలిసిపోయింది. సచివాలయ పరిపాలన భవనాలలో….ముఖ్యంగా చాలామంది సీఎం ల కార్యాలయంగా వర్ధిల్లిన భవనం ఇది. ఈ సర్వహిత కు సంబంధించి ఈ తరానికి తెలియని కొన్ని ఘటనలు ఉన్నాయి. అంతగా వెలుగు చూడని విషయాలూ ఉన్నాయి.ఇపుడు అక్కడ కొత్త సచివాలయ భవనం వెలసింది. ఫోటో లో మీకు కనబడేది జీ బ్లాక్.

అధికారంలో కొచ్చాక జీ బ్లాక్ కి ఎన్టీఆర్ సర్వహిత అనే పేరు పెట్టారు. ఈ భవనం నుంచే ఎన్టీఆర్ తన పాలనను కొనసాగించారు.ఎన్టీఆర్ మూడో మారు (1994లో) అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ద్వితీయ కళత్రం లక్ష్మీపార్వతి భోజన క్యారియర్‌తో కొద్దీ రోజులు ఈ బ్లాక్ కి వచ్చారు.ఆయన కు భోజనం వడ్డించి వెళ్లేవారు. అప్పట్లో పత్రికలు ఈ అంశాన్ని హైలెట్ చేస్తూ ఫొటోలతో సహా మొదటి పేజీ లో ప్రచురించాయి.

అప్పటి నుంచే ఆమె రాజకీయాల్లో తలదూరుస్తున్నారనే వార్తలు ఊపందుకున్నాయి . తెర వెనుక నుంచి పెత్తనం చేస్తున్నారనే విమర్శలు మొదలైనాయి. అదలావుంచితే చాలామందికి తెలియని విషయం మరొకటుంది.ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో (1983) ఆయన మొదటి సతీమణి శ్రీమతి బసవతారకం కూడా భోజనం క్యారియర్ తీసుకుని సచివాలయానికి వచ్చి భర్తకు స్వయంగా వడ్డించేవారట. ఈ విషయాన్ని మాజీ డీజీపీ హెచ్ జె దొర తన పుస్తకం లో రాశారు.

ఈ సర్వహిత భవనం నుంచే ఎన్టీఆర్ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ఉద్యోగుల పదవీ విరమణ వయసు తగ్గింపు ఒకటి.పదవీ విరమణ వయసును ఎన్టీఆర్ 58 నుంచి 55 కి తగ్గించేశారు. ఈ నిర్ణయం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఉద్యోగ వర్గాలు భగ్గుమన్నాయి.ఆ తర్వాత కొంత కాలం ఉద్యోగులు సమ్మె చేశారు. అయినా ఎన్టీఆర్ దిగి రాలేదు. దీంతో ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకులుగా మారిపోయారు. సుప్రీం కోర్టు కెళ్ళారు.

అదే సమయంలో ఉద్యోగులు చేస్తోన్న సమ్మె ను ఎన్టీఆర్ అణచివేసే ప్రయత్నం చేశారు. సచివాలయం లో ఉద్యోగులు విచ్చలవిడిగా తిరగడాన్ని కట్టడి చేస్తూ ఆంక్షలు పెట్టారు. పని వేళలు ఖచ్చితంగా పాటించాలని , క్రమశిక్షణ తో మెలగాలని ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే కార్డు ముక్క రాస్తే చాలు … చర్య తీసుకుంటామని ఎన్టీఆర్ ప్రకటించారు.

ఎన్టీఆర్ పెట్టిన ఈ ఆంక్షలతో స్వేచ్ఛకు అలవాటుపడిన ఉద్యోగులు ఒక్కసారిగా భగ్గుమన్నారు.ఈ క్రమంలోనే సర్వహిత భవనం ముందు ఒక రోజు ఉద్యోగులు ఎన్టీఆర్ పై దాడి చేసినంత పని చేశారు.ఎన్టీఆర్ సెక్యూరిటీ ఆఫీసర్ నర్శయ్య ,సిబ్బంది ఆయనకు రక్షణ వలయంగా నిలిచారు. ఉద్యోగులు ఎన్టీఆర్ ను భవనం లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకుని ఘోరావ్ చేశారు.

ఆ ఘటన తో ఎన్టీఆర్ ఖిన్నుడయ్యారు … తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఉద్యోగ సంఘాల నేతలు స్వామినాథన్, రమణయ్య తదితరులు అక్కడే ధర్నాకు దిగారు.ఎన్టీఆర్ వ్యతిరేక నినాదాలతో సచివాలయం దద్దరిల్లింది. ఈ పరిణామాలతో ఎన్టీఆర్ కి కోపమొచ్చి ఏదో చెప్పబోగా ఉద్యోగులు అడ్డుపడ్డారు.రాష్ట్రపతి పాలన విధించాలని…. ఎన్టీఆర్ డౌన్ డౌన్ అని ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

ఉద్యోగులు ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడం తో పోలీసులు ప్రవేశించారు. అందరిని బయటకు తరిమేశారు. అదేరోజు ఈ ఘటన కు ముందు జర్నలిస్టులు విద్యారణ్య, సలాంద్ర లక్ష్మీనారాయణ , ఎస్. నర్సింగరావు లపై తెలంగాణ ఉద్యోగులు దాడి చేసారు.మీరంతా ఎన్టీఆర్ కి అనుకూలంగా వార్తలు రాస్తున్నారని నిందించారు. ఆ వేడిలోనే ఎన్టీఆర్ పై దాడికి తెగబడ్డారు.

