ఆ గొర్రెలు గుండ్రంగా తిరగడం లో మర్మమేమిటి ?

Sharing is Caring...

Herd mentality ?…………………………………………………

చైనాలో ఓ గొర్రెల మంద వింతగా ప్రవర్తించడం సంచలనానికి దారితీసింది. 12 రోజులపాటు సమూహంలోని గొర్రెలు వృత్తాకారంలో తిరిగి వార్తలకెక్కాయి. పగలూ రాత్రి అలా అలసట లేకుండా తిరిగిన ఆ గొర్రెల తీరు ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ఇందుకు సంబంధించిన వీడియో ను చైనీస్ ప్రభుత్వ ఔట్‌లెట్ పీపుల్స్ డైలీ ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్ అయ్యింది. రోజుల పాటు ఆ బృందంలోని గొర్రెలన్నీ ఒకే విధంగా ప్రవర్తించడానికి కారణమేమిటో అర్ధం కాలేదు. ప్రస్తుతం ఈ ఘటన మిస్టరీగా మారింది.

ఈ గొర్రెలు నవంబర్ 4 నుండి వృత్తాకారంలో కదులుతున్నాయని పీపుల్స్ డైలీ నివేదిక చెబుతోంది. ప్రస్తుతం ఆ గొర్రెలు తినడానికి లేదా త్రాగడానికి ఆగాయా ? లేదా? ఇంకా తిరుగుతున్నాయా అనే సమాచారం అందుబాటులో లేదు. ఇన్నర్ మంగోలియాలోని ఒక రైతు పొలంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

మయో అనే రైతు వందల సంఖ్యలో గొర్రెలను పెంచుతున్నాడు. అందులో కొన్ని గొర్రెలు వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాయి. ఒక మందలోని గొర్రెలు అవి ఉన్నచోటే వృత్తాకారంలో తిరగడం ప్రారంభించాయి. తొలుత కొన్ని గొర్రెలు ఇలా నడవడం మొదలుపెట్టగా.. వాటికి మరిన్ని జత అయ్యాయి.అలా ఏకంగా 12 రోజుల పాటు ఆ మందలోని గొర్రెలన్నీ క్రమం తప్పకుండా తిరిగాయి.

లిస్టెరియోసిస్ (Listeriosis) అనే బాక్టీరియా సోకడం వల్ల ఇలా గొర్రెల మంద వింతగా ప్రవర్తిస్తూ ఉండవచ్చని పశు వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనినే సర్కింగ్ వ్యాధి అని కూడా పిలుస్తారు. కలుషిత ఆహారం, నేల, జంతువుల మలం వల్ల ఇది వ్యాపిస్తుంది. కుంగుబాటు, ఆకలి తగ్గడం, జ్వరం, పాక్షిక పక్షవాతం కారణంగా సర్కిల్ లో తిరగడం మొదలు పెడతాయని అంటున్నారు.

అలాగే మెదడులో ఓవైపు భాగం దెబ్బతినడంతో అవి వింతగా ప్రవర్తించే అవకాశాలున్నాయి. ఈ వ్యాధి సోకిన జంతువులు 48 గంటల్లోనే మరణించే ప్రమాదం ఉంది. కానీ, ఇవి మాత్రం ఆరోగ్యంగా ఉండడంతోపాటు సుమారు రెండు వారాలు ఏకధాటిగా వృత్తాకారంలో తిరిగాయి.

అయితే, ఇతర మాంసాహార జంతువుల వేట నుంచి తప్పించుకునేందుకు… తమ సమూహాన్ని రక్షించుకునే క్రమంలో గొర్రెలు ఇలా తమ ముందున్న వాటిని అనుసరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇలా రోజులకు తరబడి అనుసరించడం మాత్రం ఆశ్చర్యమేనని ఇంగ్లాండ్లోని హార్ట్ ప్యూరీ యూనివర్సిటీలోని వ్యవసాయ విభాగాధిపతి ప్రొఫెసర్ మ్యాట్ బెల్ అంటున్నారు.

గొర్రెలు మంద మనస్తత్వాన్ని ప్రదర్శించడమంటే ఇదే అని ఆయన చెబుతున్నారు. కాగా ఆగ్నేయ ఇంగ్లాండ్ లోని ఓ గ్రామంలో గతేడాది ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ మైదాన ప్రాంతంలో ఉన్న గొర్రెల మంద ఇలాగే వృత్తాకారంలో తిరిగిన ఫొటోలు అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!