ఎవరీ హోమీ జహంగీర్ బాబా ?

Sharing is Caring...

మన దేశం అణుపరీక్షల్లో సత్తా చాటడానికి తెర వెనుక నుంచి ఎందరో శాస్త్రవేత్తలు కృషి చేశారు. ప్రభుత్వానికి సహకరించారు. వారిలో హోమీ జహంగీర్ బాబా .. అబ్దుల్ కలాం కీలక వ్యక్తులు. హోమీ జహంగీర్ బాబా ను భారతీయ అణు పరిశోధనా రంగ రూపశిల్పి అంటారు.

1909లో ముంబాయిలో జన్మించి, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసుకుని స్వదేశానికి తిరిగి వచ్చి, 1945 సంవత్సరంలో “ TATA Institute of fundamental research” ను స్థాపించారు. బాబా  1937లోనే ‘‘కాస్మిక్ రేడియేషన్’’ పై పరిశోధనలు జరిపి ‘‘మిసాన్’’ అనే కణాలను కనుగొన్నారు.  ఈ పరిశోధనతో  జహంగీర్ బాబా విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

1948లో ఆటమిక్ కమీషన్ కు అధ్యక్షునిగా ఎన్నికై భారతీయ అణుశక్తి నిర్మాణానికి బాబా రూపు దిద్దారు. ఇది ఆయన  దూరదృష్టికి చక్కని తార్కాణం గా చెప్పుకోవచ్చు.  ఈ అణు శక్తి నిర్మాణం ద్వారా ఇండియా ఇతరుల మీద ఆధారపడకనే సొంతంగా అణుశక్తి రంగంలో స్వావలంబన సాధించింది.

1963 సంవత్సరంలో తారాపూర్ లో  మొదటి అణురియాక్టర్ ను భారతదేశం నిర్మించింది. ఇది బాబా చలవే. ఆ తర్వాత  రెండు సంవత్సరాల కాలంలోనే ప్లూటోనియం ప్లాంట్ నిర్మించి బాబా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.1966వ సంవత్సరంలో ఒక విమాన ప్రమాదంలో బాబా మరణించటం నిజంగా విషాదం. కానీ ఆయన మరణానంతరం ప్రపంచం భావించినట్లుగా భారతీయ అణుకార్యక్రమం కుంటుపడలేదు. 

బాబా రూపకల్పన చేసినట్లుగానే 1974 సంవత్సరంలో పొక్రాన్ మొదట అణుశాస్త్ర ప్రయోగం విజయవంతంగా పూర్తి అయింది.  దీనితో ప్రపంచంలో అణుప్రయోగం చేసిన ఆరవ దేశంగా భారతదేశం ఖ్యాతి గాంచింది. ప్రస్తుతం  విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించే అణురియాక్టర్ లలో ‘‘ఫాస్ట్ బ్రీడర్ టెక్నాలజీ’’ కి   అప్పట్లోనే బాబా రూపకల్పన చేశారు.

అణురియాక్టర్లలను మూడు దశలలో వినియోగించుకునే విధానం రూపొందించింది కూడా  బాబానే. అణు కార్యక్రమాలకు కావలసిన యురేనియమ్ అనే ఇంధనం ఇండియా  అంతగా లభించదు. కాబట్టి, దానికి ప్రత్యామ్నాయంగా థోరియం అనే ఇంధనాన్ని ఉపయోగించి అణుశక్తి ద్వారా విద్యుత్పత్తి చేసే కార్యక్రమానికి  ఆనాడే బాబా రూపకల్పన చేశారు. 

హోమీ జహంగీర్ బాబా ముంబైలోని ఒక సంపన్న పార్సీ కుటుంబంలో జన్మించారు. ఆయన  తండ్రి జహంగీర్ హోర్ముస్జి బాబా  న్యాయవాది గా పనిచేశారు. మొదట్లో బాబా  బొంబాయి లోని కేథడ్రల్ స్కూల్‌లో చదివాడు. ఆ తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో చదువుకున్నారు. కుటుంబ పెద్దల కోరికల ప్రకారం మెకానికల్ ఇంజనీరింగ్ లో చేరారు.  

భౌతిక శాస్త్రవేత్త పాల్ డిరాక్ ప్రభావంతో సైద్ధాంతిక భౌతిక శాస్త్రాన్ని కూడా అభ్యసించారు. ఆ కోర్స్ చేయడమే ఆయన జీవితాన్ని మలుపు తిప్పిందంటారు. దేశంలో పేదరికాన్ని తగ్గించడానికి అణు రియాక్టర్ ఉత్పత్తిని ఉపయోగించాలని బాబా చెప్పేవారు. నాటి ప్రధాని  నెహ్రు బాబాకు క్యాబినెట్‌లో ఒక పదవిని ఆఫర్ చేయగా బాబా సున్నితంగా తిరస్కరించారు.

ప్రధానమంత్రులు నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రిలకు బాబా సలహాదారుగా పని చేశారు.అణుపరిశోధన రంగంలో బాబా  చేసిన కృషిని గుర్తించి  ఎన్నో సంస్థలు ఆయనకు అవార్డులను బహూకరించాయి. పురస్కారాలతో సత్కరించాయి. బాబా కు 1942 లో ఆడమ్స్ ప్రైజ్ పురస్కారం .. 1954లో పద్మభూషణ్ పురస్కారం లభించాయి. 

బాబా తన జీవితంలో బ్రహ్మచారిగానే మిగిలిపోయారు. జనవరి 24, 1966న స్విట్జర్లాండ్‌లోని మోంట్ బ్లాంక్ సమీపంలో ఎయిర్ ఇండియా ఫ్లైట్  క్రాష్ అయి ఆయన దుర్మరణం పాలయ్యారు. భారత్ లో అణు కార్యకలాపాలు ముందుకు సాగకూడదనే లక్ష్యంతో ఆయనను అంతమొందించారనే ఆరోపణలున్నాయి. ఈ కుట్ర వెనుక సీఐఏ హస్తముందని అప్పట్లో చెప్పుకున్నారు. బాబా మరణించేనాటికి ఆయన వయసు 56 సంవత్సరాలు మాత్రమే.

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!