Nitrogen killing is barbaric……………….
సాధారణంగా మరణ శిక్ష అంటే …..దోషి అయిన మనిషి మెడకు తాడు బిగించి వేలాడదీస్తారు. కొన్ని దేశాల్లో అయితే శిక్ష పడిన దోషిని కాల్చి చంపేస్తారు, మరికొన్ని దేశాల్లో కత్తితో దోషి తల నరికేస్తారు. ఇపుడు నైట్రోజన్ వాయువుతో మరణశిక్ష అమలు చేసే విధానం వచ్చింది.
దోషి చేత నైట్రోజన్ వాయువును పీల్చేలా చేసి.. మరణశిక్షను రెండురోజుల క్రితం అమెరికాలో అమలు చేశారు. ఈ తరహా మరణ శిక్షల్లో ఇదే మొదటిది. సుమారు 30 ఏళ్ల క్రితం సుపారీ తీసుకుని ఒక మహిళను హత్యచేసిన కేసులో 58 ఏళ్ల కెన్నెత్ ఎజీన్ స్మిత్ అనే దోషికి అమెరికాలో ఈ విధంగా మరణశిక్షను విధించారు.
ఇంతకీ నైట్రోజన్ ద్వారా మనిషి ఎలా మరణిస్తాడు అంటే ?? నైట్రోజన్ ప్రాణాధారమైన ఆక్సిజన్ను శరీర కణాలకు అందకుండా చేస్తుంది. ఈక్రమంలో కణాలు ఆక్సిజన్ లేక క్షణాల్లో మృతి చెందుతాయి. దీంతో వ్యక్తి మరణిస్తాడు. గాలిలో నైట్రోజన్ సాంద్రత పెరిగి అవసరమైన ఆక్సిజన్ అందకపోతే శారీరక సమస్యలు ఏర్పడతాయి. కోమా లోకి వెళ్ళ వచ్చు … మరణించవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.
ఈ విధానంలో ఖైదీ ముఖానికి మాస్క్ లేదా ప్లాస్టిక్ హుడ్ లేదా బ్యాగ్ కడతారు. రంగులేని, వాసన లేని నైట్రోజన్ వాయువు హీలియం బెలూన్‌లను పెంచడానికి ఉపయోగించే ట్యాంక్ నుండి మాస్క్‌లోకి ప్రవహిస్తుంది. దీంతో దోషి ఉక్కిరిబిక్కిరై మరణిస్తారు. కాగా ఈ తరహా మరణ శిక్షపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే అసలు నైట్రోజన్ వాయువు కేవలం మనిషి ప్రాణాలు తీయడానికే ఉపయోగపడుతుందా.? అనుకుంటే అది పొరపాటే. నైట్రోజన్‌ను మనకు తెలియకుండానే మన రోజువారీ జీవితంలో ఉపయోగిస్తుంటాం.
నైట్రోజన్ వాయు రూపంలో ఉంటుంది. వాతావరణంలో నైట్రోజన్ విరివిగా ఉంటుంది. నైట్రోజన్ ను ఫార్మా, మైనింగ్ ,ఫుడ్ బేవరేజ్,మెటల్,ఎలక్ట్రానిక్ వంటి అనేక పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. నైట్రోజన్ ను తెలుగు లో మనం నత్రజని అని పిలుస్తాం.
నైట్రోజన్ విషవాయువు కాదు. ఇది ఆక్సిజన్ ను లేకుండా చేస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా కూడా ఉపయోగపడుతుంది. ఆహార పదార్థాలు నిల్వ ఉండడానికి ఈ వాయువును ఉపయోగిస్తారు. ఆక్సిజన్ తాకడం వల్ల కూరగాయలు, ఆహార పదార్థాలు త్వరగా పాడైపోతాయి. కాబట్టి నైట్రోజన్‌ను ఉపయోగించడం వల్ల ఆక్సిజన్ తొలగిపోయి కూరగాయలు పాడవకుండా ఉంటాయి.