A common young woman’s fight with the rich guys………………….
బర్రెలక్క….. సోషల్ మీడియా లో ఈ మధ్య కాలంలో బాగా వినబడుతున్న పేరు.. అలాగే బాగా పాపులర్ అయిన మహిళ. ఈ బర్రెలక్క అసలు పేరు శిరీష. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బర్రెలక్క రంగంలో దిగారు.
నిరుద్యోగుల ప్రతినిధిగా బరిలోకి దిగానని చెబుతున్న ఆమెకు భారీగా మద్దతు లభించడం తో ప్రచారం లో దూసుకుపోతోంది. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తానని శిరీష హామీ ఇస్తున్నారు.
సామాజిక మాధ్యమాల్లో ఆమెకు బాగా ఆదరణ లభిస్తోంది. క్రమంగా ఫాలోయింగ్ కూడా పెరుగుతోంది. ఎన్నికల ఖర్చులకు కొంతమంది ఆర్ధిక సహాయం కూడా చేస్తున్నారు. నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన శిరీష అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీకాం డిగ్రీ పూర్తి చేసింది.
ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయింది. అయితే పేపర్ల లీకులు, కోర్టు కేసులు, పరీక్షలు వాయిదా పడడంతో నిరాశ పడింది. ఈ క్రమంలో ఆమె ఇంటి వద్ద బర్రెలు కాస్తూ ఓ వీడియో చేసింది.అందులో తన గురించి చెప్పుకుంది. “ఎన్ని డిగ్రీలు చేసినా ఉద్యోగం రావడం లేదు. మాయమ్మను అడిగి నాలుగు బర్లు కొన్న. ఉదయం, సాయంత్రం ఆరు లీటర్ల పాలు ఇస్తాయి” అని వీడియోలో తన ఇబ్బందులు చెప్పుకుంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆమె పేరు బర్రెలక్కగా మారిపోయింది. ఆ తర్వాత అధికార పార్టీకి చెందిన వారు తనపై కేసు పెట్టారని కూడా బర్రెలక్క చెప్పింది.అయినా భయపడకుండా బర్రెలక్క పోరాటం చేస్తోంది.నామినేషన్ వేసి ప్రచారం మొదలెట్టింది. ఈ క్రమంలోనే గుర్తు తెలియని దుండగులు ఆమె సోదరుడిపై కత్తులతో దాడికి పాల్పడ్డారు.
తనను కూడా బెదిరిస్తున్నారట.పోలీసులు రక్షణ కల్పించడం లేదని మీడియా ముందు బర్రెలక్క వాపోయింది. ఆమె మాటలకు సామాన్యుల మొదలు సెలబ్రిటీల నుంచి స్పందన వస్తోంది.
ప్రస్తుతం ఆమెకు పలువురు మద్దతు పలుకుతున్నారు. అండగా నిలుస్తున్నారు.
ఇక కొల్లాపూర్ లో బీ ఆర్ ఎస్ తరపున బీరం హర్షవర్ధన్ రెడ్డి…కాంగ్రెస్ తరపున జూపల్లి కృష్ణారావు … బీజేపీ నుంచి అల్లేని సుధాకర్ రావు బరిలోకి దిగారు. అందరూ పాత కాపులే .. ఈ ముగ్గురిని బర్రెలమ్మ ఎన్నికల్లో ఎదుర్కొని ఎంతవరకు పోరాడగలదో ఫలితాలు వస్తే కానీ తెలియదు.