ఆరుద్ర తో ఆ ఇద్దరు కంఫర్ట్ ఫీలయ్యేవారా ?

Sharing is Caring...

Bharadwaja Rangavajhala …………………….

‘మ‌ము బ్రోవ‌మ‌ని చెప్ప‌వే సీత‌మ్మ‌త‌ల్లీ’ అంటూ అందాల‌రాముడు లో బావురుమ‌నే గీతం సినారే రాశార‌న్జెప్పితే , శానామందిరి బాషాభిమానులు యాయ్ … అద్రాసిందారుద్ర‌రా అనేశారు.అంటే ఏంటీ?  న‌మ్మ‌కం … బాపు ర‌మ‌ణ‌ల సిన్మాలో ఆరుద్రే రాస్తార‌ని ఫిక్స్ అయిపోయారు.

అంత‌గా త‌మ ఆడియ‌న్సుకు ఆరుద్ర‌ను మ‌ప్పేశారాళ్లిద్ద‌రూనూ …ఇది క‌రెస్టు… అంచేత అలా కోప‌డ్డార‌న్న‌మాట …ఇలాంట‌ప్పుడే స‌హ‌నం కోల్పోకూడ‌దు ..నీ జ్హానాన్ని ప్ర‌ద‌ర్శించ‌డానికి తాప‌త్ర‌య‌ప‌డడం అంటే అవ‌త‌లివారి జ్ఞానాన్ని చుల‌క‌న చేయ‌డం …అంచేత అవ‌త‌లివారు అలా ఎందుక‌న్నారు అనేది చూసుకుని … ఉంటుంది ప్ర‌తిదానికీ కార‌ణం ఉంటుంది. దాన్ని తెల్సుకుని … వారికి చెప్పాల త‌ప్ప ఠాఠ్ అని మీద‌డిపోకూడ‌దు.

అట్టా ప‌డ్డం అంటే … నాయ‌నా .. అది భ‌గ‌మంతుడ్ని తూల‌నాడినంత పాపం అన్జెప్పారు క‌దా మా గురువుగారు. అంచేత … నేన్జెప్పొచ్చేదంటే … బాపు ర‌మ‌ణ‌ల సిన్మాల్లో ఆరుద్ర‌తో పాటు చాలా మందిరి పాట‌ల్రాశార‌నే … వారు ప్రేమ‌గా రాయించుకున్న ఇంద్ర‌గంటి శ్రీకాంత‌శ‌ర్మ ఉన్నారు. గౌర‌వ భ‌క్తి భావ‌న‌ల‌తో ప‌ని జ‌రిపించుకున్న గుంటూరు శేషేంద్ర శ‌ర్మ ఉన్నారు.

వీరు కాక దాశ‌ర‌థి, కొస‌రాజు, సినారే, వేటూరి సుందర్రామ‌మూర్తి , జాలాదీల‌తో పాటు కొద్దిగా సీతారామ‌శాస్త్రి ఇలా మ‌రికొంద‌రున్నారు.ఇది మ‌నం ఒప్పుకుని తీరాల్సిన విష‌యం. ఇక పోతే, బాపు ర‌మ‌ణ‌లు ఆరుద్ర‌తో ఎక్కువ కంఫ‌ర్ట్ గా ఫీల‌య్యేవారు అన్న మాట అదేదో సిన్మాలో రావుగోపాల్రావు చెప్పిన‌ట్టు నూటికి నూరుపైస‌ల నిజం.

కంఫ‌ర్ట్ గా ఫీల‌వ‌డం వెన‌కాత‌ల ఓ క‌థుంది. త‌మ సినిమాల్లో పాట‌లు ఎలా ఉండాలో క్షుణ్ణంగా ఎరిగిన .. కొద్దో గొప్పో క‌విత్వం చ‌దువుకున్న రాయ‌గ‌ల ద‌మ్మున్న దర్శ‌క ర‌చ‌యిత‌లు బాపు ర‌మ‌ణ‌లు.ఈ విష‌యం ఒప్పుకుని తీరాలి … బాపు క‌విత్వం ఆయ‌న కార్టూనుల్లో క‌ళ్ల‌కు క‌డుతుంది. దాన్ని విడిగా వేసి అంటే బాపు క‌విత్వం అన్జెప్పెహేసి వేసేసి అమ్మేసుకోవ‌చ్చ‌నుకోండి … అది వేరుసంగ‌తి ..

