దుమ్మెత్తి పోసుకుంటున్న నేతలు … మౌనంగా చూస్తున్న ఓటర్లు !

Sharing is Caring...

హైదరాబాద్ ‌జీహెచ్ ఎంసీ  ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.  ప్రధానంగా   బీజేపీ-ఎంఐఎం పార్టీల నేతల  ప్రసంగాలు దుమారం రేపుతున్నాయి. నేతలు పదునైన విమర్శలు కలకలం రేపుతున్నాయి. ముందెన్నడూ ఈ రీతిలో ప్రచారం జరగలేదు. ఎన్నికలు దగ్గర పడేకొద్దీ విమర్శలు .. వాగ్గానాల జోరు కూడా పెరుగుతోంది.

బీజేపీ  ఎంపీ తేజస్వీ సూర్య ఎంఐఎం నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ పాకిస్తాన్‌ ఏజెంట్‌గా పనిచేస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా పాకిస్తాన్‌ జాతిపిత మహ్మద్‌ అలీ జిన్నాతో పోల్చారు. దేశ విభజన సమయంలో హైదరాబాద్‌ సంస్థానాన్ని పాకిస్తాన్‌లో విలీనం చేయాలని జిన్నా డిమాండ్‌ చేశారని, ఒవైసీ కూడా అదే ఆలోచన కలిగిన వ్యక్తి అని తేజస్వి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్తాన్‌ దేశాల నుంచి వలసవచ్చిన ముస్లింలు పాతబస్తీలో అక్రమంగా నివాసముంటున్నారని ఆరోపణలు గుప్పించారు. హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున రొహింగ్యాలు, పాకిస్తాన్‌ ఓట్లు ఉన్నాయని దుయ్యబట్టారు.

తేజస్వీ విమర్శలపై ఒవైసీ కూడా ఘాటుగానే జవాబు ఇచ్చారు. హైదరాబాద్‌లో పాకిస్తాన్‌, రొహింగ్యా ఓటర్లు  ఉంటే కేంద్రహోం మంత్రి  అమిత్‌ షా ఏం చేస్తున్నారు.? నిద్రపోతున్నారా? అంటూ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే భాగ్యనగరంలోని రొహింగ్యాలకు షెల్టర్‌ ఇచ్చారన్న విషయాన్నీ  ఒవైసీ గుర్తుచేశారు. మరోవైపు మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు, మాజీ సీఎం ఎన్టీఆర్‌లపై ఒవైసీ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాన్ని సృష్టించాయి.  పీవీ, ఎన్టీఆర్‌ ఘాట్స్‌ను కూల్చివేస్తామంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేత చంద్రబాబు కూడా స్పందించారు.  రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇక బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ వివాదాస్పద వ్యాఖ్యలతో కలకలం సృష్టిస్తున్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే పాతబస్తీలో సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తామన్న ఆయన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పాకిస్థాన్ పాత బస్తీలో ఉందా అంటూ తెరాస నేతలు సంజయ్ పై విరుచుకు పడుతున్నారు.  మొత్తం మీద ఈ ఎన్నికలు రాజధానిలో వేడి పుట్టిస్తూ రసవత్తర దశకు చేరుకున్నాయి. ఓటర్లు అందరి మాటలు శ్రద్ధగా గమనిస్తున్నారు. ముందే చెప్పినట్టు బీజేపీ నేతలు దూకుడుగానే వెళుతున్నారు. తెరాస నేతలు అదే దూకుడుతో తన సత్తా చాటాలని ప్రయత్నాలు  చేస్తున్నారు.  ఓటర్లు మాత్రం గుంభనంగా ఉన్నారు. ఎటు వైపు మొగ్గు చూపుతారో అర్ధంకాని పరిస్థితి నెలకొంది.

———-  KNM 

ఇది కూడా చదవండి>>>>>>>>>>> అధినేత్రి నిర్ణయాల వెనుక సలహాలు ఆయనవే !

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!