అహ..ఏమి హాయిలే హలా !

Sharing is Caring...

A super duper hit in those days ……………………………………………….

“జలకాలాటలలో…  గల గల పాటలలో ..ఏమి హాయిలే హలా …అహ ఏమి హాయిలే హలా”…ఎన్టీఆర్ నటించిన ‘జగదేకవీరుని కథ’ సినిమా లోది ఆ పాట.ఆ రోజుల్లో ఈ సినిమా ఓ పెద్ద సంచలనం.వసూళ్ల పరంగా పాత రికార్డులన్నింటినీ పక్కన బెట్టి కొత్త చరిత్ర సృష్టించిన సినిమా అది.

జగదేకవీరుని కథ 1961 లో విడుదలయింది. అంటే 63 ఏళ్ల క్రితం అన్నమాట. ఇప్పటికి ఈ సినిమాను కుటుంబంతో చూసి ఎంజాయ్ చేయవచ్చు. ‘జగదల ప్రతాపన్’ అనే తమిళ చిత్రం ఈ సినిమా మూల కథ.  పింగళి మాస్టారు ఆ కథకు కొన్ని జనరంజకమైన మార్పులు,చేర్పులు చేశారు.అంతే హృద్యంగా దర్శకుడు కేవీరెడ్డి కథను తెరకెక్కించారు.

ఎన్టీఆర్ హీరో గా స్థిరపడ్డాక వచ్చిన సినిమా ఇది. ఈ సినిమాతో ఆయన ఇమేజ్ మరింత పెరిగింది. తనకు వచ్చిన కలను నిజం చేసుకోవడానికి ఒక యువరాజు చేసే సాహస యత్నాల కథే సినిమా.ఈ సినిమాలో పాటలు అన్ని అద్భుతం. ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్. 

“శివశంకరీ…శివానందలహరి” పాట ఎంత పెద్ద విజయమో సాధించిందో తెలిసిందే. ఆ పాట వెనుక ఎందరో హేమాహేమీల శ్రమకనిపిస్తుంది. అలాగే  ‘జలకాలాటలలో..’, ‘వరించి వచ్చిన మానవవీరుడు..’, ‘నను దయగనవ..’ వంటి పాటలు ఇప్పటికి సంగీత ప్రియులను అలరిస్తున్నాయి.

పింగళి మాస్టారి కలానికి ఎంత పదును ఉందో ఈ సినిమా చెబుతుంది. పింగళి విజృంభించి రచన చేసిన సినిమాలో ఇదొకటి. డైరెక్టర్ కేవీ రెడ్డి సినిమాలో జలక్రీడల గీతాన్ని కనులవిందుగా తెరకెక్కించారు. ఈ పాటకు పెండ్యాల అద్భుతమైన బాణీ అందించారు. భూలోకానికి వచ్చి దేవకన్యలు పాడే అది. పాటకు ముందు ఇంద్రకన్య జయంతి  తన స్నేహితురాళ్లను పిలుస్తూ ‘హలా నాగినీ… హలా వరుణీ.. హలా మరీచీ..’ అంటూ పిలుస్తుంది.

మనం ‘హలో’ అనే  పదాన్ని పింగళి  ‘హలా’ గా మార్చి ప్రయోగించారు అనుకుంటాం..  కానీ
హలా అని స్నేహితురాలిని పిలుస్తారు. సంస్కృతనాటకాలలో ఈ ప్రయోగం ప్రాచీనకాలం నుంచి ఉంది.దాన్నే ఈ సినిమాలో వాడారు.  

అలాగే బి.సరోజాదేవి ముద్దు ముద్దుగా మాట్లాడే మాటలు కూడా వినడానికి చాలా హాయిగా ఉంటాయి. ‘జలకాలాటలలో’ పాట చిత్రీకరించే సమయంలో నటి జయంతికి జ్వరమట. అందులో జనవరి నెల చలి. అందుకే డైరెక్టర్ కేవీరెడ్డి స్టూడియోలో నిర్మించిన కొలనులో వేడి నీళ్లు పోయించి ఆ పాట చిత్రీకరించారట.  

‘కేవీరెడ్డి జన్మశతాబ్ది సంచిక’ లో నటి జయంతి  ఈ విషయం  ప్రస్తావించారు. నీళ్లు చల్లారితే.. వాటిని తీసేసి మళ్లీ వేడి నీళ్లు పోయించేవారని  జయంతి చెప్పారు. ఈపాటలో హీరోయిన్ బీ. సరోజ,ఎల్ విజయలక్ష్మి,జయంతి, బాల నటించారు. ఆ కృత్రిమ కొలను చుట్టూ కెమెరా ఫీల్డులోకి రాని దూరంలో బాయిలర్లు పెట్టారట.

తారలు నీళ్లలో దిగేముందు ఈ బాయిలర్ల నుంచి వేన్నీళ్లు ఆ కొలనులో పోసేవారట. దాంతో ఏ ఆటంకం లేకుండా పాటను చిత్రీకరించారట. 63 ఏళ్ళక్రితం తీసిన సినిమా అయినా ఎలాంటి మసకలు లేకుండా హాయిగా సినిమా చూడవచ్చు. ఈ క్రెడిట్ కెమెరా మాంత్రికుడు మార్కస్ బారట్లే కి చెందుతుంది. 

విజయా బ్యానర్ పై నాగిరెడ్డి, చక్రపాణి పేర్లు లేకుండా రూపొందిన ఏకైక సినిమా ఇదే.ఈ సినిమా అంచనాలకు మించి హిట్ అయింది.. 30 కేంద్రాలలో అర్ధశతదినోత్సవం, 18 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది.ఈ సినిమాకు పెట్టిన ఖర్చుకి నాలుగు రెట్లు లాభాలు వచ్చాయి.

తర్వాత కాలంలో కూడా రిపీట్ రన్స్ ద్వారా ‘జగదేకవీరుని కథ’ నిర్మాతలకు, పంపిణీదారులకు లాభాలు ఆర్జించి పెట్టింది. తమిళ,కన్నడ, హిందీ, బెంగాలీ, ఒరియా భాషల్లోకి డబ్ అయి అక్కడా విజయఢంకా మోగించింది.

ఈ సినిమాలో మరో అద్భుత గీతం  ‘శివశంకరీ.. శివానందలహరి’ . ఈ పాటను పింగళి రాయగా పెండ్యాల స్వరపరిచారు. ఇక పాడింది అమర గాయకుడు ఘంటసాల. తెరవెనుక ఈ పాట ను హిట్ చేయడానికి ఘంటసాల కూడా చాలా ప్రాక్టీస్ చేశారని అంటారు. ఇక తెరపై ఎన్టీఆర్ అద్భుతం గా నటించారు.

ఆరోజుల్లో ఈపాట గొప్పప్రయోగమని చెప్పుకోవచ్చు. అప్పట్లో ఎలాంటి టెక్నాలజీ లేకుండా ఐదుగురు ఎన్టీఆర్‌లను ఒకే వేదికపై వివిధ హావభావాలతో చూపడం గొప్ప విషయం. మార్కస్ బారట్లే  ప్రతిభ కు ఈ పాట దర్పణంగా నిలుస్తుంది. ఎన్టీఆర్ నటనకు అప్పట్లో ప్రజలు బ్రహ్మ రధం పట్టారు. 

——————–K.N.M

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!