ఎవరీ లోకనాథన్ ?

Sharing is Caring...
Bharadwaja Rangavajhala ……………………………………

బి.ఎస్.లోకనాథన్ తెలుగు ప్రేక్షకులకు కొత్త తరహా సినిమా చూపించిన కెమేరా దర్శకుడు. “అంతులేని కథ ” సినిమా చూసిన ప్రేక్షకులకు మొదటి సారి అతని పేరు తెర మీద కనిపించింది.తెలుగులో అతని మొదటి చిత్రం అదే.అప్పట్లో జాతీయ స్థాయిలో గానీ ప్రాంతీయ స్థాయిలోగానీ కెమేరా విభాగానికి ఇచ్చే అవార్టులు రెండు విధాలుగా ఉండేవి.

నలుపు తెలుపు చిత్రాల ఛాయాగ్రహణంలో అత్యుత్తమంగా చేసిన వారికి బ్లాక్ అండ్ వైట్ విభాగంలోనూ, రంగుల్లో అద్భుతమైన కెమేరా పనితనం కనపరచిన వారికి రంగుల విభాగంలోనూ అవార్టు ఇచ్చేవారు. అలా 1975 సంవత్సరానికి గాను బ్లాక్ అండ్ వైట్ విభాగంలో లోకనాథన్ కు జాతీయ స్థాయిలో ఉత్తమ ఛాయాగ్రాహకుడి అవార్టు వచ్చింది. సినిమా పేరు “అపూర్వరాగంగళ్”.  బాలచందర్ తీసిన ఆ సినిమాను తెలుగులో “తూర్పూ పడమర” పేరుతో దాసరి రీమేక్ చేశారు.

బాలచందర్ దర్శకత్వం వహించిన సుమారు 55 చిత్రాలకు లోకనాథన్ కెమేరా దర్శకత్వం వహించారు. ఆయన తర్వాత ఆయన దగ్గర సహాయకుడుగా పనిచేసిన ఆర్. రఘునాథరెడ్డి బాలచందర్ సినిమాలకు పనిచేసేవారు. కెమేరా దర్శకుడుగా లోకనాథన్ తొలి చిత్రం “అరంగేట్రం”. ఈ సినిమాకు బాలచందరే డైరక్టరు. దక్షణాదిన న్యూవేవ్ మూవీగా సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా అది.ఆ సినిమానే తెలుగులో “జీవితరంగం” పేరుతో రీమేక్ చేశారు.

బాలచందర్ తీసిన మరోచరిత్ర, ఇది కథ కాదు, ఈరంకి శర్మ తీసిన నాలాగా ఎందరో, చిలకమ్మ చెప్పింది చిత్రాలకూ బిఎస్ లోకనాథనే కెమేరా పనిచూసుకున్నారు. ఇవన్నీ కూడా కలర్ వేవ్ లో వచ్చిన బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు. వీటన్నిటిలోనూ కెమేరా పనితనం అద్భుతంగా ఉంటుంది.

ముఖ్యంగా మరో చరిత్ర అయితే కలర్ లో తీయకపోబట్టే అంత ఇంపాక్ట్ వేసిందా అన్నట్టు ఉంటుంది. ఇది అది అని చెప్పడం సాధ్యం కాదు… ప్రతి షాటూ అద్భుతమే. బాలచందర్ తో ట్యూన్ అయినట్టు మరే దర్శకుడితోనూ తనకు సెట్ అవలేదనేవారు లోకనాథన్.

బ్లాక్ అండ్ వైట్ లో వచ్చిన బాలచందర్ మల్టీ స్టారర్ మూవీ “ఇది కథ కాదు” సినిమాలో జోలపాట పాడి ఊయలూపనా పాటలో కెమేరా వర్క్ చాలా బాగుంటుంది. మల్టీ స్టారర్ అనడం ఎందుకంటే … కమల్ హసన్, చిరంజీవి, శరత్ బాబు ముగ్గురు హీరోలు ఉన్నారు కనుక.ఏమిటి లోకనాథన్ సినిమాల్లో బ్లాక్ అండ్ వైట్ లో అంత స్పెషల్ గా తీస్తాడూ అంటే …. ఆయన జీవితం ప్రారంభించింది మార్కస్ భార్ట్లే దగ్గరన్నమాట. చాలా సుదీర్ఘకాలమే భార్ట్లే దగ్గర పనిచేశాడు.

మార్కస్ భార్ట్లే సృష్టించిన వెన్నెలను చాలా మంది విజయావారి వెన్నెల అని పిలిచేవారు. అలా భార్ట్లే బ్లాక్ అండ్ వైట్ లో ఎంత డెప్త్ తో సీన్ నడిపించవచ్చో చెప్తూ చూపించిన దృశ్యాలు అక్షరసత్యాలని ప్రపంచం గుర్తించింది.ఆయన వారసుడు లోకనాథన్ తీసిన సినిమాలే అందుకు ఉదాహరణ. బాలచందర్ కూడా రంగుల్లోకి మారాక లోకనాథన్ కూ తప్పలేదు. అందమైన అనుభవం , ఆకలి రాజ్యం చిత్రాల మొదలు బాలచందర్ కలర్ వైపు టర్న్ అయ్యారు. కోకిలమ్మ వరకు ఆయనే కెమేరా దర్శకుడు.

చిరంజీవి తొలి చిత్రం ప్రాణం ఖరీదుకు లోకనాథనే కెమేరా దర్శకుడు అనుకుంటారు చాలా మంది. కాదు. ఆయన దగ్గర పనిచేసిన రఘునాథరెడ్డి ప్రాణం ఖరీదుకు ఛాయాగ్రహణ దర్శకుడుగా పనిచేశారు. చిరంజీవి సొంత బ్యానర్ అంజనా ప్రొడక్షన్స్ తీసిన తొలి చిత్రం రుద్రవీణకూ రఘునాథరెడ్డే కెమేరా దర్శకుడు కావడం విశేషం.ఇలా తెలుగువారికి ఎన్నో గొప్ప దృశ్యాలను కళ్లకు కట్టిన లోకనాథన్ 2011 డిసెంబర్ నెల్లో కన్నుమూశారు.అప్పటికి చాలా కాలం క్రితమే తను కెమేరా దర్శకత్వానికి దూరమై తన శిష్యుడికి అప్పగించారు.
లోక్ నాథ్ కీ…  లోక్ సింగ్ కీ మన వెబ్ బ్యాచ్ వారు తేడా చూడ్డం లేదు పాపం.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!