అలాంటి అద్భుత చిత్రం మళ్ళీ రాదేమో ??

Sharing is Caring...

Ravi Vanarasi ………………

A sensation in film history…………

షోలే సినిమా ….భారతీయ చలనచిత్ర చరిత్రలో ఓ సంచలనం. ఒక కొత్త అధ్యాయం.కొత్త రచయితలకు, దర్శకులకు ఒక పెద్ద బాలశిక్ష.. ఒక తరానికి గుర్తుండిపోయే అనుభవం..1975 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదలైన ‘షోలే’ అరుదైన చిత్రాల్లో అగ్రస్థానంలో నిలుస్తుంది.

రమేష్ సిప్పీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, భారతీయ ప్రేక్షకులు చూడని సరికొత్త కథనం, ఉద్వేగభరితమైన సన్నివేశాలు, అద్భుతమైన నటన, మర్చిపోలేని సంభాషణలు, హృదయాన్ని తాకే సంగీతంతో ఒక సంచలనాన్ని సృష్టించింది.

సరిగ్గా యాభై సంవత్సరాల క్రితం వెండితెరపై ఆవిష్కృతమైన ఈ దృశ్యకావ్యం, నేటికీ ప్రతి తరాన్ని అలరిస్తూ, విస్మయపరుస్తూ, హాస్యంతో కవ్విస్తూ, విషాదంతో నింపుతూ, స్నేహానికి, త్యాగానికి, ప్రతీకారానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.

‘షోలే’ కేవలం ఒక యాక్షన్ సినిమా కాదు, అది సలీం ఖాన్, జావేద్ అక్తర్ అనే ఇద్దరు అసాధారణ రచయితల మేధస్సులో రూపుదిద్దుకున్నఒక అద్భుత సృష్టి. సర్గియో లియోన్ ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ది వెస్ట్’ అకీరా కురోసావా ‘సెవెన్ సమురాయ్’,  ది వైల్డ్ బంచ్, బుచ్ కాసిడీ అండ్ ది సన్‌డాన్స్ కిడ్  వంటి చిత్రాల స్ఫూర్తి తో తయారు చేసుకున్న కథ.

పల్లెటూరి వాతావరణం, అక్కడి ప్రజల అమాయకత్వం, వారిపై ఒక క్రూరమైన దొంగల ముఠా ఆగడాలు, ఆ దొంగలను అడ్డుకోవడానికి ఒక మాజీ పోలీసు అధికారి తీసుకున్న నిర్ణయం, కథలో తోడు స్నేహం, ప్రేమ, త్యాగం వంటి మానవ సంబంధాలు – ఇలా ఎన్నో అంశాలను ఒకే దారంలో అద్భుతంగా ఇముడ్చుకుంటూ పోయారు. ఇలాంటి కథను రచయితలు మళ్ళీ రాయలేకపోయారు .

జై’ , ‘వీరు’ అనే ఇద్దరు నిరాశ్రయులైన స్నేహితులు; ‘ఠాకూర్ బలదేవ్ సింగ్’ అనే నిజాయితీపరుడైన, ధైర్యవంతుడైన మాజీ పోలీసు అధికారి; ‘గబ్బర్ సింగ్’ అనే భారతీయ సినిమా చరిత్రలో ఇంతవరకూ చూడని అత్యంత క్రూరమైన, విలన్; ‘బసంతి’ అనే చలాకీ, మాటకారి, టాంగా నడిపే అమ్మాయి; ‘రాధ’ అనే మౌనంగా, విషాదభరితంగా తన జీవితాన్ని గడిపే ఒక వితంతువు. 

ఇలా ప్రతి పాత్రను సలీం-జావేద్ ద్వయం అత్యంత జాగ్రత్తగా, లోతైన వ్యక్తిత్వంతో సృష్టించారు. ప్రతి పాత్రకు ఒక నేపథ్యం, ఒక బలమైన లక్ష్యం, ఒక ప్రత్యేకమైన సంభాషణ శైలిని రూపొందించారు. ఈ పాత్రల మధ్య నడిచే సంభాషణలు కేవలం మాటలు కావు, అవి కథను ముందుకు నడిపే భావోద్వేగాల ప్రవాహాలు, హాస్యపు జల్లులు, తత్వశాస్త్ర సారాంశాలు. సినిమా నిడివిని బట్టి సంభాషణలు తగ్గించడం కాకుండా, ప్రతి సన్నివేశానికి ప్రాణం పోసేలా, ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయేలా వాటిని తీర్చిదిద్దారు.

