ఎవరీ షెర్పాలు ? ఏమిటి వారి కథ ?

Sharing is Caring...

Priyadarshini Krishna ……………………..  

Life of unsung heroes Sherpa….
షెర్పా….
మౌంటనీరింగ్.. హిమాలయన్‌ ట్రెక్కింగ్, ఎవరెస్ట్ ఇతర మంచుపర్వతాల సమ్మిట్స్ పైన ఆసక్తి వుండే వారికి పరిచయం వుండే పేరు.షెర్పా- నేపాల్‌, టిబెట్‌ ప్రాంతాలకు చెందిన మూలవాసులు (ఎథ్నిక్ గ్రూప్) వీరి జీవనం అత్యంత దుర్భరమైన కఠినమైన వాతావరణలో సముద్రమట్టం నుండి 10,000 అడుగుల ఎత్తులో సాగేది.

దాదాపు అందరి షెర్పాల జీవితం దుర్భరమైనదే… ఆరు నెలలు దట్టమైన మంచు, తీవ్రమైన చలిలో కూరుపోయివుంటే మిగతా ఆర్నెల్లు మాత్రమే బ్రతికుండటం కోసం పనిచేసుకోగలిగే వాతావరణం వుంటుంది….
అసలు ఈ షెర్పాలు ఎవరు…?వీరు ఏంచేస్తారు తెలుసుకుందాం…

హిమాలయాల సానువుల్లో వివిధ మంచుపర్వతాల అంచుల్లో మైదాన ప్రదేశాల్లో ఆవాసం ఏర్పరుచుకున్న జనజాతులు. టిబెట్‌ నేషనాలిటీలు. బుద్ధిజం వీరి మతవిశ్వాసం.దాదాపు 15 వ శతాబ్థంలో హిమాలయాల సానువులకు వచ్చి జీవిస్తున్నట్లు చరిత్ర చెబుతోంది. వీరు యాక్స్, కొండ గేదెల మీద ఆధారపడి బార్లీ, బుల్గర్‌ గోధుమ/ కుట్టు వంటి మెట్ట పంటల వ్యవసాయం చేసుకుని ఆలుగడ్డలు(బంగాళదుంపలు) ఇతర కొండజాతి కూరగాయల సాగుతో ఆహార అవసరాలు తీర్చుకుంటారు.

నింగ్మా సంతతికి చెందిన వీరు తెగలుగా జీవిస్తుంటారు. 15 శతాబ్ధం నుండి కూడా బుద్ధిస్ట్ హిందు పర్వతారోహకులకు పోర్టర్లుగా, బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి వసతులు కల్పించే తెగగా, హిమాలయాల్లో దారులు చూపించే గైడ్లుగా జీవిస్తున్నారు.

వీరిపైన చైనా కంటే మంగోల్ ఆచారవ్యవహారాల ప్రభావమే ఎక్కువ.షెర్పా జాతిలోని మగవారు పర్వతారోహకులుగా కొనసాగితే, ఆడవారు వ్యవసాయం, పాడిపశువుల పెంపకంతో జీవనాన్ని వెళ్లదీస్తుంటారు.పిల్లలు గ్రామాల్లోని చిన్నచిన్న బడుల్లో చదువుకుంటారు. చాలా తక్కవమంది పైచదువులకు వెళతారు. జీవనప్రమాణాలు ఈనాటికీ మెరుగవలేదు.

షెర్పా తెగలో పుట్టిన ప్రతి మగపిల్లాడు తన యవ్వనాన్ని ఖచ్చితంగా పర్వతారోహణలోనే వెచ్చించాలనేది వారి నమ్మకం. షెర్పా మగపిల్లలు అందుకు చిన్న నాటినుండే సన్నద్ధం అవుతారు. ప్రతి షెర్పా కు ఏ కొండలో ఎక్కడెక్కడ మలుపులున్నాయి, ఎత్తులున్నాయి, పల్లాలు వున్నాయి అనేది నిద్రలో అడిగినా చెప్పగలిగేంత అలవాటు వుంటుంది.

