మౌన వ్యూహంలో మర్మం ఏమిటో ?

Sharing is Caring...

‘పయ్యావుల కేశవ్’ కు చురుకైన నాయకుడని పేరుంది . కానీ గత కొంత కాలంగా ఆయన మౌనంగా ఉంటున్నారు.  ఆ మద్య బీజేపీ లో చేరబోయి మళ్ళీ వెనుకడుగు వేశారని కూడా అంటారు. గత ఎన్నికల్లో  టీడీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల‌లో కేశవ్ ఒక‌రు. 2019లో వైసీపీ గాలులు వీచినప్పటికీ తట్టుకుని ఉరవకొండ నుంచి 4000 ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు. మంచి స్పీకర్ గా ఆయ‌న‌కు పేరుంది. కానీ ఈ మ‌ధ్య‌కాలంలో ఎక్కడా ఆయ‌న పేరు వినిపించ‌డం లేదు. మనిషి వార్త‌ల్లో క‌నిపించ‌డం లేదు. అసలు తెలుగు దేశం పార్టీలో ఉన్నారా ? అనే సందేహాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. చంద్రబాబు పై అలిగారని , అసంతృప్తితో ఉన్నారని … అందుకే పార్టీకి దూరంగా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది.
గతంలో టీడీపీ క్లిష్ట పరిస్థితుల్లోఉన్న ప్రతిసారి  కేశవ్ పార్టీకి , చంద్రబాబుకి అండగా నిలిచారు.  కేశవ్‌ని పార్టీ నేతలు ఫైర్ బ్రాండ్‌గా పిలిచేవారు. పార్టీ యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న నాయకుడు కేశవ్.  పార్టీకి సంబంధించిన మహానాడు కావచ్చు లేదా ఇతర సభల్లో కానీ కేశవ్‌నే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ దూసుకుపోయేవాడు.  అలాంటోడు ఇపుడు సైలెంట్ అయిపోయాడు .

కేశవ్ చిన్న వయసులోనే రాజకీయాల్లో ప్రవేశించారు. ఉరవకొండ నుంచి వరుసగా ఆరు సార్లు పోటీ చేసి, నాలుగుసార్లు విజయం సాధించారు. రెండుసార్లు ఓడిపోయారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరపున గట్టిగా మాట్లాడే వారే లేరు. అలాంటి తరుణంలో పార్టీకి  కేశవ్ ఎందుకు దూరంగా ఉంటున్నారు.? అసలు  ఏం జరిగి వుంటుంది? అనే సందేహాలు చాలా మందిలో వ్య‌క్తం అవుతున్నాయి. చంద్రబాబు కూడా పిలిపించి మాట్లాడిన దాఖలాలు లేవు.

పయ్యావుల కేశవ్ 2014 ఎన్నికల్లో ఓడిపోయాడు. అప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది.  2015లో స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పయ్యావుల కేశవ్ మంత్రి పదవి ఆశించారు. నిజానికి బాబు అనుకుని  వుంటే ఆయనను మంత్రిని చేసి వుండేవారు. కానీ అలా జరగలేదు. 2019 ఎన్నికల్లో కేశవ్ గెలిచిన తర్వాత కూడా అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అసంతృప్తితోనే కేశవ్ దూరంగా ఉంటున్నారనే  అభిప్రాయం వ్యక్తమౌతోంది . తనకన్నా  పరిటాల కుటుంబానికి పార్టీలో ప్రాధాన్యత ఎక్కువగా ఉందనే  విషయం కూడా కేశవ్ గమనించారని అంటారు. ఆనాడు అధినేత వ్యవహరించిన తీరు ఇప్పుడు కేశవ్‌ మౌనానికి  కారణంగా చెబుతున్నారు. 2004, 2009 ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో పార్టీ  వాణిని గట్టిగా వినిపించిన వ్యక్తికి తగు రీతిలో గౌరవం దక్కలేదనేది కేశవ్‌ అనుచరుల  వాదన. పార్టీ కోసం పనిచేసి  అధికార పార్టీ టార్గెట్‌గా మారి ఇబ్బందులు ఎదుర్కొన్నా నాడు  దూరంగా పెట్టినందుకే కేశవ్ ఇపుడు కావాలనే పార్టీకి దూరంగా ఉంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అదలా ఉంటే ….కొంత కాలం క్రితం కేశవ్ ను బీజేపీ లోకి తీసుకుని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి ఏపీ  అధ్యక్ష బాద్యతలు అప్పగించాలని   బీజేపీ అధిష్టానం భావించింది. అందరిని కలుపుకుపోగల సామర్థ్యం ఉన్న కేశవ్ దానికి తగిన వ్యక్తి అని కొందరు నేతలు బీజేపీ  అగ్ర నేతలకు సిఫారసు చేశారు. ఈ విషయం ఒక బీజేపీ నేత తనకు చెప్పినట్టు సీనియర్ జర్నలిస్ట్ ఒకరు తర్జనికి చెప్పారు . ఈ క్రమంలోనే చంద్రబాబు ఇది గమనించి  కీలకమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) చైర్మన్ గా కేశవ్ పేరు ఖరారు చేశారు. నాడు  కేశవ్  బీజేపీ లోకి వెళ్ళివుంటే  పదవి ఇచ్చినా పార్టీ వీడారని బాబు విమర్శలు చేసేవారు. అయితే ఆ ఛాన్స్ ఆయనకు రాలేదు. ఆ దరిమిలా  కూడా  సుమారు 45 మంది టీడీపీ నేతలు బీజీపీ లో చేరడానికి సిద్ధమయ్యారు. వారిలో కేశవ్ కూడా ఉన్నారు.  అయితే సోము వీర్రాజు ఏపీ బాధ్యతలు చేపడతారని ఫీలర్లు రాగానే … ఆయన వ్యవహారశైలి తెలిసి అందరూ ఆగిపోయారు. ప్రస్తుతం  పార్టీకి కేశవ్ దూరం దూరం గానే ఉంటున్నారు. ఇలా ఎంత కాలం దూరం మైంటైన్ చేస్తారో తెలియని విషయం.  కేశవ్ నియోజకవర్గంపైనే దృష్టి పెట్టినప్పటికీ  భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 

ఇది కూడా చదవండి >>>>>>>>>  బరిలో నిలిచేదెవరో ? ఓడేదెవరో ?

———–– KNM 


 

Sharing is Caring...
Support Tharjani

One Response

  1. గుత్తా హరిసర్వోత్తమ నాయుడు November 27, 2020
error: Content is protected !!