AG Datta …………………………………….
ఉద్దామ్‌ను దళిత సిక్కు అని సినిమాలో ఎక్కడా ప్రస్తావించనందుకు చిత్ర యూనిట్‌కు ముందుగా ధన్యవాదాలు. 1919లో బ్రిటీష్ వాండ్లు రౌలత్ చట్టాన్ని తీసుకొని రావడం వెనుక రష్యాలో విజయవంతమైన సోషలిస్ట్ విప్లవం, మొదటి ప్రపంచ యుద్దం ప్రభావం ఉంటుంది.
రష్యా విప్లవ విజయం అనేక దేశాల్లోలానే భారత్‌లోని యువతలో కొత్త ఆశలు చిగురించడానికి కారణమైంది. ఇలా చిగురించే ఆశలను మొగ్గలోనే చిదిమేయడమే లక్ష్యంగా రౌలత్ చట్టాన్ని తీసుకొస్తారు.దేశవ్యాప్తంగా రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతుంటే ఒక్క అమృత్‌సర్‌లోనే అంత దారుణమైన నరమేధానికి బ్రిటీషర్లు ఎందుకు ఒడిగట్టారన్నది కశ్వన్ మార్క్!
భౌతికంగా ముప్పు కలిగించే ధైర్యం పంజాబీలకే ఎక్కువ ఉందని బ్రిటషర్ల అనుమానం. దీనికి తొలి సిపాయి తిరుగుబాటు అనుభవం కూడా తోడై ఉండవచ్చు. అంతే కాక, జలియన్‌వాలా బాగ్ ఉదంతం యావత్ దేశానికి ఒక గుణపాఠంగా కూడా ఉంటుందని బ్రిటీషర్లు భావించి ఉంటారు. అయితే అదే జలియన్‌వాలాబాగ్ భారతీయ లెనిన్‌గా భావించే సర్దార్ భగత్‌సింగ్ ఆవిర్భావానికి కారణమవుతుందని చరిత్రకు బానిసలైన బ్రిటీషర్‌లు ఊహించి ఉండరు. హనుమంతుడి రొమ్ము చీలిస్తే లోపల రాముడుంటాడో లేదో కానీ, ఉద్దాంలో మాత్రం సర్వం భగత్‌సింగ్ మయమే!
అసలు ఈ భగత్‌సింగ్, ఉద్దాం, లేదా సుఖదేవ్ లాంటి సమర యోధులు ఎవరు? వీళ్లనంత ఏకం చేసిన శక్తి ఏదీ? వీరంతా విడివిడి వ్యక్తులుగా తమకు తోచినట్లు పోరాడుకుంటూ పోయారా? ఈ ప్రశ్న గురించి చర్చించడానికి ముందు జలియన్‌వాలాబాగ్ తరువాత దేశంలో బ్రిటీషర్‌ల ఉనికిని సవాల్ చేసే చర్య ఏదైనా జరిగిందా అన్నది తెలుసుకోవాలి.
1919 ఏప్రిల్ 13న జలియన్‌వాలాబాగ్ మారణకాండ జరిగితే, సరిగ్గా ఏడాది తరువాత 20వ శతాబ్దిలో బ్రిటీషర్లపై తొలి సాయుధ పోరాటానికి శంఖారావం పూరించిన వాడు అల్లూరి సీతారామరాజు. రెండేళ్ల ప్రణాళిక తరువాత 1922 నుంచి అల్లూరి యుద్దం మొదలవుతుంది. అల్లూరి సీతారామరాజు గాల్లోంచి రాలేదు. బెంగాల్ విప్లవకారులు బృందం ఏర్పాటు చేసిన అనుశీలన సమితి నుంచి పోరాట విద్యలు నేర్చుకుంటారు.
అనుశీలన సమితిని ఏర్పాటు చేసింది, అరవింద్ ఘోష్. పాండిచ్చేరీలో అరవిందుడిని అల్లూరి కలిసి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక 1924లో అల్లూరి మరణం తరువాత సరిగ్గా అదే సంవత్సరంలో మొత్తం అనుశీలన సమితిని సచ్చింద్రనాథ్ సన్యాల్ ఆధ్వర్యంలో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్‌గా మార్చేస్తారు. ఇందులో చేరిన భగత్‌సింగ్ దీన్ని హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్‌గా మార్చడంతో H.S.R.A.గా ప్రసిద్ధి పొందుతుంది.
ఈ H.S.R.Aని గాంధీ తీవ్రంగా తప్పుబడతారు. యంగ్ ఇండియా పత్రికలో 1930లో cult of bomb పేరుతో ఓ వ్యాసం రాస్తారు. గాంధీ విమర్శలకు ప్రతిగా H.S.R.A నుంచి మరో ఘాటైన సమాధానం వస్తుంది, దాని పేరు Philosophy of Bomb. భగత్‌సింగ్ మరణం తరువాత జర్మనీ మీదుగా లండన్ చేరుకున్న ఉద్దాం సింగ్ ఏకైక లక్ష్యం జలియన్ వాలాబాగ్ మారణకాండకు కారణమైన మైఖెల్ ఓ డయ్యర్‌ను కాల్చి చంపడం ఒక్కటే కాదు.
