“లక లక ” చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ నోటి వెంట వచ్చే ఈ డైలాగు ఇప్పటికి వినబడుతుంటోంది. చంద్రముఖి విడుదలై 15 ఏళ్ళు దాటినా ఈ లకలక డైలాగ్ మాత్రం ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది. ఆ డైలాగ్ లేకపోతే సినిమాకు అంత ఊపు వచ్చేది కాదేమో. అంతలా క్లిక్ అయిన ఆ డైలాగ్ ఎలా పుట్టింది అనే విషయంపై రెండు కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
చంద్రముఖి సినిమాను కన్నడం లో విష్ణు వర్ధన్ నటించిన “ఆప్తమిత్ర” రీమేక్ గా తమిళంలో నిర్మించారు.తొలుత ఇదే కథ తో మలయాళంలో “మణిచిత్ర తాయి”అనే సినిమా వచ్చింది. 1993లో ఈ సినిమా విడుదలయింది. నటి శోభన గంగ పాత్రలో నటించింది. అందులో మోహన్ లాల్ హీరో.
ఆ కథ ఆధారంగా కన్నడలో రీమేక్ చేశారు.అక్కడ గంగ గా సౌందర్య నటించింది. అదే సౌందర్య ఆఖరి చిత్రం కూడా. ఈ సినిమాలో హీరో విష్ణు వర్ధన్ ‘హౌల హౌల’ అంటాడు. అదే డైలాగ్ రజనీ కాంత్ కి చూపెట్టి దర్శకుడు వాసు తన స్టైల్ లో చెప్పమని అడిగాడట. కానీ రజనీ కాంత్ కి ఆ డైలాగ్ అంత నచ్చలేదట.
అంతకంటే పవర్ ఫుల్ డైలాగ్ అయితే బాగుంటుందని అన్నాడట. డైలాగ్ ఎంత బాగా పేలితే ఆ సినిమా అంత హిట్ అవుతుంది. మంచి డైలాగ్ కోసం అన్వేషణలో పడ్డారట. సరిగ్గా అపుడే తాను ఎపుడో చూసిన ఒక మరాఠి డ్రామా గుర్తుకు వచ్చిందట. ఆ డ్రామాలో విలన్ తరచుగా లకలక లకలక అంటూ హడావుడి చేస్తుంటాడు.
ఆ డైలాగ్ ను గుర్తుకు తెచ్చుకొని రజనీ తనదైన స్టైల్ లో చెప్పేసరికి వాసు ఒకే అన్నారట. ఇక సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిన విషయమే.అలాగే మరో కథనం కూడా ప్రచారం లో ఉంది.
ఒకసారి రజనీకాంత్ నేపాల్లో పర్యటిస్తుండగా దారిలో ఒక శవయాత్ర కనిపించిందట. శవాన్నితీసుకెళ్తుండగా ఆ గుంపు లోని వారు లయబద్ధంగా లకలకలక అనడం ఆయన విన్నాడు. దానికి అర్ధం ఆయనకూ తెలీదు. కానీ ఆ పదం .. దాని సౌండ్ బావుందికదా అని దాన్ని దర్శకుడు వాసుకి చెప్పి చంద్రముఖి సినిమాలోవాడుకున్నారు.
ఇదేవిషయాన్ని అప్పట్లో హిందూ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో రజనీ చెప్పాడట. వాస్తవానికి లకలక పదానికి పలు అర్ధాలున్నాయి.మొదటిది ఇది ఒక నృత్యరీతి. ఇందులో చేతులు కదిలించకుండా వేగంగా కాళ్ళు కదిలించటం దీని ప్రత్యేకత. దాన్నిబట్టి చూస్తే ఇక్కడ అర్ధం తొందరగా నడవండి అనుకోవచ్చు.
కాకపొతే ఇది విదేశీ పురాణాల్లో ఒకదేవత పేరు.ఆవిడ కథ అంతా ఆత్మ,స్వర్గం కు సంబంధించిన అంశాల చుట్టూ తిరుగుతుంది. ఆరకంగా చూస్తే చనిపోయిన వ్యక్తి ఆత్మకు శాంతి కలగాలనీ,స్వర్గం ప్రాప్తించాలనీ కోరుకోవటం కావచ్చుఅంటారు.
మొత్తం మీద ఆ డైలాగ్ ఎక్కడి నుంచి వచ్చినా అది పెద్ద సంచలనమే అయింది. చంద్రముఖి కి ఊపిరి పోసింది. కాగా కన్నడ సినిమాకు , తెలుగు సినిమాకు వాసు యే దర్శకుడు. కథ కథనాల్లో కొంత మార్పులు చేర్పులు ఉన్నాయి. మూడు భాషల్లో బంపర్ హిట్ అయింది. తెలుగులో డబ్ చేశారు.
ఇక్కడ కూడా బాగా ఆడింది. తర్వాత పలు ఇతర భాషల్లో కూడా డబ్ అయింది. నిర్మాతలకు కనకవర్షం కురిపించింది. మళ్ళీ 2010 లో ఇదే సినిమాను కన్నడ కథ ఆధారంగా కొన్ని మార్పులు,చేర్పులతో నాగవల్లి పేరు మీద తెలుగులో తీశారు. వాసూనే డైరెక్ట్ చేశారు. హీరో వెంకటేష్ రజనీ పాత్ర పోషించారు.చంద్రముఖి పాత్రను అనుష్క చేసింది. ఈ సినిమా కూడా బాగానే ఆడింది.
————–KNM