The Mummy Mystery .......................
ఉత్తర సిసిలీలో ఒక చిన్నారి మమ్మీ మాత్రం తాజా మృతదేహంలా చెక్కు చెదరకుండా ఉండటమే కాకుండా ప్రపంచంలో అందమైన మమ్మీగా పేరుగాంచింది. ఆ విశేషాలేమిటో తెలుసుకుందాం.
రోసాలియా లాంబార్డో అనే రెండేళ్ల చిన్నారి డిసెంబర్ 2, 1920న తన రెండో పుట్టిన రోజు నాడు చనిపోయింది. వాస్తవానికి 1918 నుంచి 1920 మధ్య కాలంలో స్పానిష్ ఫ్లూ మహమ్మారి ప్రబలంగా ఉండేది. ఆ సమయంలో… ఈ చిన్నారి ఆ మహమ్మారి బారిన పడి మృతి చెందింది.
అప్పటి నుంచి ఆ చిన్నారి మృతదేహాన్ని మమ్మీలా మార్చి అత్యంత జాగ్రత్తగా భద్రపరిచారు. ఆ చిన్నారి మృతదేహం ఉత్తర సిసిలీలో పలెర్మోలోని కాపుచిన్ కాటాకాంబ్స్ అనే చోట భద్రపరచారు. వందేళ్ల తర్వాత కూడా ఆ చిన్నారి మృతదేహం ఆమె చనిపోయినప్పుడు ఎలాగా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉండటం విశేషం.
ఆ మృతదేహం పాడవకుండా అత్యంత జాగ్రత్తగా నైట్రోజన్తో నిండిన గాజు పేటికలో భద్రపరిచారు. ఈ చిన్నారి మమ్మీ ప్రస్తుతం పర్యాటక ఆకర్షణగా మారింది. ఆ నోటా .. ఈ నోటా విని ఎంతో మంది వచ్చి చిన్నారి మమ్మీ ని చూసి వెళుతున్నారు.
ఈ కాపుచిన్ కాటాకాంబ్స్ అనేది దక్షిణ ఇటలీలో ఉండే అతి పెద్ద మమ్మీల పరిశోధన కేంద్రం లేదా మమ్మీలను భద్రపరిచే భూగర్భ శ్మశాన వాటిక. ఇందులో దాదాపు ఎనిమిది వేల మమ్మీలు ఉన్నాయి. రోసాలియా మృతదేహాన్ని భద్రపరిచినంతగా మిగతా వాటిని భద్రపర్చలేదు. ఆ చిన్నారి రాగి జుట్టు, చర్మం రంగు మారకుండా ఏదో మనిషి నిద్రపోతున్నట్లుగా కనిపిస్తుంది.
చాలామంది నకిలీ మమ్మీ అని, మైనపు ముద్ద అంటూ పుకార్లు సృష్టించారు. మరికొంతమంది ఆ చిన్నారిని చూసినప్పుడు మమ్మల్ని చూసి రెప్పవేసిందని కూడా చెప్పారు. ఐతే వాటన్నింటిని కొట్టి పారేస్తూ…ఆ చిన్నారి శరీరం పై చేసిన పరిశోధనల్లో శరీరం, ఎముకలు, అవయవాలు ఏ మాత్రం చెక్కు చెదరలేదని, కేవలం మెదడు మాత్రమే ఉండాల్సిన పరిమాణం నుంచి 50% తగ్గిపోయిందని నిర్ధారించారు ఆర్కియాలజిస్టులు .
ఏ మాత్రం పాడవకుండా ఉన్న ఈ చిన్నారి మమ్మీ ఇపుడు ఇటలీలో ప్రసిద్ధ అంశంగా మారింది. ఈ చిన్నారిని టాక్సీడెర్మిస్ట్, ఎంబాల్మర్ ఆల్ఫైడో సలాఫియాలు మమ్మీగా మార్చారని చెబుతున్నారు.కానీ కొంతమంది శాస్త్రవేత్తలు మాత్రం ఈ మమ్మీ శవపేటికలో ఉండటం వల్ల ఇరు పక్కల ఉండే గాజు విండోలు ఒక ఆప్టికల్ ఇల్ల్యూషన్ కలిగించి ఆ మమ్మీ చెక్కుచెదరకుండా ఉన్నట్లు కనిపించేలా చేస్తున్నాయని, పగటి పూట వేరేలా ఉంటుందని చెబుతున్నారు.