.అది ప‌క్క‌న పెట్టేస్తే … బాపు ఆల్సో క‌వి .. ర‌మ‌ణగార‌స‌లు సాక్షాత్తూ క‌వే …అంచేత వారు త‌మ సినిమాల్లో పాట‌లకు సంబంధించిన రాజ్యాంగం త‌మ‌కు పూర్తిగా తెల్సుకాబ‌ట్టి … స‌ద‌రు క‌వుల‌ను పిల్చి కూర్చోబెట్టుకుని వారికి త‌మ హృద‌యం చెప్పి రాయించుకునేవారు.

ర‌మ‌ణ‌గారికి బాపుతో క‌ల్సి సినిమాలు తీసేప్పుడు ఈ జ‌బ్బు ప‌ట్టుకున్న‌ది అనే మాట వాస్త‌వం కాదండి ..
ఫ్ర‌మ్ ది బిగినింగ్ ఉందాయ‌న‌కి.పాట‌ల్రాసే క‌వుల‌తో కూర్చుని గుస‌గుస‌గా మాట్లాడేస్తూ వాళ్ల బుర్ర‌లు తీనేస్తున్నాడు ర‌మ‌ణ అని ఓ సారి ప‌ద్మ‌శ్రీ పుల్ల‌య్య‌గారికి కంప్లైంట్ వెళ్లింది ర‌మ‌ణ‌గారి మీద‌.

ఆయ‌న పిల్చి ఏంటంత మొగోడివేంటి? ఊర్కే ఆళ్ల మీద ప‌డి సంపేత్త‌న్నావంట నీ ప‌ని డ‌విలాగులు కుట్ట‌డం అద్జూడు మిగిలిన గోల నీకేలా? అన్నార‌ట …అదీ నిజ‌మే అనుకోండి అయినప్ప‌టికీ, ర‌చ‌యిత అనేవాడు … అంటూ ర‌మ‌ణ‌గారు చెప్ప‌బోతుండ‌గా అడ్డంగా అడ్డం ప‌డిన పుల్ల‌య్య‌గారు … ఇదంతా కాద‌య్యా … నువ్వు పాట రాయ‌గ‌ల‌వా? అద్జెప్ప‌స‌లు అని సీరియ‌స్ అయ్యారు.

దీంతో ఇజ్జ‌త్ కా స‌వాల్ అనిపించిన ర‌మ‌ణ‌గారు పాట రాయ‌డం సో వీజీ ఐ కెన్ అనేశాడు. అన్ట‌మేమిటి? ‘ప్రేమించి చూడు’లో మేడ‌మీద మేడ క‌ట్టి అంటూ పాట రాసి పుల్ల‌య్య‌గారితో నువ్వు రాయ‌గ‌ల‌వు క‌నుకే ఆళ్ల మెద‌ళ్లు తింటున్నావ్ ఐ అండ‌ర్ స్టాండ్ యు కెన్ గో అనిపించేసుకున్నారు …అట్టా ర‌మ‌ణ‌గారు ప్రూవ్డ్ క‌వి.

ఇట్టా న‌డుస్తా ఉండ‌గా … రోజుల‌న్నీ ఒకేలా ఉంటే ఆ భ‌గ‌మంతుడికి గిట్ట‌దు క‌నుక‌…దుక్కిపాటి మ‌ధుసూద‌న‌రావుగారికి ఓ సినిమా చేసే ఛాన్స్ త‌గిలింది బాపు ర‌మ‌ణ‌ల‌కి. ఆ సినిమా పేరు ‘పెళ్లీడు పిల్ల‌లు’.

పాట‌ల విష‌యంలో బాపు ర‌మ‌ణ‌ల్లాగే  దుక్కిపాటి వారికీ కొన్ని గోల‌లున్నాయ్. వీళ్లెట్టా ఆరుద్ర‌తోనూ సినారేతోనూ కంఫ‌ర్ట్ ఫీల‌వుతారో అట్టా వారు శ్రీశ్రీతోనూ ఆత్రేయ‌తోనూ కంఫ‌ర్ట్ ఫీల‌వుతార‌న్న‌మాట‌.అట్టా పెళ్లీడు పిల్ల‌లు పాట‌ల‌న్నీ కూడానూ శ్రీశ్రీ యున్నూ ఆత్రేయున్నూ రాశారు.

