ఆయన దారెటు ?

Sharing is Caring...

ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం వుంది. అయినప్పటికీ ముందుగానే పొత్తులపై చర్చలు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు కూడా  ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రెడీ అంటున్నాయి.  ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంద‌రూ క‌ల‌వాల్సి వుంద‌ని, అందుకు టీడీపీ నాయ‌క‌త్వం వ‌హిస్తుంద‌ని విపక్ష నేత చంద్రబాబు అంటున్నారు. అంతేకాకుండా త్యాగాల‌కు కూడా సిద్ధమేనంటూ చంద్రబాబు పొత్తు రాజకీయానికి తెరతీశారు. 

చంద్రబాబు ఎన్డీయే తో పొత్తుకు సుముఖంగా ఉన్నప్పటికీ … చంద్ర‌బాబు తో పొత్తుకు ప్రధాని మోదీ అంత సుముఖంగా లేరని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు 2019 చివ‌ర్లో ప్లేటు ఫిరాయించారు. మోదీ మ‌ళ్లీ గెల‌వ‌ర‌నే లెక్క‌ల‌తో కాంగ్రెస్ తో చేతులు క‌లిపారు.  మోడీకి వ్య‌తిరేకంగా జాతీయ స్థాయిలో ఏర్పాటైన కూట‌మిలో చంద్ర‌బాబు క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు.ఇందులో భాగంగా బీజేపీ బ‌ద్ధ శ‌త్రువైన కాంగ్రెస్‌తో ఆయ‌న క‌లిసి ప‌ని చేయ‌డం అప్పట్లో సంచ‌ల‌నం క‌లిగించింది.

ఒక ద‌శ‌లో దేశ ప్ర‌ధాని అభ్యర్థిగా చంద్ర‌బాబు పేరును కొన్ని మీడియా సంస్థలు తెర‌పైకి తెచ్చాయి. ప్ర‌ధాని మోదీ కి ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి చంద్ర‌బాబే అన్న రీతిలో ప్ర‌చారం జ‌రిగింది.తీరా ఎన్నిక‌ల ఫ‌లితాలు వచ్చాక…టీడీపీ  ఆశ‌లు గ‌ల్లంత‌య్యాయి. కేంద్రంలో మ‌ళ్లీ బీజేపీ అధికారంలోకి రావడం, ఏపీలో టీడీపీ ఘోర ప‌రాజ‌యాన్ని మూట క‌ట్టుకోవాల్సి వ‌చ్చింది. దీంతో బాబు సైలెంట్ అయ్యారు . 

2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రధాని మోదీ ని దారుణంగా విమర్శించారు. మోదీ గోబ్యాక్ అని అమరావతిలో హోర్డింగ్ లు పెట్టించారు. హోదా కోసం నిరసన దీక్షల పేరిట అమరావతిలో .. ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ దీక్షల్లో మోదీ ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. ఇవన్నీ మోదీ దృష్టి కి  వెళ్లాయి. అందుకే ఆయన చంద్రబాబును నమ్మరని అంటారు.

చంద్రబాబు కాంగ్రెస్ కు ఎన్నిక‌ల ఖ‌ర్చు సర్దుబాటు చేసారని కూడా  అప్పట్లో ప్రచారం జరిగింది. ఇందుకు సంబందించిన రుజువులు ప్రధానికి ఎవరో పంపారని కూడా ప్రచారం జరిగింది. తీరా తిరుగులేని మెజారిటీతో మ‌ళ్లీ మోదీ  ప్ర‌ధాని అయ్యాక ఆయన  ప్రాప‌కం కోసం చంద్ర‌బాబు సాగిలా ప‌డుతున్నారనే విమర్శలు లేకపోలేదు. 

ఈ క్రమంలో మోదీ స‌ర్కార్ అడిగినా, అడ‌క్క‌పోయినా ఎన్డీయే కి టీడీపీ మ‌ద్ద‌తు తెలుపుతూ వ‌స్తోంది. ఇందులో భాగంగా రైతులకు   సంబంధించిన  చ‌ట్టాల‌కు కూడా టీడీపీ మ‌ద్ద‌తు తెలిపింది.  వాటికి అనుకూలంగా చ‌ట్ట స‌భ‌ల్లో ఓటు వేసింది.  ఒక అడుగు ముందుకేసి మోదీ స‌ర్కార్‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని మహానాడులో ఏకంగా తీర్మానం కూడా చేసింది.అయినా బీజేపీ నేతలు చంద్రబాబును న‌మ్మ‌డం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బాబు తో పొత్తు అంత సులభం కాదని విశ్లేషకులు అంటున్నారు.

2019 తర్వాత వరుసగా జరిగిన స్థానిక ఎన్నికల్లో టిడిపి ఓటమి పాలైంది. పార్టీ భవిష్యత్తుపై సొంత నేతల్లోనూ భరోసా తగ్గింది.  ఇవన్నీ లెక్కలు వేసుకున్న బాబు ఒంటరిగా రాబోయే సార్వత్రిక ఎన్నికలకు వెళితే,  మళ్లీ 2019 ఎన్నికల ఫలితం రిపీట్ కావచ్చని భావిస్తున్నారు. అందుకే ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే తప్ప మళ్లీ అధికారం సాధించడం అసాధ్యం అనే అభిప్రాయంతో ఉన్నారని విశ్లేషకులు అంటున్నారు. 

