మన కిళ్లీ కొట్లలో ఏమేమి దొరకునో మీరెరుగుదురా?

Sharing is Caring...

సిమిలియనీర్ ‘ గా పేరు గాంచిన రావిశాస్త్రి అత్యంత ప్రమాదకరమైన రచయిత. యాతని యొక్క వ్యంగ రచనా వచన వైభవము ప్రభుత్వాలకు, పనికిమాలిన కొందరు రచయితలకు మరింత ప్రమాదకరము. రాజు మహిషి, ప్రేమ మనిషి, అంతేకాక దైవం సత్యం, న్యాయం ధర్మం అనే గొప్ప నవలలో మన కిళ్లీ కొట్లలో ఏమేమి దొరుకుతాయో బీభత్సంగా రాశారు. రావిశాస్త్రి శతజయంతి రోజున పడీ పడీ నవ్వుకోవడం కోసం….- Taadi Prakash

కిల్లీ కొట్లు మన భారతదేశములోని ప్రతి గ్రామములోనూ ఉండును. అచ్చట మీరు మిఠాయి లేక మసాలా కిల్లీలు మీ యిష్టానుసారము కొనవచ్చును. కిల్లీ కొట్లవద్ద కిల్లీలే కాకుండా జాడీ బీడీలున్ను, వాచి సిగరెట్లున్ను కూడా అమ్మకము చేయబడును. మీరు చిన్నవారైనచో అవి అక్కడ కొనుబడి చేసుకొని ఇంటిలో తెలియకుండా అక్కడనే కాల్చుకొనవచ్చును.

అగ్గిపెట్టె కావలసి వచ్చినచో అదికూడా కొనుబడి చేసికొనవచ్చును. లేనిచో; కాలే చేంతాడుకాని, మండే దీపపుబుడ్డికాని మీకక్కడ నిప్పుకి కొరతలేకుండా సిద్ధముగా లభించగలవు. మీకు దాహము కలిగినచో, కిల్లీ కొట్టువద్దకు పొండు! అచ్చట మీకు అల్లికాయ సోడాలే కాకుండా, లెమను సోడాలే కాకుండా రకరకాల రంగుబుడ్లు దొరకగలవు; అవి త్రాగినచో మీ దాహబాధ తీరగలదు. మీకు తక్కువ డబ్బులుండి ఎక్కువ ఆకలి వేయుచో అప్పుడుకూడా మీరు కిల్లీ కొట్టు వద్దకే పొండు!

అచ్చడ మీకు పండిన అరటిపండ్లు మెండుగ లభించును! అవి తినినచో మీ ఆకలి తీరును. అరటిపండ్లు తినుచు నంజుకొనుటకుగాను మీ కచ్చట గాజుసీసాలలో భద్రపరచిన కొబ్బరుండలు, ఎర్ర పంచదారుండలు, స్ట్రాంగు పెప్పరమెంటులు, చాకలేటులు వగైరాలు విరవిగ లభింపగలవు. రౌడీ మూకలతో చేరి మీకు తలలు బద్దలు చేసుకొనవలెనను తలంపు కలిగినదా? వెంటనే కిల్లీ కొట్ల వద్దకు పొండు! పొండు!

అచ్చటదొరకు సోడాబుడ్లను దొరకబుచ్చుకొని వాటిని మిక్కిలి చక్కని మారణాయుధములవలె మీరు ఉపయోగించుకొనవచ్చును. మీకు దెబ్బ తగిలినదా? వెంటనే కిల్లీ కొట్టు వద్దకు పొండు! ఆలసింపకుడు! అచ్చట సోడాతో దెబ్బను శుభ్రముగా కడిగికొని, కాచు కలిపిన సున్నము పూనుకున్నచో మీకు తగిలిన దెబ్బ త్వరితముగా మానగలదు. మీకు బ్రహ్మానందము కావలెనా?

పిరికితనమనే జ్వరమును మీరు పోగొట్టుకొనుటకున్ను, కష్టాల విషబాధలను మీరు దులుపుకొనుటకున్ను, మీ దేహమునకు విశ్రాంతి, మీ మనసుకు ఉల్లాసమూ… కలిగి మీకు బ్రహ్మానందము సిద్ధించుటకున్ను అనువుగా మద్యపానపు శాఖవారి రహస్యానుమతిపై కొన్ని కొన్ని ప్రత్యేకమైన కిల్లీకొట్ల వద్ద ఒకటవ రకం వంటసారా సరసమైన ధరకు మీకు లభింపజేయబడగలదు.

మీకు స్త్రీ వాంఛ ఉన్నచో… మీకు స్త్రీ వాంఛయున్నదా? చిత్తము చిత్తము! సంగతి గ్రహించితిని. మీకు వాంఛ అధికమై కంపెనీలు దూరమై భార్యలు గాని, ఏ తచ్చమాన చారికలు గాని కరవైనప్పుడు మీరొక ఆడ కిల్లీకొట్టు పరిచయ భాగ్యమును ముందుగానే సంపాదించుకొని యున్నయెడల మీకు సంభవించిన తాత్కాలిక కష్టదశ నిమిషములో కడతేరిపోవునే! మీరు కళాకారులా? మీకు సౌందర్యాపేక్ష కలదా? మీరు ఇంకెక్కడకూ పోకుండ కిల్లీకొట్ల వద్దకు పొండు!