అల‌వాటు చొప్పున వాళ్లిద్ద‌రినీ ముఖ్యంగా ఆత్రేయ‌ను కాస్త స‌వ‌రించ‌బోయారు బాపు. సంగీతం విష‌యంలోనూ బాపుగారికి గ్రిప్పు ఉంది. నిజానికి ఆయ‌న మౌతార్గ‌న్ ప్లేయ‌ర‌ట‌. సినిమా ఆర్కెస్ట్రాలో ఓ నాల్రోజులు ప‌న్జేసి స‌ద‌రు సంగీత ద‌ర్శ‌కుడికి సంగీతం గురించి చెప్పి ఉద్యోగం ఊడి ఇవ‌త‌ల ప‌డ్డ చ‌రిత్ర ఉందాయ‌న‌కి.

ఇట్టా … త‌న సినిమాల‌కు సంగీతం చేసే మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌తో పాట‌ల‌కు ఏ రాగాలు వాడాల లాంటివ‌న్నీ మాట్లాడేసేవారాయ‌న పాపం…భ‌క్త క‌న్న‌ప్ప అప్పుడు ఆదినారాయ‌ణ‌రావుతో జ్ఞాన‌ప‌ర‌మైన క్లాష్ రాకుండా స‌త్యం గారు ఆదుకున్నార‌ని సాక్షాత్తూ బాపుగారే చెప్పారు క‌దా.

అయితే పెళ్లీడు పిల్ల‌ల విష‌యానికి వ‌స్తే ఆ సినిమాకు సంగీత ద‌ర్శ‌కుడు ఎమ్మెస్ విశ్వ‌నాథం. వారూ ఆత్రేయా క‌ల్సి ఓ పాట‌ను త‌యారు చేస్తూండ‌గా బాపుగారు స‌హ‌జంగా క‌లుగ చేసుకుని … ఏదో స‌వ‌ర‌ణ చెప్ప‌బోతే ఇద్ద‌రూ క‌ల్సి గ‌సురుకున్నార‌ట పాపం…గ‌సురుకోవ‌డం అనేది బాపుగారు ఈ సంద‌ర్భాన్ని చెప్తూ వాడిన మాటే.ఆ విధంగా … ఏం జ‌రిగిందీ అంటే ఎమ్మెస్వీ ఆత్రేయా క‌ల్సి గ‌సురుకుని తామ‌నుకున్న ప‌ద్ద‌తిలో పాట‌లు తయారు చేశార‌న్న‌మాట‌.

ఏమీ అన్లేని ప‌రిస్తితి … ఏమ‌న్నా అందామంటే  ప్రిన్స్ పాల్ గారేటంటారో అని ఓ చిన్న అనుమానం . అట్టా ఆరుద్రే కాదు బాపు ర‌మ‌ణ‌ల క‌వులెవ‌రూ ప‌న్జేయ‌ని సినిమాగా పెళ్లీడు పిల్ల‌ల‌కు ఓ రికార్డు ఉంది.అంచేతేటంటే … బాపుగారి సిన్మాల్లో ఆరుద్ర మాత్ర‌మే కాదూ ఇంకా చానా మందిరి పాట‌ల్రాశారూ అన్జెప్ప‌డానికే త‌ప్ప మ‌న‌కెందుకండీ .

పైగా బాపు ర‌మ‌ణ‌ల‌కు ఇంకో ఈక్నెస్సుంది … ఎవురైనా పెతిబావంతుడు అనాళ్ల‌కి గాని అనిపిస్తే నా సామిరంగా … ఆడు ఎవ‌డు? ఎక్క‌డుంటాడు లాంటివేవీ ప‌ట్టించుకోకుండా ఆళ్లింటికో ఫైన్ మార్నింగ్ ఎల్లిపోయి కాలింగ్ బెట్టు ఉంటే అదీ లేక‌పోతే త‌లుపూ కొట్టేసి … వాళ్ల‌ని బైట‌కి లాగేసి వాళ్లు వీళ్లొచ్చారేంట‌నే క‌న్ఫూజ‌నులో ఉండ‌గానే .. ఆశీర్వ‌దించి వ‌చ్చేయ‌డం అల‌వాటు.

అట్టా తూర్పువెళ్లే రైలు టైమ్ లో జాలాది క‌నిపించారు వీళ్ల‌కి .. అంతే వారిని పిల్చి అందులో పాట‌లు రాయించుకున్నారు … కో అంటే కోయిల‌మ్మ కోకో తో పాటు ఇంకో పాటేంట‌దీ సందెపొద్దు అందాలున్నా చిన్న‌దీ … కూడాను .. మిగిలిన‌యి ఎటూ ఆరుద్ర‌తోనే కానిచ్చేసుకున్నార‌నుకోండి … అలాన్న‌మాట ..

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!