ఆయనకు క్లాసులు పీకుతున్నారట !

Sharing is Caring...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్  మొండి వైఖరి పట్ల సన్నిహితులు  విసిగి పోతున్నారట . ఓటమి ఒప్పకుని తప్పుకోమని, అది హుందాగా ఉంటుందని  చెవినిల్లు కట్టుకుని పోరుతున్నారట. ఉహు ససేమిరా అంటున్నాడట ట్రంప్.  అమెరికా లో ఫలితాలు వెలువడిన తర్వాత  ఓడిన వారు … ఓటమిని అంగీకరిస్తూ  అంగీకార ప్రసంగం చేయడం అమెరికాలో ఒక ఆనవాయితీ.(ఇది మనదేశం లో లేదు కానీ కొంతమంది నేతలు ప్రెస్ మీట్  పెట్టి  తమ అభిప్రాయాలను హుందాగా వెల్లడిస్తుంటారు). కానీ ట్రంప్ ఆ ఊసే ఎత్తడం లేదు. ఏది ఏమైనా కోర్టుల్లో తేల్చుకుంటా అన్న మాట తప్పితే  మరో మాట నోటి నుంచి రావడం లేదట. సొంత పార్టీ నేత , మాజీ ప్రెసిడెంట్ బుష్ ఎన్నికల్లో అక్రమాలు జరగలేందంటూ ప్రకటన చేయడం విశేషం. ఈ క్రమం లో ట్రంప్ పై ఒత్తిడి మరింత పెరుగుతోంది. 

కొంతమంది ఆయన మద్దతు దారులు ట్రంప్ ను రెచ్చగొడుతున్నారని అమెరికా మీడియా కథనాలు. ట్రంప్ అల్లుడు, సలహాదారుల్లో ఒకరు జారెడ్ కుశ్నర్ కూడా గౌరవ ప్రదంగా తప్పుకుంటే  మేలు అని చెప్పారు.లేకుంటే చరిత్రలో చెడ్డవారిగా ముద్ర వేయించుకోవాల్సి వస్తుందని అన్నారు. అలాగే ట్రంప్ సన్నిహితులు మరికొందరు కూడా ఇదే మాట చెప్పారని సమాచారం . అయితే కోర్టులో తేలి తనకు తగిన మెజారిటీ రాలేదని నిరూపితమైతే .. అపుడు ఒప్పుకుంటానని ట్రంప్ అంటున్నారట. ట్రంప్ ఇద్దరు కుమారులు తండ్రికే మద్దతు ఇస్తున్నారట. ఇక కోర్టు ఖర్చులకోసం 60 మిలియన్ డాలర్లు సమీకరించేందుకు రిపబ్లికన్లు ప్రయత్నిస్తున్నారు. 

అధికారమార్పిడి సవ్యంగా జరిగేలా సహకరించాలని  వైట్ హౌస్ అధికారులు పదే పదే కోరుతున్నారు. నాలుగు రోజులు పోతే ఆయన ఆవేశం తగ్గి వాస్తవాలను అర్ధం చేసుకోగలరు అని కూడా అనుకుంటున్నారు. చివరికి భార్య మొలనియా కూడా ఈ పద్ధతి మార్చుకోవాలని చెప్పిందట. బహిరంగంగా ఆమె ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. ఆమె మాట  విని జోరు తగ్గించే సూచనలు ఉన్నాయంటున్నారు. 

కాగా  ట్రంప్ కి కూడా చెప్పుకోదగిన స్థాయిలోనే ఓట్లు వచ్చాయి. రిపబ్లికన్ పార్టీ నేతగా శక్తివంతమైన నాయకునిగా ఎదిగారు. పరిపాలనపై తనదంటూ ఒక ముద్ర కూడా ఉంది. ఇదిలా ఉంటె 2024 లో కూడా ట్రంప్ మళ్ళీ పోటీ చేసే యోచనలో ఉన్నారని అంటున్నారు. అందులో భాగంగానే తన అభిమానుల నమ్మకం పొందేందుకు ఇలా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. త్వరలో ఒక న్యూస్ ఛానల్ కూడా ప్రారంభించే యోచన చేస్తున్నారు. రాజకీయాల్లో  క్రియాశీలకంగా మరికొంత కాలం  ఉండాలనేది ఆయన కోరిక అంటున్నారు. 

ఇది కూడా చదవండి>>>>>>> కోర్టు ధిక్కారం కేసులో ఆ ముఖ్యమంత్రికి జరిమానా !

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!