ఏయే రుతువుల్లో ఎక్కడెక్కడ సూర్యరశ్మి యేయే సమయాల్లో పడుతుంది, ఏ సీజన్‌ ‌లో ఏ సమయం పర్వతాధిరోహణకు అనుకూలమైందో వీరికి అవగాహన వున్నంతగా సుశిక్షితులైన మౌంటనీర్లకు కూడా తెలియదు. అందుకే ఎంతో కష్టసాధ్యమైన ఎవరెస్ట్ సమ్మిట్లకు లను షెర్పాలను గైడ్లుగా నియమిస్తారు.

దినదినగండమైన ఈ సమ్మిట్లను నల్లేరు నడకలాగా సునాయాసంగా పూర్తి చేయిస్తారు. ప్రతిరోజూ జారిపడే ‘అవలాంకే’- మంచుపర్వత చరియలు జారిపడటం, మంచు తుఫాను, అధిక సూర్యరశ్మివల్ల మంచుపై కాంతి పరావర్తనం వల్ల కలిగే టోటల్‌వైటౌట్‌ ను కూడా వీరు అత్యంత సులువుగా అధిగమించగలరు. ఒక షెర్పా లేనిదే ఏ మౌంటనీర్ తన సమ్మిట్‌ ని పూర్తిచేయడం కల్ల ..

ప్రతి మౌంటనీర్ షెర్పా సాయంతో హిమశిఖరాలను ఎక్కి రికార్డు సృష్టించినట్లు అవార్డులు రివార్డులు కొడతారు.
ప్రతి హిమాలయన్‌ మౌంటనీర్‌కి గైడ్ లాగ మార్గదర్శిగా వుంటూ, అవసరమైన మనోబలాన్ని అందిస్తూ, పోర్టర్ గా వుంటూ వారి రోజువారీ అవసరాలను తీరుస్తూ, బేస్ క్యాంప్స్ లోని మౌంటనీర్ల సమాచారాన్ని కుటుంబాలకు చేర్చే అనుసంధాన కర్తలుగా పనిచేస్తూ.. వాతావరణ సమాచారాన్ని బేరీజువేసే వెదర్‌గైడ్లగా చేయూతనిస్తూ నడిపిస్తేనే ఈ మౌంటనీర్లు తమతమ గమ్యాన్ని సునాయాసంగా అధిరోహించగలుగుతారు.

మన పేరుగాంచిన మౌంటనీర్లలాగా మంచుసూటుబూటు తో స్టైలిష్ గా వీరు పర్వతారోహణ చేయరు. బండెడు లగేజీతో అవసరమైన టెంట్లు, ఆక్సిజన్‌ సిలెండర్లు, తాళ్ళు, నిచ్చెనలను భుజాన.. నెత్తిన మోస్తూనే, నిర్ణీత స్థలాల్లో బేస్ క్యాంప్స్ ని రూపొందించి ప్రొఫెష్నల్‌ మౌంటనీర్స్ కి కావలసిన నీరు, భోజనం, బస, టాయిలెట్ సదుపాయాలను ఏర్పరుస్తారు.
ప్రతి షెర్పా తన జీవితంలో కొన్ని వందలసార్లు హిమాలయాలను ఎక్కిదిగిన సందర్భాలున్నాయి.

ప్రతి షెర్పా తన జీవితంలో కనీసం పదుల సంఖ్యలో అవలాంకేలను వెంట్రుకవాసిలో తప్పించుకున్న సందర్భాలుంటాయి. ప్రతి షెర్పా తనని బుక్‌చేసుకున్న మౌంటనీర్ ఎట్టి పరిస్థితుల్లో హిమాలయాలను స్కేల్‌ చేసేంత సామర్థ్యాన్ని ప్రత్యక్షంగా కలిగిస్తాడు.తనకంటే ముందే ఎన్నోసార్లు హిమశిఖరాలను ఎక్కిదిగి తాను ఎక్కడానికి మార్గాన్ని వేసిన షెర్పా కి ఎవరు ఇవ్వగలరు ఏదైనా అవార్డు లేదా రివార్డు … కనీసం మౌంటనీరింగ్‌ చరిత్రలో ఒక పేజ్….!!

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!