ఆయనకు ‘సూపర్ స్టార్’ టైటిల్ ఎవరిచ్చారో తెలుసా ?

Sharing is Caring...

హీరో కృష్ణ సూపర్ స్టార్ ఎలా అయ్యారో  ఈ తరం లో చాలామందికి తెలియదు . అసలు కృష్ణ కు సూపర్ స్టార్ బిరుదు రావడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం  ఉంది. ప్రఖ్యాత దినపత్రిక ఆంధ్రజ్యోతి (ఇప్పటి యజమాన్యం కాదు ) 1977 ఫిబ్రవరి లో ‘జ్యోతి చిత్ర ‘ పేరిట ఒక సినిమా పత్రికను ప్రారంభించింది.

అప్పటికే ఈనాడు అధిపతి రామోజీరావు ‘సితార’ సినీ వీక్లి ని  మార్కెట్లోకి తీసుకొచ్చారు .సితార కి ధీటుగా జ్యోతిచిత్ర వచ్చేది. రెండు పత్రికలు మధ్య పోటీ మామూలుగా ఉండేది కాదు. సితార సర్క్యులేషన్ ను  జ్యోతిచిత్ర అధిగమించింది. సినీతారల అభిమానులను అలరించడానికి రకరకాల ఫీచర్స్ తో, వార్తలు,ఇంటర్వ్యూ లతో  ఆ రెండు పత్రికలూ ఆకర్షణీయంగా  ముస్తాబై  మార్కెట్లోకి వచ్చేవి. 

80 దశకంలో  జ్యోతి చిత్ర లో సూపర్ స్టార్ బ్యాలెట్ పోటీ మొదలు పెట్టారు. ఈ ఆలోచన అప్పటి ఎడిటర్  తోటకూర రఘు గారిదే. అభిమానులు పత్రికలో ఉండే బ్యాలెట్ పేపర్ ను కట్ చేసి ఎవరు సూపర్ స్టార్ టైటిల్ కి అర్హులో రాసి పత్రిక కార్యాలయానికి పంపించాలి. అలా వచ్చిన బ్యాలెట్ పేపర్లను హీరోలందరి అభిమానుల సమక్షంలో లెక్కించేవారు.

ఎక్కువ ఓట్లు వచ్చిన హీరో ను సూపర్ స్టార్ గా ప్రకటించేవారు.అభిమానులు సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ లెక్కింపు ప్రక్రియను చూడటానికి వచ్చేవాళ్ళు. అప్పట్లో విజయవాడ లబ్బీపేట లో ఉన్న ఆంధ్రజ్యోతి కార్యాలయంలోనే జ్యోతిచిత్ర ఆఫీస్ ఉండేది. ఆవిధంగా  సూపర్ స్టార్ బ్యాలెట్ పోటీ మొదలైంది.

మొదటి బ్యాలెట్ పోటీ లో అప్పటి స్టార్ హీరో ఎన్టీఆర్ సూపర్ స్టార్ గా ఎన్నికయ్యారు. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళాక నటుడు కృష్ణ సూపర్ స్టార్ గా ఎన్నికయ్యారు. అలా వరుసగా నాలుగేళ్లు కృష్ణ సూపర్ స్టార్ గా ఎన్నిక కావడం విశేషం. ఒక వార పత్రిక నిర్వహించిన ఈ పోటీ కి పెద్ద ఎత్తున క్రేజ్ రావడం కూడా విశేషం. 

ఒక వారపత్రిక లక్షకు పైగా కాపీలను ముద్రించి అమ్మడం అంటే మామూలు  విషయం కాదు. ఇండియా మొత్తం లోనే అత్యధిక సర్క్యులేషన్ గల సినిమా పత్రిక గా జ్యోతి చిత్ర పేరు సాధించింది. అప్పట్లో స్క్రీన్ పత్రిక ఎక్కువ సర్క్యులేషన్ తో నడిచేది. దాన్ని జ్యోతి చిత్ర అధిగమించింది.

ఈ విషయాల్ని పేర్కొంటూ తెలుగు తారల్లో  అత్యధిక ఫాలోయింగ్ ఉన్న నటులు ఎన్టీ రామారావు .. ఆయన తర్వాత కృష్ణ మాత్రమే అని  ప్రముఖ పత్రిక ఇండియా టుడే ఒక వార్తా కథనాన్ని కూడా ప్రచురించిందని తోటకూర రఘు తర్జని తో మాట్లాడుతూ అన్నారు.  హీరో కృష్ణ తర్వాత మరికొందరు నటులు సూపర్ స్టార్ గా ఎన్నికైనప్పటికీ … కృష్ణ ఒక్కరి  పేరు ముందు మాత్రమే సూపర్ స్టార్  బిరుదు అలా నిలిచిపోయింది.  

—-KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!