ఆయనకు ‘రమణులు’ ఎంతమందైనా .. రమణుడు ఒక్కరే !!

Sharing is Caring...

Abdul Rajahussain………………………………………

చలం గారికి ఎంతో మంది రమణులు….కానీ,…రమణుడు’ మాత్రం ఒక్కడే.అరుణా చలం చేరడానికి ముందు వరకు చలం గారి రాసక్రీడల్ని‌ కథలు… కథలుగా చెప్పుకునేవారు. ఒక్క ‘స్త్రీ’ లో మాత్రమే తనకు ఆత్మానందం లభిస్తుందని ఆయన గట్టిగా నమ్మారు.వావివరుసల్ని కూడా పక్కనపెట్టి ఎందరితోనో శృంగారం నడిపారు.

అయితే రమణాశ్రమం ..చేరాక మాత్రం చలంగారి జీవితంలో నుంచి రమణులు క్రమంగా అదృశ్యమయ్యారు. ఒక్క రమణమహర్షి (భగవాన్) మాత్రమే చలంగారి ఆలోచనల్లో శాశ్వతంగా నిలిచిపోయారు.అరుణాచల శివుడు కూడా ప్రత్యక్షమై తనతో మాట్లాడుతున్నా కూడా రమణ మహర్షి మాత్రం చలం గారి హృదయంలో కొలువై పోయారు.

విజయవాడలో చలం గారి కుటుంబం ఇక వుండలేని పరిస్థితుల్లో కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుందామనే….ఆలోచన కూడా చుట్టిముట్టిన స్థితిలో చలం గారు కుటుంబ సమేతంగా విజయవాడ వదిలి ‘అరుణాచలం’ ….చేరుకున్నారు. (1950)

నిజానికి చలం గారిపై రమణుల వారి ప్రభావం అంతకు ముందు నుంచే వుంది.1937లో రాసిన ఓ ఉత్తరంలోచలం గారేమన్నారో చూడండి. “కాముకుడు,కథకుడు చలం‌ చచ్చిపోతున్నాడు.అప్పుడే…భగవాన్ కొంచెం ముక్కతినేశారు.అతనిలో నాకేదో సాక్షాత్కారమైందను కోకండి .కానీ నాలోని ఈ కాస్త మార్పే గాలి ని మరింత చల్లగా నూ,కాంతిని ఎక్కువ తేజోవంతంగాను,సముద్రాన్ని ఇంకా నీలంగానూ మార్చింది.ద్వేషాలే కరిగిపోతున్నాయి. మానవుల మీద కొత్త ప్రేమ ఉదయించింది.”
(చలంసాహిత్యం.సాదృశ్యం.ఎస్ రామచంద్ర.పే150)

ఇలా చలం గారిలో 1937నుంచే రమణుల వారి గురించి నిరంతర చింతన చోటుచేసుకుంది..! “ఆడపిల్లల నుంచి నేను పొందిన ఆనందం కన్న గొప్ప…. ఆనందాన్ని ఇస్తానంటున్నారు “భగవాన్ ‘ఆ ఆనందం కోసమే నా అన్వేషణ.”(చలం ..శశాంక, పే 71). “ఆధ్యాత్మికంగా అభివృధ్ధి కనబడుతోంది నాలో ఇప్పుడు నేను భగవాన్ భక్తుణ్ణి అనడానికి సంశయించను.” “తిని, సంభోగించి,సంతోషించి ,తృప్తిపడే మృగాలకు తప్ప అట్లా కాని మనబోటి వాళ్ళకి భగవాన్ ఒక్కడే ఆశ” (చలం.శశాంక 72,73,పే)

1949 లో “తిరువణ్ణామలై ” అంటే గిట్టని చలంగారికి 1950 నాటికి అదే ప్రియమైంది. అక్కడ శాశ్వతంగా
వుండటానికి “ భగవాన్ ( రమణ మహర్షి ) అంగీకరించడం చలం గారికి పెద్ద రిలీఫ్ ఇచ్చింది. ఇలా..తనను అరుణాచలానికి రప్పించుకున్నది రమణ మహర్షి (భగవాన్) అన్నది చలంగారి నిశ్చితాభిప్రాయం. 1950 మొదట్లో వొచ్చి ఓ ఇల్లూ పాకా అద్దెకి తీసుకుని వున్నారు.