భారతీయ సాయుధ స్వాతంత్ర్య పోరాటానికి అంతర్జాతీయంగా ఆయుధాలు, నిధులు, మద్దతు సంపాదించడం. 1934లోనే లండన్‌లో కాలు మోపిన ఉద్దాం డయ్యర్‌ను చంపడానికి 1940 వరకు ఎదురు చూడాల్సిన పని లేదు. వచ్చిన మొదటి నెలలోనే పని పూర్తి చేసుకొని ఇండియాకి తిరిగి రావచ్చు. కాని, వెళ్లిన పని వేరు, ఇంగ్లాండ్ కమ్యూనిస్టు పార్టీ ద్వారా ఐర్లాండ్ ఐరిష్ రిపబ్లిక్ ఆర్మీ IRAతో సంబంధాలు పెట్టుకుంటాడు. రష్యా నుంచి, జర్మనీ నుంచి భారత్‌కు మద్ధతు కోసం ప్రయత్నాలు చేస్తాడు.
ఇక మైఖేల్ ఓ డయ్యర్‌ను కాల్చి చంపడానికి ఒక చారిత్రాత్మక దశ ఉంటుంది, అదే ఇంగ్లాండ్‌పై జర్మనీ దాడికి దిగే సమయం, 1940 ప్రారంభం. రవి అస్తమించని మహా సామ్రాజ్యం నడిబొడ్డును ఉద్దాం స్వేచ్ఛా ప్రకటన చేస్తాడు. ప్రకటన ప్రతిసారీ పదాల రూపంలో ఉండకపోవచ్చు, అది తుపాకీ గుళ్ల రూపంలోనూ ఉండవచ్చు. డయ్యర్‌ను కాల్చి చంపడంతో యావత్ ఇంగ్లాండ్ చిగురుటాకులా వణికిపోతుంది.
తెల్లోడి గడ్డపై తెల్లోడి కోర్టులో భారత సింహం ఉద్దాం సింగ్ గర్ఝన. (ఇది పాఠం, మీకు సినిమాలో కనిపించదు) ” బ్రిటీష్ సామ్రాజ్యవాదం నశించాలి. మీరు లేకపోతే భారత్‌కు శాంతి ఉండదని అంటారు. తరతరాలుగా బానిసలను చేసిన మా బూటకపు నాగరికత మాలో ప్రతిదాన్ని మురికికూపంగా దిగజార్చివేసింది. మా చరిత్ర సరే, ఇప్పుడు మీ సొంత చరిత్ర చదువుకోండి. అత్యంత కౄరత్వం, రక్తదాహంతో నిండిన మీ చరిత్రను దాచేసి, ప్రపంచంలో నాగరిక పాలకులుగా మీ చెత్త మేధావులు చెప్పుకుంటారు. నిజానికి మీ చరిత్ర అంతా లంజాకొడుకుల రక్తంతో రాసిందే..
”నేనీ రోజు మరణిస్తాను, నా మరణం నుంచి వేలాదిమంది వీరులు పుట్టుకొచ్చి మీ మురికి కుక్కలను భారత్ నుంచి తరిమేస్తారు.”నేను ఇంగ్లాండ్ ప్రజలకు వ్యతిరేకం కాదు, ఇంగ్లాండ్ కార్మికుల పట్ల నాకు సహానుభూతి ఉంది. ఇంగ్లాండ్ సామ్రాజ్యవాదం నశించాలి.”బ్రిటీష్ ఇంపీరియలిజం నశించాలి.. బ్రిటీష్ మురికి కుక్కలు నశించాలి..” బోను నుంచి దిగి వెళుతూ ఉద్దాం బ్రిటీష్ న్యాయస్థానంపై గట్టిగా ఘాండ్రించి ఉమ్మేస్తాడు.
(ఉద్దం చర్యను మతిమాలిన పనిగా 1940లో విమర్శించిన జవహర్‌లాల్ నెహ్రూ 1962లో మాత్రం అయ్యో పాపమని కొంచెం ముసలి కన్నీరు కారుస్తారు)
సర్దార్ ఉద్దామ్ ’.. అమెజాన్ ప్రైమ్ లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. ఆస్కార్ కి షార్ట్ లిస్ట్ అయిన ఈ బయోపిక్ డ్రామా ను దర్శకుడు సూజిత్ సర్కార్ తీశారు. ఇప్పటిదాకా వచ్చిన బయోపిక్‌లకు భిన్నంగా కేవలం సెంటర్ ఆఫ్ పాయింట్ మీద నడిచిన డ్రామా ఇది. అందులో విక్కీ కౌశల్ నటన అమోఘంగా ఉండడంతో పాజిటివ్ రివ్యూలు, ప్రశంసలు దక్కించుకుంటోంది ఈ సినిమా. అందరికి నచ్చకపోవచ్చు.. సీరియస్ సినిమాలు చూసే వారికి బాగా నచ్చుతుంది.