విజయమ్మ మీటింగ్ పై సర్వత్రా సందేహాలు వక్తమౌతున్నాయి. దివంగత నేత రాజశేఖరరెడ్డి 12 వ వర్ధంతి నేపథ్యంలో ఆయన సన్నిహితులతో సమావేశం తెలంగాణా లోనే ఎందుకు పెడుతున్నారు? షర్మిల పార్టీ కి మద్దతు పలకమని వచ్చే నేతలను అడుగుతారా ? ఈమె అడిగినంత మాత్రాన వచ్చినవారు మద్దతు ప్రకటిస్తారా? అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి.
ఈ సమావేశానికి ఏపీ సీఎం జగన్ రాకపోవచ్చు.. ఆయన సోదరి షర్మిల అయినా హాజరవుతున్నారా ? లేదా అనేది కూడా సస్పెన్స్. రెండు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలను .. 2004 .. 2008 వైయస్ క్యాబినెట్లో పనిచేసిన వారిని విజయమ్మ పిలిచారని అంటున్నారు. విజయమ్మ వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా ఉంటూనే షర్మిల తెలంగాణలో పెట్టిన వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వైసీపీకి రాజీనామా చేయవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అది వేరే విషయం.
తెలంగాణాలో వైఎస్ తో కలసి పనిచేసిన చేవెళ్ల చెల్లెమ్మ సబిత ఇంద్రారెడ్డి ఇపుడు తెరాసలో ఉన్నారు. మంత్రిగా చేస్తున్నారు. సునీత లక్ష్మారెడ్డి, ఇంద్రకరణ రెడ్డి తదితర నేతలు కూడా తెరాసలోనే ఉన్నారు. వీళ్లంతా విజయమ్మ సమావేశానికి వస్తారా ? అంటే రాకపోవచ్చు అనే జవాబే వినిపిస్తోంది. ఇపుడు ఆంధ్రా ..తెలంగాణ మధ్య నీటి జగడాలు నడుస్తున్నాయి. కేసీఆర్ ..జగన్ ల మధ్య గతంలో మాదిరి సంబంధాలు లేవు .
ఈ క్రమంలోనే తెలంగాణ లోనే పార్టీ పెట్టి రోజూ కేసీఆర్ ను విమర్శించే షర్మిల/జగన్ తల్లి మీటింగ్ పెడితే వస్తారా అనేది సందేహమే. పొరపాటున హాజరైతే ఆ తర్వాత పరిణామాలు సీరియస్ గా ఉంటాయనేది వారికి తెలుసు. ఇక తెలంగాణ కాంగ్రెస్ నేతలు సంగతి కూడా డౌటే అంటున్నారు. వారంతా వైఎస్ పేరు ఎత్తడం మానేశారు. వైఎస్ పేరు ప్రస్తావిస్తే తెలంగాణా ప్రజలు ఓట్లేయరు అని వారి భయం. సీనియర్లు కొంతమంది అయితే రావచ్చు అంటున్నారు.
కోమటిరెడ్డి .. జానారెడ్డి లాంటి నేతలు కనబడి వెళ్ళవచ్చని చెబుతున్నారు. ఇక కేవీపీ .. ఉండవల్లి వంటి నేతలు వైఎస్ పై అభిమానంతో .. విజయమ్మతో పరిచయం కారణంగా రావచ్చు. ఆంధ్రా నుంచి ఇతర కాంగ్రెస్ నేతలు వస్తారని పెద్ద గా అంచనాలు లేవు. ఇక వైసీపీ నేతలు వెళ్లాలా ? వద్దా ? అని మల్లగుల్లాలు పడుతున్నారు. విజయమ్మ పిలిచారని వెళ్లినా … వైసీపీ, వైటీపీ రెండూ ఒకటేనన్న సంకేతాలు వెళ్తాయేమో? జగన్ అనుమతి లేకుండా వెళితే అనవసర వివాదాలు ఏర్పడే ప్రమాదం ఉందని వారు భావిస్తున్నారు.
విజయమ్మ కూడా తెలంగాణా నేతలపైనే ఫోకస్ పెట్టినట్టు వార్తలు కూడా వచ్చాయి. పొలిటికల్ ఎజెండా లేకుండా విజయమ్మ ఈ సమావేశం పెట్టారని ఎవరూ అనుకోవడం లేదు. అందుకే నేతలు వెనుకా ముందూ ఆలోచిస్తున్నారు. ఈ మీటింగ్ గురించే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.