Story behind the photo ………………..
పై ఫోటోలో ఆ ఇద్దరినీ చూడగానే ఎన్నోవిషయాలు గుర్తుకొస్తాయి. అందాల నటుడు శోభన్ బాబు కి ఎందరో అభిమానులు ఉన్నారు. కానీ శోభన్ బాబు స్వయంగా నటి జయలలిత అభిమాని.జయలలిత తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్ గా ఉన్నసమయంలో శోభన్ బాబు కెరీర్ అంత ఊపులో లేదు. అపుడపుడే సినిమాలు హిట్ అవుతున్నాయి. నటుడిగా ప్రూవ్ చేసుకుంటున్నారు.
1966లో విడుదలైన ‘గూఢచారి 116’ సినిమాకు తొలుత శోభన్ బాబు హీరో అనుకున్నారు. హీరోయిన్ గా జయలలిత ఫిక్స్ అయ్యారు. అయితే శోభన్ హీరో అనగానే జయ తల్లి సంధ్య నిర్మాత నహతా తో ‘నో’ అందట. తర్వాత కృష్ణ ను హీరోగా పెట్టుకుని ఆ సినిమా తీశారు. అందులో శోభన్ చిన్న గెస్ట్ రోల్ వేశారు. అప్పటి నుంచి తన డ్రీమ్ గర్ల్ జయలలిత తో సినిమా చేయాలనే కోరిక అలాగే మిగిలిపోయింది.
తర్వాత ‘సంపూర్ణ రామాయణం’, ‘మానవుడు దానవుడు’,’కాలం మారింది’ వంటి సినిమాల్లో నటించి హీరో గా శోభన్ తన సత్తా చాటుకున్నారు. ఎట్టకేలకు 1973 లో శోభన్ కోరిక నెరవేరింది. నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి ‘డాక్టర్ బాబు’ సినిమా మొదలు పెట్టాలనుకున్నారు.
ఆ సమయంలో హీరోయిన్ గా ఎవరిని పెట్టాలని చర్చ జరగగా … శోభన్ జయలలిత పేరు సూచించారట. కృష్ణమూర్తి వెళ్లి అడగగానే జయ ఒకే అన్నారట. అప్పటికే జయ పెద్ద హీరోయిన్. ఆఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఒకే ఒక సినిమా ‘డాక్టర్ బాబు’. ఆ సినిమా ను తమ్మారెడ్డి మరో కుమారుడు లెనిన్ డైరెక్ట్ చేశారు.
అలా ఆఇద్దరిని అప్పట్లో కలిపింది నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి. ‘జయ ఒకే అన్నారు’ అనగానే శోభన్ చాలా సంతోష పడ్డారట.ఈ విషయాన్నీ కృష్ణమూర్తి కుమారుడైన తమ్మారెడ్డి భరద్వాజ తర్వాత రోజుల్లో మీడియా కు చెప్పారు. పై ఫోటో కూడా డాక్టర్ బాబు షూటింగ్ సమయంలో తీసింది.
డాక్టర్ బాబు సినిమా షూటింగ్ సందర్భంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి.తర్వాత కాలంలో ఆఇద్దరు మంచి స్నేహితులుగా మారారు.. చాలా పార్టీలకు వెళ్లేవారని, ఫంక్షన్స్ లో కనిపించే వారని వార్తలు కూడా వచ్చాయి.
ఈ క్రమంలోనే జయ తనను పెళ్ళిచేసుకోమని శోభన్ ను అడిగారని .. ఆయన అంగీకరించలేదనే కథనాలు వచ్చాయి.ఇదంతా ఎంజీఆర్ కి తెలిసి వార్నింగ్ ఇచ్చారని కూడా అంటారు.జయలలిత బాల్య స్నేహితురాలు చందాని, జయ,శోభన్ ల పెళ్లి ఫోటోలను చూసినట్టు ఒక ఇంటర్వ్యూ లో చెప్పినట్టు ప్రచారం జరిగింది.
డాక్టర్ బాబు సినిమా తర్వాత జయలలిత శోభన్ బాబు తో మరే సినిమాలో నటించలేదు. ఆ ఇద్దరి మధ్య ప్రేమ కు సంబంధించి అప్పట్లో వచ్చిన కథనాలు పూర్తిగా నిజాలు కావు. పూర్తిగా అబద్ధం కాదు అంటారు. జయలలిత రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఆ ఇద్దరు కలసిన దాఖలాలు కూడా లేవు.
చివరికి శోభన్ బాబు చనిపోయినపుడు కూడా జయలలిత చూడటానికి రాలేదు. అయితే మీడియాలో , సీరియల్స్ లో, బయో పిక్ లో వచ్చిన విషయాల సంగతి ఏమిటంటే వాటికి రుజువులు. ఆధారాల్లేవు అనేది నిజం.
ఒకటి రెండు సార్లు మీడియా ప్రతినిధులు ‘జయ తో ప్రేమ’ గురించి అడిగినపుడు శోభన్ బాబు ఆ విషయాలపై మాట్లాడేందుకు సుముఖత చూపలేదు. అలాగే జయలలిత కూడా డైరెక్టుగా ఎక్కడా ఏమి చెప్పలేదు. దీన్నిబట్టి ఆ ఇరువురి మధ్య ప్రేమ నిజమా అబద్దమా అనేది ఎప్పటికి సస్పెన్స్.. ఇపుడు ఆ ఇద్దరూ కూడా లేరు.
———–K.N.MURTHY