ఆ జలాశయం మిస్టరీ ఏమిటో ? 

Sharing is Caring...

mystery of  reservoir ……………………………….మన దేశంలో ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీలు .. రహస్యాలు .. వింతలు ఎన్నో ఉన్నాయి. ఈ భీమ్ కుండ్ జలాశయం కూడా ఆ కోవలోదే. డిస్కవరీ ఛానల్ వాళ్ళు వచ్చి చాలా పరిశోధనలు చేశారు. అయినా ఈ జలాశయం లోతు ఎంతో తేల్చలేక పోయారు. గజ ఈతగాళ్ళు రంగంలోకి దిగినా కనుక్కోలేకపోయారు. పైగా కొంత లోతుకు పోయాక సముద్రం లో ఉన్న అనుభూతికి లోనయ్యారట. ఈ జలాశయం ఏదో సముద్రానికి అనుసంధానమై ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారట.  అంతకు ముందు ఎన్నడూ చూడని జలచరాలు కూడా కనిపించాయట. అదలా ఉంటే కొంత లోతుకు వెళ్ళాక జలాశయంలోకి నీరు రావడానికి ఒక మార్గం .. మరోవైపు బయటకు వెళ్లే మార్గం ఉన్నట్టు కనుగొన్నారట. 

ఆసియా ఖండంలో ఏదైనా ప్రకృతి విపత్తులు సంభవించినపుడు ఈ జలాశయంలో నీటి మట్టం పెరుగుతుందట. అలా నీటి మట్టం పెరిగిందంటే ఏదో విపత్తు రానుందని అక్కడి వారు భావిస్తారట.ఈ జలాశయంలో నీరు సముద్రపు నీటిలాగా కొంచెం బ్లూ కలర్ లో ఉండి, స్వచ్ఛంగా,పారదర్శకంగా ఉంటుంది. ఇక్కడ స్నానం మాచరిస్తే చర్మవ్యాధులు తొలగి పోతాయని,సర్వ పాపాలు నశిస్తాయని నమ్ముతారు.ఈ జలాశయం మధ్యప్రదేశ్ లోని చతర్పూర్ జిల్లా కి 80 కి.మీ. దూరంలో.. బజ్నా గ్రామానికి సమీపంలో ఉంది. ఈ జలాశయానికి భీమ్ కుండ్ పేరు రావడానికి ఒక పురాణ కథ ప్రచారంలో ఉన్నది.

పాండవులు వనవాస సమయంలో ఇటు గుండా వెళుతుండగా ద్రౌపది కి దాహమై ఇబ్బంది పడగా … భీముడు ఆ చుట్టుపక్కల చూస్తే కనుచూపుమేరలో నీటి చుక్క కూడా కనిపించలేదట. అదంతా కొండ ప్రాంతం.  దాంతో భీముడు తన గద తీసుకుని కోపంతో ఆ కొండపై ఒక దెబ్బ కొట్టాడట. అంతే అక్కడ రాళ్లు పగిలి .. భూమి రెండు ముక్కలు అయి జలాశయం ఏర్పడిందట. అపుడు పాండవులంతా తమ దాహం తీర్చుకుని .. అక్కడ కొంత కాలం విశ్రాంతి తీసుకుని వెళ్లిపోయారట. అప్పటినుంచి ఆ జలాశయం ఎండిపోకుండా అలానే ఉంది. కాలక్రమం లో దానికి భీమ్ కుండ్ అనే పేరు వచ్చింది.

సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ జలాశయంలో స్నానం చేసేందుకు యాత్రికులు వస్తుంటారు. ఇక్కడ నీరు నీలిరంగులో ఉండటం వలన ఈ జలాశయాన్ని  నీల్ కుండ్ అని నారద్ కుండ్ అని కూడా పిలుస్తారు.నారదుడు ఒకప్పుడు ఇక్కడ తపస్సు చేశారట. ఆయన భక్తికి మెచ్చిన మహావిష్ణువు జలాశయంలో నుంచి వచ్చి దర్శనమిచ్చాడట. అందువలన ఇక్కడ నీరు విష్ణువు రంగులో ఉంటుందని మరో పురాణ కథనం చెబుతున్నది

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!