ముగ్గురు మిత్రుల కథ !

Sharing is Caring...

Bharadwaja Rangavajhala…..  

అనగనగా … మద్రాసు లో … మద్రాసు మెయిల్ అనే ఓ పత్రిక ఉంటూ ఉండేది మాత్రమే కాక … ఉంది కూడా .అందులో ముత్తుస్వామి అలియాస్ మురగదాసు అనే ఓ బోల్డు ఆశలూ ఆశయాలూ కలిగిన యువకుడు సబ్ ఎడిటర్ గా పన్జేసేవారు.
ఆయనతో పాటూ …. వాహినీ లో ఆర్ట్ అండ్ సౌండ్ విభాగాల్లో విపరీతమైన శ్రమ చేసిన ఎకె శేఖర్ అన్నగారు అందులో అంటే మద్రాసు మెయిలులోనే ఆర్ట్ డైరక్టర్ గా పనిచేసేవారు.

శేఖర్ గారికి కూడా ఆర్ట్ లో ప్రవేశం ఉంది. ఆర్ట్ ఎలాగూ మన చేతిలో ఉంది కదా … ప్రింటింగ్ గురించి తెల్సుకుంటే బెటరూ అన్న తపన ఉండేది.దీంతో ఆ మద్రాసు మెయిల్ ప్రింటింగ్ సెక్షన్ లో అప్రెంటిస్  గా  చేరిపోయారు.అలా రోజూ ప్రెస్సుకు పోతున్న సందర్భంలోనే …ఇందాక చెప్పుకున్న బోల్డు ఆశల మురగదాస అలియాస్ ముత్తుస్వామిగారితో పరిచయం అయ్యింది.

మేదావులు ఎప్పుడూ ఒక్కచోటే ఉద్యోగం చేయరు కనుక … మన ముత్తుస్వామియున్నూ శేఖర్ గారి అన్నగారున్నూ కూడానూ మద్రాసు మెయిల్ దిగిపోయి …సైంటిఫిక్ అడ్వర్టైజింగ్ కంపెనీ పెట్టారు.మద్రాసు మెయిల్ నుంచీ బయట పడి శేఖర్ కూడా ఈ యాడ్ ఏజన్సీలో ఆర్టిస్టుగా చేరారు. అలా ముత్తుస్వామిగారితో ఎక్కువసేపు మాట్లాడే అవకాశం దొరకడంతో .. శేఖర్ చాలా విషయాలు తెల్సుకునేవారు.

వారు మాట్లాడుకునే అంశాల్లో ఎక్కువగా సినిమాలకు సంబందించినవే ఉండేవి. సినిమా ఎలా తీయాలి … ఎలాంటి కథలు తీయాలి … మామూలు కథలను సినిమా తెర మీద ఎలా చెప్పాలి … ఇవే మాట్లాడుకునేవారుట.  …ఇలా నడుస్తూండగా ఒక రోజు ముత్తుస్వామి మనం ఒక పత్రిక పెడదామా అని ప్రపోజ్ చేశారు. శేఖరూ ఆయన అన్నగారూ సై అన్నారు. అంతే … సౌండ్ అండ్ షాడో అనే పత్రికను ప్రారంభించారు.

ఆ పత్రిక విజయవంతంగా నడుస్తూండగానే … ఒక రోజు ఓ కుర్రాడు వచ్చి మురగదాసను కల్సి …అయ్యా … సినిమాటోగ్రఫీకి సంబంధించి నేనో వ్యాసం రాసాను. అది మీకు ఇస్తున్నాను… మీకు నచ్చితే మీ పత్రికలో వేసుకోవచ్చు అని చెప్పాడు. అతన్ని అక్కడే కూర్చోబెట్టి వ్యాసం చదివేశారు ముత్తుస్వామి.