కిల్లీకొట్లలో పటములు కట్టిన క్యాలెండర్ల బొమ్మలలో రంగు రంగులుగా పొదిగిన స్త్రీ సౌందర్యమును మీరు కనులారా ద్రావి, ఆనందించి ఆ సౌందర్యమునకు మించిన సౌందర్యము భూ ప్రపంచములో లేనేలేదని గ్రహించగలరు! మీరు భక్తులా? మీకు భగవంతుడు కావలెనా? మీకు భక్తియే కావలెనా? మీకు భక్తియే కావలెనన్న అది కిళ్ళీకొట్ల వద్ద మెండుగ లభించు ముఖ్య పదార్ధములలో నొకటికదా!

మళయాళపు కిల్లీకొట్ల యందు గురువాయూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మీరు దర్శించగలరు. కన్నడపు కిల్లీకొట్ల యందు శాంత సాయిబాబను మీరు కనులార గాంచగలరు. అరవయ్యరు కొట్టునందు మధుర మీనాక్షిని గాని, రామేశ్వరుని గాని ప్రాంతీయపు ఆరుముగమును గాని మీరు వీక్షించగలరు. మహమ్మదీయుల కిల్లీ కొట్టయినచో పటముకట్టిన కురాను సూక్తులు మీరు చదవగలిగినచో చదువుకొనగలరు. లేదా నయనానందకరముగ కాంచగలరు.

ఇవి యేవియునుగాక, ‘జాను దెనుంగు’ కిల్లీకొట్టే అయినచో శ్రీ వేంకటేశ్వరుని గాని, సింహాచలాధీశుని గాని, అన్నవరం సత్యనారాయణుని గాని, కాళహస్తీశ్వరుని గాని, కనకమహాలక్ష్మి, కనకదుర్గను గానీ, ముమ్మిడివరపు బాలయోగివార్ని గాని మీ తనువు పులకింప మీ డెంద ముప్పొంగజూచి, ఆ మేరకు మీ పాపములను కడతేర్చుకొని ఆపాటి పుణ్యమును మీరు మూటగట్టుకొనగలరు!

ఈలోపున మీరొక సోడా త్రాగి, ఒక కిళ్ళీ బిగించి ఒక సిగరెట్టు అంటించి, కనులు కాయలు కాసేలా సిటీ లేక రూటు బస్సుకొరకై వెయిటు చేయవచ్చును. పోస్టాఫీసులు మూసిన ఏ సమయమందైననూ హెచ్చు ధరలకు కవర్లు, కార్డులు, స్టాంపులు అన్నియును లభింపజేసికొనవచ్చును. అర్ధరాత్రి సమయములో లాడ్జింగు హవుసులోని మీ తాత్కాలిక ప్రేయసికి ఎమర్జంటుగా తోముడు సబ్బు, పాముడు పౌడరు, వాసన్నూనె, రబ్బరుపన్నె, సిగ పిస్ను ఇత్యాదులు కావలసి వచ్చినచో మీరు లాడ్జిబాయ్ ని కిళ్ళీకొట్టు వద్దకు తగిలినచో అవియన్నియు కూడా అధిక ధరలకు అచ్చట లభించగలవు.

ముక్కుపొడుము, పొగచుట్టలు, వారపత్రికలు, బూతు చిత్రములు, తలనొప్పి మాత్రలు, చెక్కపొట్లములు, దారపుండలు, పండ్లపొడులు, వగైరా వగైరాలు కావలయునన్నచో సరసమైన ధరలకు అవికూడా కిళ్ళీకొట్ల వద్ద మీకు లభింపజేయబడగలవు. మీకు లోకం పోకడ, సామాన్యుని వేదాంతము, రంగుల కథలు, పుక్కిటి పురాణములు ఇత్యాదులు కావలయునన్నచో అవి లభ్యమగుచోటు కిళ్ళీకొట్టు గాక వేరొండు గలదే!

అదియుంగాక, వర్ణవిద్వేషములు, మత వైషమ్యములు, ప్రాంతీయ దురభిమానములు లేని మన కిళ్ళీకొట్లు అవి మన పుణ్యభూమిలో బంగారు జాగాలు, అతి పవిత్ర స్థలములు, మనజాతికి గర్వకారణములు! వేయేల? సిరిసంపదలకు, బీదసాదలకు, గాంధి నెహ్రూలకు, వరదలకు వర్థంతులకు ఆలవాలమై హిందు బౌద్ధ శిఖ జైన పారశిక ముసల్మాను కిరస్తానీలకూ, పెను అమీరులకూ కడు గరీబులకు ఉనికిపట్టయి తిరోగమనమును ఆపుకొని పురోగమింప ప్రయత్నంచేసే మన పవిత్ర భారతదేశపు వర్తమాన (సెక్యులర్) సౌభాగ్యమునకు మన కిళ్ళీకొట్లు అతి ముఖ్య చిహ్నములు, మచ్చు వజ్రపు తునకలు!- రాచకొండ విశ్వనాధశాస్త్రి

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!