Attraction of Bhouddham ……………………….
పై ఫొటోలో కనిపించే వ్యక్తి ఒక బౌద్ధ సన్యాసి. వేల కోట్లు ఆస్తులు వదిలేసి సన్యాసం స్వీకరించాడు. ప్రతి రోజు భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. ప్రాపంచిక సుఖాలపై విరక్తి కలిగి చిన్న వయసులోనే సన్యాసిగా మారాడంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటి అరుదైన వ్యక్తులు కొందరే ఉంటారు.
అజన్ సిరిపాన్యో తాను అనుకున్నది సాధించాడు.18 ఏళ్ల వయసులో 40,000 కోట్ల ఆస్తిని వదులుకుని బౌద్ధ సన్యాసిగా మారి 20 ఏళ్లుగా అడవుల్లోనే జీవిస్తున్నాడు.గౌతమ బుద్ధుడు రాజ్యాన్ని, సుఖాలను విడిచిపెట్టి సన్మార్గంలో నడిచేందుకు అడవులకు వెళ్లిపోయాడు. ఇప్పుడు ఆయన తరహాలోనే వెన్ అజన్ సిరిపాన్యో బౌద్ధ మతం స్వీకరించి సన్యాసిగా జీవిస్తున్నాడు.
ఇంతకూ ఈ సన్యాసి ఎవరంటే …. శ్రీలంక తమిళ సంతతికి చెందిన టెలికాం వ్యాపారవేత్త ఆనంద్ కృష్ణన్ కుటుంబానికి చెందినవారు. ఆనంద్ కృష్ణన్ బిలియన్ డాలర్ల టెలికాం సామ్రాజ్యానికి అధిపతి. కృష్ణన్ సామ్రాజ్యంలో టెలికాం పరిశ్రమ, మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్, రియల్ ఎస్టేట్, శాటిలైట్ వ్యాపారాలు ఉన్నాయి.కృష్ణన్ మలేషియాలో మూడవ అత్యంత సంపన్నుడు. ఆనంద్ కృష్ణన్ మ్యాక్సిస్ బెర్హాల్ కంపెనీ యజమాని.
ఆనంద కృష్ణన్ బౌద్ధమతాన్ని నమ్మేవారు. ఆయన పలు ధార్మిక కార్యక్రమాలకు ఆర్ధిక సహాయం చేసేవారు. అతని కుమారుడు సిరిపన్యో 18 సంవత్సరాల వయస్సులో బౌద్ధ సన్యాసి కావాలని నిర్ణయించుకున్నాడు. మొదట్లో సిరిపన్యో సరదా కోసం సన్యాసి జీవితాన్ని స్వీకరించినట్లు మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయి. తాత్కాలిక సన్యాసి అంటూ ఆయనను వెక్కిరించారు.
కానీ అవేవీ పట్టించుకోకుండా సిరిపన్యో మాత్రం భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. వెన్ అజన్ సిరిపన్యో రెండు దశాబ్దాలకు పైగా అడవులలో సన్యాసి జీవితాన్ని గడిపినట్లు చెబుతారు. అతను థాయ్‌లాండ్‌లోని డేటావో దమ్ మొనాస్టరీకి మఠాధిపతి గా ఉన్నారు. వెన్ అజన్ సిరిపన్యో తల్లి థాయ్ రాజకుటుంబానికి చెందిన వారని అంటారు. కుటుంబం నుంచి మొదట్లో కొంత వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ తర్వాత వారు రాజీ పడ్డారు.
సిరిపన్యో ప్రారంభ జీవితం అతని సన్యాస జీవితం కంటే తక్కువ. సిరి పన్యో విద్యాభ్యాసం గురించి సరైన సమాచారం లేదు.ఆయనకు బ్రిటన్‌లో ఇద్దరు చెల్లెళ్లు ఉన్నట్లు సమాచారం.వారితోనే బాల్యం గడిచింది. సిరిపన్యోకు 8 భాషల్లో ప్రావిణ్యం ఉంది. అనర్గళంగా మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్నట్టు మీడియా కథనాలు వెలువడ్డాయి.