కొత్త ఫ్రంట్ లో కాంగ్రెస్ ఉండదా ?

Sharing is Caring...

Govardhan Gande ……………………………..

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కి వ్యతిరేకంగా మరో కొత్త ఫ్రంట్‌ ఏర్పాటు చేసే దిశగా తృణమూల్ అధినేత మమతా బెనర్జీ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తో పాటు మహారాష్ట్ర శివసేన నేతలను కూడా మమతా కలిశారు.పూర్తి విషయాలు బయటకు రాకపోయినా తెర వెనుక మంతనాలు సాగుతున్నాయి.

శివ సేన బీజేపీ కి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఆపార్టీని కూడా కలుపుకుపోయే అవకాశాలున్నాయి. చాలాకాలంగా శివసేన .. బీజేపీ ఉప్పునిప్పులా వ్యవహరిస్తున్నాయి. ఈ సందర్భంగానే దీదీ యూపీఏపై ఆసక్తికరమైన  కామెంట్స్‌ చేశారు. “ఇంకా యూపీఏ ఎక్కడుంది… ఎప్పుడో అంతరించి పోయింది ” అని చెప్పుకొచ్చారు. పైకి ఆమె యూపీఏ అని అన్నప్పటికీ కాంగ్రెస్ నే టార్గెట్ చేశారు.

కాంగ్రెస్ చురుగ్గా లేని విషయాన్నే పరోక్షంగా చెప్పారు. అంటే కాంగ్రెస్ లేకుండానే కొత్త ఫ్రంట్ ఏర్పాటు కావచ్చనే సంకేతాలు ఆమె ఇచ్చారు. అయితే అదంతా సులభమైన విషయమా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కాంగ్రెస్ ప్రస్తుతానికి బలహీనంగా ఉన్న మాట నిజమే కానీ కాంగ్రెస్ ను వదిలి యూపీఏ లోని మిత్ర పక్షాలు బయటకు వస్తాయా అనేది కూడా సందేహమే. కొంతమంది రావచ్చు.

దీదీ తనకు తాను ప్రత్యామ్నాయంగా భావించుకోవచ్చు. బీజేపీ వ్యతిరేక ఐక్యకూటమికి  నాయకత్వం వహించాలనే  ఆకాంక్ష కూడా ఉండొచ్చు…తప్పులేదు. కానీ నిజంగా ఆమెకు అంత శక్తి సామర్ధ్యాలు ఉన్నాయా అనేదే అసలు ప్రశ్న. ఎంత కాదన్నా .. కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఉనికి ఉంది. వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. రెండుమార్లు యూపీఏ సర్కార్ కి సారధ్యం వహించింది. అలాంటి కాంగ్రెస్ ను తప్పించి విపక్షాలను ఏక తాటిపై నడపగలరా ? అనేది కూడా సందేహమే. ఈ సందేహాలకు కాలమే జవాబు చెబుతుంది.

ఇక కాంగ్రెస్ విషయానికొస్తే పార్టీ దుస్థితిలో ఉన్న మాట వాస్తవమే. రాహుల్ గాంధీ సీరియస్ గా పనిచేయడం లేదు. సోనియా వయసు అయిపొయింది. పార్టీలో అంతర్గత సమస్యలున్నాయి. సోనియా కూడా దృష్టి పెట్టడం లేదు. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు గులాం నబీ ఆజాద్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ  300 సీట్లు గెలిచే పరిస్థితి కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. నాయకత్వ లేమితో పార్టీ కొట్టు మిట్టాడుతోందని ఆయన చాలాకాలం నుంచే చెబుతున్నారు.

ఇక వ్యూహకర్త పీకే కూడా గత పదేళ్ల కాలంలో 90 శాతానికి పైగా ఎన్నికల్లో ఓడిపోయిన ఒక పార్టీకి నాయకత్వం  వహించే  హక్కు దానంతట అదే రాదని మాట్లాడారు. ఆయన రాహుల్ ని  టార్గెట్ చేస్తూ మాట్లాడారు. మమతా వ్యాఖ్యలపై కొందరు కాంగ్రెస్ నేతలు కూడా భగ్గుమన్నారు. మొత్తం మీద బీజేపీ కి వ్యతిరేకంగా శిబిరాలు ఏర్పడే సూచనలు కనపడుతున్నాయి. ఈ శిబిరాలన్నీ కలసి పనిచేస్తాయా ? వేటికవే పని చేస్తాయా అనేది మరి కొంత కాలం పోతే కానీ తేలదు. వేటికవే సొంత దుకాణాలు  నడుపుకుంటే ప్రయోజనం శూన్యం.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!