భగవాన్ అప్పటికే జబ్బుపడి వున్నారు.అంత జబ్బులోనూ,ఆయన ఎంతో ఆదరంగా చూశారు చలంగారి వంక. వారి రాకకే ఎదురుచూస్తున్నట్లు. త్వరలోనే భగవాన్ అస్తమించారు. చలంగారు బాధపడ్డారు. “మేము ఆయన ముందు చావాలని వొస్తే, ఆయనే …మా ముందు వెళ్ళిపోయారని ” కన్నీటి పర్యంతమయ్యారు.భగవాన్ తనను తిరువణ్ణామలై కు రప్పించుకొని ఇలా అనాథను చేసి వెళ్ళిపోతాడని చలం గారు కలలోకూడా ఊహించలేదు.

ఈ విషయంలో భగవాన్ పై చలం గారు…. అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేసినా,…అది కేవలం భగవాన్ పై అలవిమాలిన ప్రేమ,భక్తే తప్ప మరొకటి కాదు..భగవాన్ వెళ్ళిపోయాక ఆశ్రమంలో ఎన్నో గొడవలు జరిగాయి.చలం గారిని టార్గెట్ చేసి కూడా కొందరు నిందించారు.భక్తులందరూ వెళ్ళిపోయారు. రమణనగర్ యెడారి అయింది. పగలే దొంగలు ఇళ్ళ తలుపులూ, కిటికీలూ తవ్వి తీసుకుపోతున్నారు.ఆశ్రమంతో పాటు చలం గారి కుటుంబం మాత్రమే మిగిలారు. 

కానీ నిర్యాణమప్పుడూ, తరువాత భయం పుట్టించే వొంటరితనంలోనూ భగవాన్ తమను ఆదుకుని, అర్థం గాని ధైర్యమిచ్చి రక్షించారని చలంగారు చాలాసార్లు చెప్పుకున్నారు. “భగవాన్ వెళ్ళేముందు తాను ఇక్కడే‌ వుంటానన్నారు.ఆ విశ్వాసంతోనే ఇక్కడే వుండిపోయినాం.”అదీ కాక ఇంకెక్కడికి పోము?”.అంటూ చలంగారు రమణమహర్షి పైనే భారం వేసి అక్కడే వుండిపోయారు.

విన్నపాలు వినవలె.. 

రమణమహర్షిని హృదయంలో నింపుకొని చలం గారు రాసిన…”విన్నపాలు ” చదివితే… భగవాన్ కు చలం గారు ఏ విధంగా అంకితమయ్యారో అర్థమవుతుంది.చలం గారు మనసుపెట్టి చేసిన రచన యిది.భగవాన్కు ఆయన చేసుకున్న “విన్నపాలు ” వినవలెనేగానీ..వాటి గురించి అడక్కూడదు. మరింకెందుకాలస్యం ? చలంగారి విన్నపాలను విందాం రండి.

“ఈ మేడ ఒక పెద్ద ధర్మశాల. రాత్రింబవళ్ళు నిమిష నిమిషం దిగుతున్నారు యాత్రికులు సామాన్లతో సంసారాలతో.దిగుతారు వెడతారు వస్తారు.అరుస్తారు.కేకలేస్తో..పోతారు.! బాగా అలవాటు పడ్డారు నా మూలానే.. ఒకటే రొద,నేను భరించలేని రొద.! కింద కాపురమున్న నన్ను అడగరు.వాళ్ళని ఆపడం నా చాతకాదు.  పైగా ఇది నా ఇల్లు,నామేడ అంటారు ప్రపంచం.!