దీనిలో భాగంగానే బిజెపి, జనసేన కూటమిలో చేరేందుకు బాబు ప్రయత్నాలు చేస్తున్నట్టు  విశ్లేషకులు చెబుతున్నారు.  ముందే చెప్పుకున్నట్టు  బిజెపి మాత్రం టిడిపి తో పొత్తుకు అంత సుముఖంగా లేదు. ఈ క్రమంలోనే జనసేన ను తమ వైపు తిప్పుకోవాలి అని చంద్రబాబు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. టిడిపి వైపు వెళితే  తమ పార్టీ భవిష్యత్ ఏమౌతుందో అని పవన్ కళ్యాణ్ కూడా మధన పడుతున్నారు. చీటికీ మాటికీ పొత్తులు మారిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అని జనసేన నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. టీడీపీ తో పొత్తుకు బీజేపీ అధిష్టానం సుముఖంగా లేని క్రమంలో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్ధం కానీ పరిస్థితి లో జనసేన ఉంది. 

బీజేపీ తో కలసి నడిస్తే  ఆపార్టీ సీఎం పదవి కూడా ఆఫర్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అదే టీడీపీ వైపు వెళితే .. ఆ పార్టీ సీఎం పదవి ఆఫర్ చేస్తుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కాకపోతే చంద్రబాబు కీలక పదవి ఏదైనా ఆఫర్ చేయవచ్చు. చేయకపోవచ్చు. అందుకే పవన్ ఏ నిర్ణయం తీసుకోలేదు. చంద్రబాబు ముందు కొస్తే చూద్దాములే అంటున్నారు పవన్ కళ్యాణ్. కానీ అనధికార వర్గాల సమాచారం ప్రకారం బిజెపి టిడిపితో కలిసేందుకు ఒప్పుకుంటే తమకు అభ్యంతరం లేదని పవన్ కళ్యాణ్ బాబుకు చెప్పినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో జనసేన పైన బాబు ఆశలు వదిలేసుకున్నారని అంటున్నారు.

ఇక చంద్రబాబు బీజేపీ పొత్తుల గురించి చెప్పుకోవాలంటే 1999 లో బీజేపీ తో పొత్తు కుదుర్చుకుని అధికారంలోకి వచ్చారు. అప్పట్లో బీజేపీ అగ్రనేత వాజ్పేయ్ ఇమేజ్ చంద్రబాబుకి ప్లస్ అయింది. తర్వాత 2004లో బీజేపీ తో  మళ్ళీ పొత్తు కుదుర్చుకున్నారు . కానీ నాటి ఎన్నికల్లో  కాంగ్రెస్ నేత వైఎస్ చేతిలో బాబు ఓడిపోయారు. కేంద్రంలో బీజేపీ కూడా అధికారం కోల్పోయింది.

ఇక 2009 లో చంద్రబాబు మహాకూటమిలో భాగం గా టీ ఆర్ ఎస్ తో పొత్తు కుదుర్చుకుని ఎన్నికల్లో పోటీ చేశారు. అపుడు కూడా పొత్తు కలసి రాలేదు. 2014 లో మళ్ళీ బీజేపీ తో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. విభజిత  ఆంధ్రప్రదేశ్ కి సీఎం అయ్యారు. 2019 ఎన్నికల్లో మళ్ళీ ఒంటరిగా పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. ఈ క్రమంలో చంద్రబాబుకి పొత్తులు కలసి వస్తాయని కూడా ఖచ్చితంగా చెప్పలేం. 

ఇక బాబు దృష్టిలో మిగిలింది కాంగ్రెస్ పార్టీనే.ఏపీ తెలంగాణ విభజనకు కారణం అయిన కాంగ్రెస్ పై మొదట్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అందుకే ఆంధ్ర ప్రజలు ఆ పార్టీని శంకర గిరి మాన్యాలు పట్టించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ తీరుపై జనాల్లో ఆగ్రహం ఉందని బాబు అంచనా వేస్తున్నారు.

కాంగ్రెస్ కు దేశ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని,  విభజన విషయంలో సోనియా వ్యవహరించిన తీరుపై  ఆగ్రహం మొదట్లో కనిపించినా,  ప్రస్తుతం లేదని, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం అంటూ రాహుల్ గాందీ పదేపదే చెబుతుండడంతో బాబు కాంగ్రెస్ తో జత కట్టేందుకు సిద్ధమవుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

అలాగే వామపక్ష పార్టీలను సైతం దగ్గర చేసుకుంటే,  మరింత బలం పెరుగుతుందని అంచనా వేస్తున్నారట.అందుకే బాబు కాంగ్రెస్ అండ దండలతో రాబోయే రోజుల్లో అధికారం సాధించాలనే పట్టుదలతో ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు  విశ్లేషకులు చెబుతున్నారు.మొత్తానికి బాబు దారెటు అనేది ఇంకా ఖరారు కాలేదు. అయినా ఎన్నికలకు  రెండేళ్ల సమయం ఉంది. అప్పటి పరిస్థితులు .. రాజకీయాలు ఎలాఉంటాయో ?ఏదైనా ఆ సమయాన్ని బట్టి పొత్తులు ఎత్తులు మారే అవకాశాలు కూడా లేకపోలేదు.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!