HaveThey Shown theTruth Fearlesly? …………………………..
బీజేపీ ఎంపీ, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించి, దర్శకత్వం వహించిన పొలిటికల్ డ్రామా ‘ఎమర్జెన్సీ’ సినిమా సెన్సార్ క్లియరెన్స్ పొందింది. ఎట్టకేలకు జనవరి 17, 2025న థియేట్రికల్ విడుదలకు షెడ్యూల్ చేశారు. వాస్తవ సంఘటనల ప్రేరణ తో రూపొందిన ఈ చిత్రం సెన్సార్ బోర్డ్ అభ్యంతరాలను అధిగమించి సర్టిఫికెట్ సాధించడం విశేషమే.
కథ వివాదాస్పదమైన .. అల్లకల్లోలమైన ఎమర్జెన్సీ కాలం చుట్టూ తిరగడమే సెన్సార్ అభ్యంతరాలకు కారణం. కంగనా రౌనత్ దేశ తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళ గా గుర్తింపు పొందిన ఇందిరాగాంధీ పాత్రలో నటించారు.
ఇందిరా గాంధీ జీవితంలో కీలక ఘట్టాలైన ఆపరేషన్ బ్లూ స్టార్, ఎమర్జెన్సీ లకు సంబంధించిన ఘటనలు ఈ సినిమాలో ఉన్నాయి. ఇదొక పొలిటికల్ డ్రామాగా రూపొందింది. ఈతరం కు అప్పటి అంశాలు వివరించేలా ఈ సినిమా తీశారు. ఇది బయోపిక్ కాదని కంగనా ఇదివరకే ప్రకటించింది. మణికర్ణిక సినిమాకు పని చేసిన టీమ్ ఈ సినిమాకు కూడా పని చేసింది.
కంగనా ఇందిరను మరిపించారని బాలీవుడ్ వర్గాల సమాచారం. కంగనాకు సహజంగానే ఇందిర పోలికలు కొన్ని ఉన్నాయి. ఇక మేకప్ లో అచ్చం ఇందిర లాగానే స్టిల్స్ లో , టీజర్ లో కనిపించింది. టీజర్ కూడా బాగుంది. కొన్ని సన్నివేశాల చిత్రీకరణ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో జయప్రకాష్ నారాయణ్‌గా అనుపమ్ ఖేర్, అటల్ బిహారీ వాజ్‌పేయిగా శ్రేయాస్ తల్పాడే నటిస్తున్నారు.
సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, మొరార్జీ దేశాయ్, లాల్‌బహదూర్ శాస్త్రిల పాత్రలు కూడా ఉంటాయి.. గతంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తీసిన ‘తలైవి’ సినిమాలో జయలలిత పాత్రలో కంగనా నటించి మెప్పించింది. అంతకుముందు ‘మణికర్ణిక’ సినిమాలో ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో కూడా నటించి సత్తా చాటుకుంది.
ఈ సినిమా విడుదల మూడు సార్లు వాయిదా పడింది. ఈ చిత్రం సిక్కు సమాజాన్ని నెగటివ్ గా చూపిందని ఆరోపిస్తూ సిక్కు గ్రూపులు కోర్టును ఆశ్రయించాయి. కోర్టు ఆదేశాలతో సెన్సార్ బోర్డ్ ఈ సినిమాను మళ్లీ సమీక్షించింది. U/A సర్టిఫికేట్ జారీ చేస్తూ సినిమాకు దాదాపు 13 కట్‌లు.. కొన్ని సన్నివేశాలలో మార్పులు సూచించింది.
రివైజింగ్ కమిటీ మార్పులకు అనుగుణంగా .. థియేటర్లలో విడుదల చేయడానికి సర్టిఫికేట్ పొందాలని మేకర్స్‌కి తెలియజేసింది. కట్‌ల జాబితాలో కొన్ని హింసాత్మక సన్నివేశాలను తొలగించమని చెప్పింది. కొన్ని డైలాగుల్లో స్వల్ప మార్పులను చేయమని సలహా ఇచ్చింది. ఇవన్నీ చేసాక సెన్సార్ ఒకే చెప్పింది. జీ ప్రొడక్షన్స్ అండదండలతో మొత్తం మీద గండాలను గట్టెక్కి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.