నేను నిద్రపోతున్నా వొచ్చీపోయే యాత్రికులు ఆర్భాటపు సందడి హోరుమంటో వుంటుంది చెవుల్లో..
రంగు రంగుల బట్టలతో మధురమైన గీతాలు పాడుతో..ఫలహారాల పళ్ళాలు మోసుకుంటో వచ్చి దిగుతారు.నా నెత్తిమీదే దిగుతున్నారనీ వాళ్ళ భారమంతా నాదేనని, నా పనులన్నీ ఆలస్యమౌతున్నాయనీ మరో చూస్తో కిటికీ లోంచి చూస్తో సంతోషిస్తో …నుంచుంటాను…….
………………
ఇట్లా వీళ్ళ గోలలోనే గడిచిపోతోంది.ఈ రొదలోఎప్పుడో ఎవరో ” వస్తాను..నీ యిల్లు ఖాళీ అయిన రోజున నేను ఏకాంతంగా వస్తాను”..అన్నారన్న జ్ఞాపకం బాధిస్తుంది విడవకుండా మనసుని. “ముందు నీ యింటిని శుభ్రం చెయ్యి “. వొచ్చీపొయ్యే ఈ జనం మధ్య దుమ్ము ఎట్లా వూడవను.! బూజులెట్లా దులపను.నేలనెట్లా కడగను.
………………………………………….
ఏం అపరాధం చేశాను నేను..నన్నింత మోసం చెయ్యడానికి… అవును..నీ చూపులు నమ్మి , నిన్ను పొగిడిన నీ దొంగమిత్రుల మాటలు నమ్మి నిన్ను పిలిచింది నా తప్పు! అయినా నేను పిలిపించింది ఏముంది? అదే పనిగా రాత్రింబవళ్ళు వుత్తరాలు,కేకలు,కబుర్లు,కన్నీళ్ళు పడలేక సరేనన్నాను.

నా మనసిచ్చిందాకా ప్రతిదిక్కునా నీ చూపులే, ప్రతి స్థలంలోనూ నీ కంఠరవమే.ప్రతి ఇంట్లోను నీ సహాయమే.చీకట్లో ప్రతిమూలా నీ చేతులే ఇంకా చాతకాక సరేనన్నారు అదా నా తప్పు! ఈ ప్రపంచాన్నే ఎత్తి నా చేతుల్లో పెడతానన్నావు.నక్షత్రాలనే గుచ్చి నా మెళ్ళో వేస్తానన్నావు.’నేనే నీ వాడనైనప్పుడు.. నీకేం కావాలి అన్నాను.మరిచిపోయినావు.. కానీ,నేనెట్లా మరువను నిన్ను.!

పువ్వులు వెనుకనుంచి,నీ నవ్వులు,మబ్బులు వెనుక నించి నీదోబూచులు.నా కన్నీళ్ళు లో నీ నీడలు,
నా సుఖాలలోనీ స్పర్శలు ,నా నిద్దర్లో నీ రహస్యాలు. ఎట్లా మరువను నిన్ను! నేనే నువ్వు… నిన్నెట్లా విడుస్తాను? హృదయంలోనే కట్టేసుకున్నావుగా ఎట్లా వెళ్తాను.! అంటే..నమ్మాను నీ దొంగ మాటలు. ఎక్కడున్నావు? నా మల్లే మోసపోయిన నిర్భాగ్యులందరూ వాళ్ళ ఏడుపుల్లోంచి,తలెత్తి నవ్వుతున్నారు
నన్నుచూసి.ఎవరిది తప్పు భగవాన్…! నువ్వు చెప్పు పోనీ…!!

ప్రతీ మూలా దుమ్ములో దారిలో బిచ్చగాళ్లలో కూలి వాళ్ళలో పిల్లలతో పిట్టలతో తిరిగి చవకబడ్డ నువ్వు నాకెందుకు.? ఏం గొప్ప నువ్వు? ప్రపంచం నాకు కనబడకుండా ప్రపంచానికి నేను కాకుండా చెయ్యాలనీ నీ వుద్దేశం.కాని తప్పించుకోవడం నా చాత కావడంలేదు.వొదిలి పోరాదూ నువ్వు..”నిన్ను నేను వొదులు తానా నీ అంతం చూడంది” అంటున్నాడు చూడు.భగవాన్ “..!!

రమణమహర్షి దైవసాయుజ్యం పొందిన దశాబ్దం… తర్వాత చలం గారు చేసిన రచన యిది.చూడటాని
కి నిందా స్తుతిలా వున్నా…నిజానికి ఓ భక్తుడు తాను నమ్మిన భగవాన్ ముందు హృదయాన్ని తెరిచి చేసిన ‘ విన్నపాలివి.’ . భగవాన్ పై ఆరని వింత వ్యధని , ఎన్నడూ తీరని తృష్ణని చలం గారు ఇలా భగవాన్ కు ‘విన్నవించుకున్నారు’.!! “భగవానే….. సర్వం. భగవానే……సమస్తం.. భగవానే ……విధాత.!!

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!