చాలా బాగా రాశారు … నాక్కూడా తెలియని విషయాలున్నాయి ఇందులో … తప్పకుండా వేసుకుంటాం … అలాగే మీరు తరచు మా ఆఫీసుకు వస్తూ ఉండండి అన్నారు. ‘అలాగే’ అన్నారాయన… ఆ వచ్చిన కుర్రాడి పేరు కె.రామనాథ్. అతను ట్రివేండ్రమ్ నుంచీ డిగ్రీ పూర్తి చేసుకుని కెరీర్ వెతుక్కుంటూ మద్రాసు చేరి కోడక్ కంపెనీలో అసిస్టెంట్ గా పనిచేసేవారు.

అలా ఆయనకు కెమేరానురక్తి ఏర్పడి దాని గురించి అధ్యయనం చేయడం ప్రారంభించి ఆ అధ్యయనాన్ని అక్షరాల్లోకి తర్జుమా చేయడం ప్రారంభించారు. వాటిని ఎక్కడ అచ్చు వేయాలి అన్నప్పుడు సౌండ్ అండ్ షాడో పత్రిక కనిపించింది. అలా సౌండ్ అండ్ షాడో పత్రిక కార్యాలయంలో కల్సుకున్న రామనాథ్, శేఖర్, ముత్తుస్వామి ఆ తర్వాత చాలా గొప్పపనులు చేశారు. అది వేరు సంగతి …ఇలా వీరు ముగ్గురూ పత్రికా కార్యాలయంలో తరచు కలుస్తూ సినిమాల గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఓ అద్భుతమైన అవకాశం వచ్చింది.

అదేమనగా …శాంతారామ్ గారు తమిళంలో సీతారామకళ్యాణం తీయాలనుకోవడం…కోల్హాపూర్ లో షూటింగు జరుగుతోంది. తమిళ భాష తెలియడంతో పాటు సినిమా మీద పట్టున్న వారు కావాలని  కోరుకుని అలాంటి వారి కోసం వెతకడం ప్రారంభించారు. అప్పుడు … ఈ సౌండ్ అండ్ షాడో బ్యాచ్ వాళ్లకు సినిమా మీద విపరీతమైన గ్రిప్పు ఉంది … అని తెలిసింది. వెంటనే శాంతారామ్ వీళ్లతో మాట్లాడి … తమిళ సీతాకళ్యాణానికి మీరు హెల్ప్ చేయాలన్నారు.  వీళ్లూ ఓకే అన్నారు.

అలా తమిళ సీతారామకళ్యాణానికి ముత్తుస్వామి దర్శకుడు అయ్యాడు. రామ్ నాథ్ కెమేరా దర్శకుడుగా మారాడు. ఎకె శేఖర్ కళా దర్శకుడు అయిపోయాడు.వీళ్లతో పాటు మంజేరి ఈశ్వరన్ , పాపనాశమ్ శివన్, డాక్డర్ రాఘవన్ తదితరులు కూడా సహకరించారు. అలా ఇండస్ట్రీలోకి ప్రవేశించారు ఈ ముగ్గురు మిత్రులూనూ ..అలా సీతారామకళ్యాణం పూర్తి అయిన వెంటనే … ముత్తుస్వామిగారు రెండో సినిమాకు ప్లానింగ్ షార్ట్ చేసేశారు.బందరు పి.వి దాసుగారి నిర్వహణలోకి వచ్చిన వేల్ పిక్చర్స్ ప్రారంభం చేసే పన్లో పడిపోయారు.

వేల్ స్టూడియోస్ లో కెమేరా విభాగం రామనాథ్ గారూ ఆర్ట్ శేఖర్ గారూ స్టూడియో నిర్వహణ తదితర  వ్యవహారాల్లో ముత్తుస్వామిగారూ బిజీ అయిపోయారు… అలా వేల్ పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చిన మొదటి సినిమా భక్త మార్కండేయ.. ఎప్పుడైతే వీళ్లు ముగ్గురూ సినిమాల్లో పడిపోయారో అప్పుడు సౌండ్ అండ్ షాడో అంటూ వీళ్లు ప్రారంభించిన పత్రిక ఆగిపోయింది.