‘షోలే’ కేవలం ఒక మంచి కథతో కూడుకున్న సినిమా కాదు; అది రమేష్ సిప్పీ అనే దర్శకుడి అద్భుతమైన దూరదృష్టి, పట్టుదల, సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనం. ఈ సినిమా నిర్మాణానికి సుమారు మూడు సంవత్సరాల సమయం పట్టింది. అప్పట్లో ఇది ఒక భారీ బడ్జెట్ (సుమారు రూ. 3 కోట్లు) చిత్రం.

సినిమాలోని ‘రామ్‌గఢ్’ అనే ఊరును సృష్టించడానికి బెంగళూరు సమీపంలోని రామనగర కొండలు, మైదానాలను ఎంచుకున్నారు. ఆ ప్రదేశంలో ఒక గ్రామాన్ని నిర్మించడం, రైల్వే ట్రాక్‌లు వేయడం, అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం వంటివి అప్పట్లో ఒక పెద్ద సాహసం.

సినిమాటోగ్రాఫర్ ద్వారకా దీచా కెమెరా పనితనం ప్రతి ఫ్రేమ్‌లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. విశాలమైన ప్రాంతాలు, రైలు దొంగతనం సన్నివేశం, గబ్బర్ సింగ్ అడ్డా, తుపాకీ కాల్పులు – ప్రతి షాట్ ను ఒక కళాఖండంలా తీర్చిదిద్దారు.

ఎడిటింగ్ బాధ్యతలు ఎం.ఎస్.షిండే అద్భుతంగా నిర్వహించారు. సినిమా కథన వేగం, యాక్షన్ సన్నివేశాల సమన్వయం, భావోద్వేగాలను బట్టి  సన్నివేశాల ఎడిటింగ్ కీలక పాత్ర పోషించింది. సౌండ్ డిజైన్ కూడా ఈ సినిమాకు ఒక ప్రత్యేకమైన ఆయువుపట్టు. తుపాకీ కాల్పుల శబ్దాలు, గుర్రాల డెక్కల చప్పుళ్లు, గబ్బర్ సింగ్ నవ్వు – ఇవన్నీ ప్రేక్షకులను సీట్లలో కట్టిపడేస్తాయి.

స్టంట్, కొరియోగ్రఫీ (వీరూ దేవగన్, ఎం.బి.శెట్టి) అప్పటి భారతీయ సినిమా స్థాయిని పెంచింది. రైలు దొంగతనం, జై-వీరుల సాహసాలు, గబ్బర్ సింగ్ ముఠాతో పోరాటాలు – అన్నీ సహజంగా, ఉత్కంఠభరితంగా చిత్రీకరించబడ్డాయి.

నటీనటుల ఎంపిక విషయంలో రమేష్ సిప్పీ చూపిన నిబద్ధత అభినందనీయం. జై పాత్రకు మొదట శత్రుఘ్న సిన్హాను అనుకున్నా, చివరికి అమితాబ్ బచ్చన్‌ను చేశారు.  గబ్బర్ సింగ్ పాత్రకు అప్పటికి పెద్దగా పరిచయం లేని అంజాద్ ఖాన్‌ను తీసుకోవడం – ఇలాంటి నిర్ణయాలు సినిమా విజయానికి ప్రధాన కారణమయ్యాయి.

రమేష్ సిప్పీ కథకు ఎవరు కరెక్ట్ గా సూట్ అవుతారో వారినే ఎంచుకోవడం విశేషం. సినిమాలో మనకు పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి. ప్రతి నటుడు తన పాత్రలో లీనమైపోయి నటించాడు, వారికి ఇచ్చిన బాధ్యతను అత్యంత అంకితభావంతో నెరవేర్చారు. అందుకేషోలే’ ఒక అరుదైన చిత్రంగా చరిత్రలో నిలిచి పోయింది. అలాంటి సినిమా మరల రాదేమో !

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!