కొంగ్కా లా పాస్ మిస్టరీ ఏమిటో ?

Sharing is Caring...

The Kongka La Pass ……………………..

హిమాలయాల్లోని  కొంగ్కా లా చిన్నపర్వతం. ఇది లడఖ్‌లోని వివాదాస్పద భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలోఉంది. ఈ ప్రాంతం లడఖ్ పరిధిలోకి వస్తుంది, అయితే చైనా ఈ ప్రాంతం తమ సొంతం అని వాదిస్తుంది. చైనా కొంగ్కా లా పాస్‌ను తన టిబెట్ సరిహద్దుగా పరిగణిస్తుంది.చైనా ఆధీనంలో ఉన్న ఈశాన్య భాగాన్ని అక్సాయ్ చిన్ అని పిలుస్తారు. భారత్ సౌత్ వెస్ట్‌ను లడఖ్ అని అంటారు.

1956 ప్రాంతంలో కరమ్ సింగ్ అనే అధికారి నేతృత్వంలో 10 మంది పోలీసుల బృందానికి ఈ ప్రాంతంలో గస్తీ స్థావరాలను ఏర్పాటు చేసేందుకు బాధ్యతలు అప్పగించారు. అందులో ఇద్దరు వ్యక్తులను చైనా సైన్యం అదుపులోకి తీసుకుంది. ఈ ఇద్దరు వ్యక్తులను వెతకడానికి 20 మంది సైనికులతో కూడిన గస్తీ బృందాన్ని పంపించారు. వీరంతా చైనా సైనికుల బృందాన్ని ఎదుర్కొన్నారు.

ఇరు వర్గాలమధ్య భీకరమైన కాల్పులు జరిగాయి.9 మంది చనిపోయారు. కొందరిని పట్టుకుని చిత్రహింసలు పెట్టారు. చివరికి కొంగ్కా లా పాస్ యుద్ధ భూమిగా మారింది. చైనా భారత్ సైన్యం మధ్య పెద్ద ఘర్షణ జరిగింది. తర్వాత  రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ సరిహద్దు వద్ద భారత్ కానీ చైనా కానీ పెట్రోలింగ్ చేయకూడదని అంగీకారానికి వచ్చాయి.అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని చూడటానికి ఎవర్ని అనుమతించరు. రెండు దేశాల సైన్యం దూరం నుంచే ఈ ప్రాంతం పై ఓ కన్నేసి ఉంచుతాయి. దీంతో ఈ ప్రాంతం మనుష్యులు ఎవరూ సంచరించని ప్రదేశంగా మారిపోయింది.

అదలా ఉంటే తర్వాత కొన్నాళ్ళకు సరిహద్దుకు రెండు వైపులా ఉన్న గ్రామ ప్రజలు అక్కడ UFO (గుర్తించని ఎగురుతున్న వస్తువులు) భూమి నుండి బయటకు రావడం చూశామని వాళ్లకు వీళ్లకు చెప్పడంతో రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. UFO భూగర్భ స్థావరాలు అక్కడ ఉన్నాయని ఇది భారత .. చైనా ప్రభుత్వాలకు తెలుసు అని కూడా అంటారు. UFOలు తమ కార్యాచరణ స్థావరంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నాయని ప్రచారం మాత్రం జరుగుతోంది.

వీటికి సరైన ఆధారాలు లేవు. అక్కడి కెళ్ళి చూసిన వారు లేరు.  గూగుల్ ఎర్త్ నుంచి తీసిన చిత్రాల పేరిట కొన్ని ఫోటోలు కూడా ప్రచారంలో కొచ్చాయి. కొంగ్కాలా పాస్‌  పరిసర ప్రాంతం లో సైనిక స్థావరంలా కనిపించే భవనాలు ఉన్నాయని కూడా ప్రచారం జరిగింది. అమెరికాలో ఏరియా 51 లా UFO లకు కొంగ్కా లా పాస్ స్థావరంగా మారింది అనే కథనాలు వెలువడ్డాయి.

ఆమధ్య కొంతమంది హిందూ పర్యాటకులు పశ్చిమ కనుమ నుండి కైలాస పర్వతానికి వెళుతుండగా, ఆకాశంలో వింత కాంతి… గాలిలో ఎగురుతున్న వస్తువులు కనిపించాయట. అది అక్కడ మామూలే అని స్థానికు గైడ్స్ అన్నట్టు ప్రచారం జరిగింది. కొంతమంది పరిశోధకులు ఈ ప్రాంతాన్ని చూడాలని ప్రయత్నించారు.

చైనా వైపు నుండి ప్రవేశించడానికి నిరాకరించడంతో వారు ఇండియా  వైపు నుండి ఆ సైట్‌ను చేరుకోవడానికి ప్రయత్నించారు. భారత సరిహద్దు గస్తీదళాలు కూడా వారిని అనుమతించలేదు. దీంతో ఆ ప్రాంతంలో ఏదో జరుగుతుందనే ప్రచారం ఊపందుకుంది. ఏమిటనేది మాత్రం మిస్టరీ గా మిగిలిపోయింది. కొంగ్కా లా పాస్ చుట్టూ కొండలు ..లోయలు .. పచ్చని ప్రకృతితో కూడిన సుందరమైన ప్రదేశం.. పౌరులు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి మాత్రం అనుమతులు లేవు.

 

———-KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!