సూపర్ స్టార్ కృష్ణ .. గాయకుడు బాల సుబ్రహ్మణ్యం ల మధ్య చిన్నవివాదం నెలకొన్నది. దాంతో ఇద్దరు మూడేళ్లు కలసి పని చేయలేదు. 1985 లో ఈ వివాదం చోటు చేసుకుంది. ఈ వివాదం నిజమే అని బాలు ఒక ఇంటర్వ్యూ లో అంగీకరించారు. కృష్ణ మాత్రం బయట ఎక్కడా దీన్ని గురించి మాట్లాడలేదు. అది ఆయన గొప్పదనం. కృష్ణ మొదటినుంచి తొందరపడి వేరే వ్యక్తుల గురించి మాట్లాడిన దాఖలాలు లేవు.
అసలు కథలోకి వెళితే ……….
ఒక సంస్థ నుంచి నాలుగేళ్లయినా పాట తాలూకు పారితోషకాలు బాలుకి అందలేదు. దీంతో ఒక రోజు ఫోన్ చేసి ఆ నిర్మాతను డబ్బు గురించి బాలు అడిగేరు. ఆ నిర్మాత దురుసుగా మాట్లాడారు. దాంతో బాలు ఫోన్ పెట్టేసారు . అరగంట తర్వాత కృష్ణ ఫోన్ చేసి “మీరు పాడకపోతే నా సినిమాలు రిలీజ్ కావన్నారట. మీ డబ్బులు వెంటనే పంపుతాను.
మీ తరపున మిత్రుడు ఒకరు నాకు 20 వేలు బకాయి ఉన్నారు. అది వెంటనే పంపండి “అని ఫోన్ పెట్టేసారు. దీంతో బాలు చెప్పాలనుకున్న సంగతి చెప్పలేకపోయారు. తర్వాత కృష్ణ చెక్కు పంపారు.బాలు కూడా 20 వేలు పంపారు.ఆ తర్వాత ఆ ఇద్దరూ మూడేళ్లు కలసి పని చేయలేదు.
హీరో కృష్ణ “సూర్య చంద్ర” సినిమాలో రాజ్ సీతారాం అన్న గాయకుడిని తెరపైకి తెచ్చారు.
ప్రేక్షకుల ఆదరణ పొందిన “సింహాసనం ” సినిమాలో కూడా అన్నిపాటలు రాజ్ సీతారాం పాడారు. సీతారాం ఆపాటలు పాడిన విధానం, పదాల విరుపులు అభిమానులకు నచ్చలేదు. నిర్మాతలు,సంగీత దర్శకులు హీరో సూచన మేరకు సీతారాం ని ప్రోత్సహించినప్పటికీ ఆ వాయిస్ కృష్ణకు అంతగా సూట్ కాలేదు.ఈ క్రమంలో కృష్ణ బాలు ఇద్దరు కూడా గుంభనంగా ఉన్నారు.
ప్రముఖ పాటల రచయిత వేటూరి ఈ విషయం గమనించి చొరవ తీసుకున్నారు. ఇద్దర్ని కలిపే ప్రయత్నం చేశారు. ఆ ఇద్దరు కలసి పనిచేయకపోయినా బయట ఎక్కడైనా కలిస్తే పలకరించుకునేవారు. 1988 లో సంగీత దర్శకులు రాజ్ కోటి కృష్ణ సినిమాకు పని చేస్తూ బాలు ఈ సినిమాలో పాటలు పాడాలని నిర్మాతపై ఒత్తిడి తెచ్చారు. ఆ సమయంలో అక్కడే ఉన్న వేటూరి కృష్ణ వద్దకు వెళ్లి మాట్లాడారు.
వేటూరి అంటే కృష్ణ కు అమితమైన గౌరవం. ఏ మూడ్ లో ఉన్నారేమో” అలాగే అండి” అన్నారట. తర్వాత వేటూరి బాలుకి ఫోన్ చేసి “కృష్ణగారితో మాట్లాడాను. బాలు నేను ఎక్కడైనా కల్సి మాట్లాడుకుంటాం ” అన్నారు. “ఇక నీ ఇష్టం” అని చెప్పారు.
బాలు వెంటనే “ఆయన నన్ను కలుసుకోవడం కాదు … నేనే వెళ్లి కలుస్తాను”అని చెప్పి నేరుగా పద్మాలయ స్టూడియో కి వెళ్లారు. అక్కడ బాలుని చూసి అందరూ ఆశ్చర్యపోయారట. వివాదం విషయం కొంత తెల్సిన సిబ్బంది షాక్ తిన్నారు. “కృష్ణ గారు ఎక్కడ “అని అడిగితే “పై అంతస్తులో ” ఉన్నారని చెప్పారు సిబ్బంది. పై అంతస్తు కెళ్ళి కృష్ణను బాలు కలిశారు.
” సార్ .. ఆరోజు నేను ఫోన్ లో ఏమి చెప్పదల్చుకున్నానో . ఇపుడు చెబుతా” అన్నారు బాలు. కృష్ణ వెంటనే స్పందిస్తూ ” ఇపుడు అవన్నీ వద్దులెండి … మనం కల్సి పనిచేద్దాం” అన్నారు. అంతే ఆ వివాదం అక్కడితో సమసి పోయింది.
ఈ మొత్తం వ్యవహారంలో అటు కృష్ణ ఇటు బాలు ఎక్కడ.. ఎప్పుడు ఆ నిర్మాత ఎవరో ? ఆయన పేరేమిటో బయట పెట్టలేదు. ఆ సస్పెన్స్ అలాగే ఉండి పోయింది. సినిమా ఫీల్డ్ లో ఇలాంటివి బోలెడు జరుగుతుంటాయి. ఈ ఒక్కటి మాత్రం బాగా హైలెట్ అయింది.. అయితే అసలు కథ చాలామందికి తెలీదు.
———- KNMURTHY
(స్వా )అభిమానం, ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడే గొడవలు ఉంటాయి !
అవన్నీ చంద్రుని కి ఉన్నట్లు మచ్చలు కాదు
స్వాభిమాన నక్షత్రాలు