అయోధ్యకు ఏ సమయంలో వెళితే మేలు ?

Sharing is Caring...

People’s desire to see Rama………………….

టెలివిజన్ స్క్రీన్స్‌పై  బాల రాముడ్ని చూసి తరించిన సామాన్య భక్తులు.. ఎపుడెపుడు అయోధ్య వెళదామా అని ఆసక్తి తో ఉన్నారు. అక్కడికి చేరేందుకు మార్గాలు ఏమిటా అని వాకబు చేస్తున్నారు.   ఇవాల్టి నుంచి [జనవరి 23]  అయోధ్య రామాలయ ద్వారాలు భక్తులందరి కోసం తెరిచే ఉంటాయి.

ఉదయం ఏడునుంచి పదకొండున్నర వరకు.. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి ఏడు గంటల వరకు బాలరాముని దర్శన వేళలు గా నిర్ణయించారు. రామదర్శనం  కోసం ఎటువంటి ప్రత్యేక రుసుమూ చెల్లించక్కర్లేదు. 

ప్రతి రోజు మూడుసార్లు స్వామివారికి హారతిస్తారు. ఈ హారతి దర్శనం కోసం  ప్రత్యేక పాసులు జారీ చేస్తారు. లోపలికి  30 మందిని  మాత్రమే అనుమతిస్తారు.  రామజన్మభూమి కోసం శ్రమించిన కరసేవకులకు దర్శనం విషయంలో ప్రాధాన్యత ఇస్తారు.

ఈనెల 24 నుంచి కరసేవకుల్ని అనుమతిస్తారు.అందరికీ ఆహ్వానాలు పంపింది రామాలయ ట్రస్ట్. ఒక్కో జిల్లా నుంచి కనీసం 2 వేల మంది వస్తారని భావిస్తున్నారు.ఈ సమయంలో దూర ప్రాంత భక్తులు రాకపోవడం మంచిదని ట్రస్ట్ సభ్యులు అంటున్నారు. 

అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే కరసేవకుల బృందాలతో  అయోధ్యలో విపరీతమైన రద్దీ ఏర్పడే అవకాశముంది.  వీఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో వెళితే  సామాన్య భక్తులకు ఇక్కట్లు తప్పవు.

అందుకే.. మార్చి, ఏప్రిల్ నెలల తర్వాతే  దూర ప్రాంత భక్తులు అయోధ్య ప్రయాణం పెట్టుకోవడం మంచిదని  ట్రస్ట్ నిర్వాహకులు చెబుతున్నారు. 2025 డిసెంబర్‌కల్లా రామాలయ నిర్మాణం పూర్తి అవుతుంది కనుక ఆ తర్వాత అయోధ్యకు వస్తే బాలరాముడి దివ్య దర్శనం మరింత సులభతరమవుతుందని  చెబుతున్నారు .

భక్తులు హైదరాబాద్‌ నుంచి అయోధ్యకు వెళ్లాలంటే 6 ఎక్స్‌ప్రెస్ రైళ్లున్నాయి. ఇందులో ఒక్కటి మాత్రమే నేరుగా అయోధ్య జంక్షన్‌కు వెళుతుంది.  మిగతావి మన్కాపూర్. గోండా స్టేషన్ల మీదుగా అయోధ్య చేరుకుంటాయి.

అక్కడి నుంచి దాదాపు 50 కిలోమీటర్లు ప్రయాణిస్తే  అయోధ్య క్షేత్రం చేరుకోవచ్చు. బస్సు  సౌకర్యం ఉంది కాబట్టి ఇబ్బంది ఉండదు. ఈ లోగా రైళ్లు , బస్సుల సంఖ్య పెరిగే అవకాశాలు లేకపోలేదు. హైదరాబాద్  నుంచి అయోధ్య వెళ్లాలంటే సరాసరి 30 గంటలు ప్రయాణం చేయాలి. 

కాశీ యాత్రకు వెళ్లే భక్తులు అక్కడ నుంచి  మరో నాలుగు గంటలు ప్రయాణిస్తే అయోధ్యకు వెళ్ళవచ్చు. అయోధ్యలో ఇటీవలే అధునాతన ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభమైంది.అక్కడినుంచి ప్రధాన నగరాలకు సులభంగా వెళ్ళవచ్చు. ట్రావెలింగ్ అండ్ టూరిస్ట్ కంపెనీలు  ఆకర్షణీయమైన ప్యాకేజీల్ని కూడా సిద్ధం చేస్తున్నాయి.  ఏదైనా మార్చి  తర్వాత అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా రాముని దర్శనం చేసుకోవచ్చు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!