ఈ ఘటనకు ఆ నాటి జర్నలిస్టులు భండారు శ్రీనివాసరావు ..జాగర్లమూడి రామకృష్ణ , తిరుమలగిరి సురేందర్ , నగేష్ తదితరులు సాక్షులు. మరే సీఎం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు.ఈ ఘటనల దరిమిలా కొద్ది రోజులు ఉద్యోగులు సరిగ్గా పని చేయలేదు. పాలన మందగించింది . సాధారణ పరిస్థితి నెలకొనడానికి టైమ్ పట్టింది.మొదట్లో జీ బ్లాక్ లో లిఫ్ట్ ఉండేది కాదు. ఎన్టీఆర్ వచ్చాక లిఫ్ట్ పెట్టారు. కానీ దాన్ని ఎన్టీఆర్ ఉపయోగించేవారు కాదు .పై అంతస్తుకి ఆయన టేకు మెట్ల మీదుగా కిర్రు చెప్పులతో నడుచుకుంటూ వెళ్లేవారు. సెక్యూరిటీ ఆయన వెనుక రక్షణగా వెళ్లేవారు.

ఈ బిల్డింగ్ లో ఉన్నపుడే ఎన్టీఆర్ దేశ నాయకుల దృష్టిని ఆకర్షించారు . నేషనల్ ఫ్రంట్ ను స్థాపించారు. ఇక్కడ నుంచే పాలన చేస్తుండగానే ఎన్టీఆర్ ను ఒకసారి నాదెండ్ల .. మరోసారి చంద్రబాబు గద్దె దించారు. నాదెండ్ల ఎపిసోడ్ తర్వాత కూడా ఎన్టీఆర్ ఈ బిల్డింగ్ వాస్తు గురించి పట్టించుకోలేదు.రెండో సారి గద్దె దిగుతానని ఆయన ఊహించలేదు. ఇలాంటి సంచలన విషయాలు మరెన్నో ఉన్నాయి.

బాబు అధికారంలోకొచ్చాక ఎన్టీఆర్ సచివాలయం మొహం చూడలేదు.అధికార పగ్గాలు చేపట్టిన చంద్రబాబు సి బ్లాక్ లోకి మారారు. ఆ తర్వాత కొంత కాలం ఎన్టీఆర్ ఆస్థాన జ్యోతిష్యుడు బీ వీ మోహన్ రెడ్డి రవాణా శాఖా మంత్రిగా ఈ సర్వ హిత నుంచే కార్యకలాపాలు నిర్వహించారు. ఎన్టీఆర్ కి ముందు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారంతా జీ బ్లాక్‌ నుంచి పరిపాలన వ్యవహారాలు సాగించారు.కాలక్రమేణా సర్వహిత భవనం శిధిలావస్థకు చేరుకోవడంతో దాన్ని వాడకుండా ఖాళీగా ఉంచేశారు.

ఒక దశలో ఇదో చారిత్రక, వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత చట్టానికి సవరణలు చేయడంతో ఆ హోదాను కోల్పోయింది.ఇప్పటి కూల్చివేతలో మిగిలిన భౌతిక రూపం కూడా కనుమరుగైంది. ఈ భవనాన్ని ఇకపైన ఫోటోల్లో చూసుకోవాల్సిందే.అదలావుంటే ఈ బ్లాక్ గురించి ఆసక్తికరమైన కథనాలు ఎప్పటినుంచో ప్రచారంలో ఉన్నాయి.
ఈ భవనంలో నిధి నిక్షేపాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది.

దీంతో పురావస్తు శాఖ ఈ భవనాన్నితవ్వడానికి అనుమతి ఇవ్వాలని 2001లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను కోరింది. అయితే అనుమతి లభించలేదు.కోటి ఉమెన్స్ కాలేజీ నుంచి సచివాలయంలోని ఈ భవనం వరకు సొరంగ మార్గం ఉందనే కథనం ప్రచారంలో ఉంది.

నాణాలను ముద్రించే మింట్ కంపౌండ్‌కు సమీపంలో ఈ భవనం ఉంది. ఈ భవనాన్ని ఆరవ నిజాం ధనాగారంగా ఉపయోగించారు. ఏడవ నిజాం సైతం దీనిని కోశాగారంగా ఉపయోగించారట. ఈ ప్రచారం ఆధారంగానే ఇప్పటి సీఎం.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తదితరులు కూడా తెరాస ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు.

అయితే ఈ కథనాలను నిజాం వంశస్తులు ఖండించారు. నిజాం ఆరవ నవాబు మిర్ మహబూబ్ ఆలీ ఖాన్ 1887లో ఈ భవనాన్ని కట్టించారు. ఆయనకు ఈ భవనం అచ్చిరాలేదట.. మూడేళ్ళ క్రితం కూల్చివేతతో దీని కథ ముగిసింది.

————KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!