పి.వి దాసుగారు కాలం చేయడం … దరిమిలా వేల్ పిక్చర్స్ వాటాదారులతో పొసగక …వేల్ పిక్చర్స్ నుంచీ బయటకు వచ్చేశారు ముగ్గురు మిత్రులూనూ …వచ్చి ఏం చేశారూ … ముప్పై ఏడు ప్రాంతాల్లో కార్తికేయ ఫిలిమ్స్ ప్రారంభించడంతో ముగ్గురూ అందులోకి వెళ్లారు. సుందరమూర్తి నాయకర్ అనే సినిమా తీశారు. అది బాక్సాఫీసు దగ్గర పెద్దగా ప్రభావం చూపించలేదు.ఆ తర్వాత ఏం చేయడమా అని ఆలోచిస్తూ ఉండగా …బిఎన్ రెడ్డి నుంచీ పిలుపు వచ్చింది. బిఎన్ రెడ్డి కూడా సౌండ్ అండ్ షాడో పత్రిక పాఠకుడూ అభిమానికూడాను.

అలా రామ్ నాథ్ , శేఖర్ ఇద్దరూ వాహినీలో చేరిపోయారు.బిఎన్ తీసిన వందేమాతరం, సుమంగళి, దేవత, భక్తపోతన చిత్రాలకు రామనాథే కెమేరా దర్శకుడు.ముత్తుస్వామి గారు వాహినీలోకి రాలేదు. ఆయన బయటే ఉండిపోయారు. అయితే త్వరలోనే వీళ్లిద్దరూ వాహినీ నుంచీ బయటకు వచ్చి జెమినీ దారి పట్టినప్పుడు తిరిగి ముత్తుస్వామి వీళ్లతో చేరి అందులోకి వచ్చారు… ముగ్గురూ కల్సి జెమిని బ్యానర్ లో తీసిన నందనార్ సినిమా అద్భుతమైన విజయం సాధించింది…. ఆ తర్వాత తీసిన జ్ఞాన సుంద‌రి అనే సినిమా ఫ్లాప్ అయ్యింది. కొంత కాలానికి రామ్ నాథ్, శేఖర్ ఇద్దరూ జెమినీ నుంచీ బయటకు వచ్చి జూపిటర్ లో చేరారు.

ముత్తుస్వామిగారు మాత్రం జెమినీలో కొంత కాలం కొనసాగి బయటకు వచ్చారు. ఇక సినిమాలు తీయడం అనే ఆలోచన మాని … సినీ టెక్నీషియన్స్ అసోసియేషన్ వారు ప్రచురిస్తూ వచ్చిన మాసపత్రిక బాధ్యతలు చూసేవారు. పుస్తకాలు చదువుతూ … సినిమాల గురించి వింతలూ విశేషాలు రాస్తూ అలా కాలక్షేపం చేసేవారు.1975 మార్చిలో కన్నుమూశారు. ఆయన కన్నుమూసే వరకూ బిఎన్ అప్పుడప్పుడూ ఆయన్ని కలిసేవారు. నిజానికి వాహినీ ప్రారంభం అప్పుడు రెడ్డి శేఖర్ రామ్ నాథ్ త్రయం అనే పిలిచేవారు జనం.

అలా ముత్తుస్వామి ప్లేస్ తాను కొంత కాలం తీసుకున్నట్టు బిఎన్ ఫీలయ్యేవారు. అలా నలుగురు స్నేహితులు అనాలి అనేది బిఎన్ అభిప్రాయం. ఫిలిం మేకర్ కన్నా ముత్తుస్వామి క్రిటిక్ గానే నాకు చాలా ఇష్టం అనేవారు బిఎన్.కామర్స్ చార్టెడ్ అక్కౌంటెన్సీ నుంచీ సినిమా డైరక్షన్ వైపు టర్న్ అయి … ఇలా నా జీవితం నడిచిందంటే … దాని వెనకాల సౌండ్ అండ్ షాడో బ్యాచ్ ఇంపాక్ట్ చాలా ఉంది అనేది బిఎన్ ఒపీనియన్.  అదీ కథ..

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!