Can death be conquered by Kriya Yoga?……………………………….
క్రియాయోగం … ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన సబ్జెక్టు. వాస్తవానికి ఎప్పటి నుంచో క్రియా యోగం వాడుకలో ఉంది. భగవానుడు సూర్యునికి నేర్పిన ఈ యోగం కాలక్రమేణా మాయమైపోయింది. దాన్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన వారు బాబాజీ. క్రియా యోగం ఆధ్యాత్మిక ప్రక్రియను వేగవంతం చేసే సాధనం.
శరీరం మీద, మనస్సు మీద ఏవరైతే ఆధిపత్యం పెంచుకుంటారో వారే క్రియా యోగులు. వారు మృత్యువును జయిస్తారు . దేన్నైనా సాధిస్తారు. ఈక్రియా యోగాన్ని గురు ముఖతః నేర్చుకోవాలి. బాగా అభ్యాసం చేస్తే 12 సంవత్సరాలలో భగవత్ దర్శనం పొందటానికి అనువుగా శరీరం సిద్దమౌతుంది.
క్రియా యోగం లో ముఖ్యమైన అంశం క్రియా కుండలినీ ప్రాణాయామం. దీన్నిఅభ్యసించడం ద్వారా వెన్నుముక లోని నాడులు ,చక్రాలు ఉత్తేజమౌతాయి. సాధకునికి ఓంకార నాదం వినబడుతుంది. భ్రూమధ్యంలో వెలుగు గోచరిస్తుంది. దేహంలోని అన్ని ప్రాణనాడులు ఉత్తేజమవుతాయి. క్రియా యోగంలో అయిదు మెట్లు ఉన్నాయి. మొదటి క్రియా దీక్షతోనే చాలావరకు సాధన జరుగుతుంది. సాధకుని పురోగతిని బట్టి మిగిలిన దీక్షలు చేపట్టవచ్చు.
కొందరికి పరమగురువుల దర్శనం కలుగుతుంది.వారి ద్వారానే ఇతర దీక్షలు సాధకులు చేపడతారు. మనిషి రక్తం లో ఉన్న కర్బనాన్ని హరింపజేసి , ప్రాణవాయువుతో నింపే ఒక మానసిక శారీరక ప్రక్రియ. అదే క్రియా యోగం. ఎందరో ప్రసిద్ధ యోగులు,బాబాలు, పండితులు ఈ క్రియాయోగం ప్రక్రియ ను ఉపయోగించి ఫలితాలను సాధించారు.
క్రియా యోగం ద్వారా ఊపిరి తిత్తులు, గుండె చేసే పనిని నెమ్మది చేసి ,తద్వారా అదనంగా ప్రాణ శక్తి సరఫరా చేసుకోవచ్చు. ఈ ప్రాణశక్తి ద్వారా జీవకణ క్షయాన్ని అరికట్టవచ్చు. అలాగే అపానాన్ని అదుపు చేసుకుని శరీరంలో పెరుగుదలకు సంబంధించిన మార్పులను అరికట్టవచ్చు. ఆప్రకారంగా యోగి తన శరీరం లోని అరుగుదల, పెరుగుదల పై నియంత్రణ సాధిస్తాడు. ప్రాణశక్తిని అదుపులో ఉంచుకుంటాడు.
ఇక కనుబొమల మధ్య బిందువు పై చూపు నిలపడం వల్ల, ముక్కులోనూ, ఊపిరి తిత్తుల్లోనూ ఆడే ప్రాణ ,అపాన వాయువుల సమ ప్రవాహాలను తటస్తీకరించుకుంటాడు. లక్ష్యాన్ని సాధించాల్సిన యోగి క్రమంగా బాహ్య విషయాల నుంచి వెనక్కి తగ్గుతాడు. మనస్సును ,బుద్ధిని అదుపులోకి తెచ్చుకుంటాడు. కోరిక,భయాన్ని,కోపాన్ని తరిమివేస్తాడు. వాటి నుంచి శాశ్వతంగా విముక్తి పొందుతాడు.
ఈ దశ వరకు వెళ్లడం కొందరికే సాద్యం. దానికి ఎంతో ఏకాగ్రత,గట్టి సంకల్పం ఉండాలి. శ్రీకృష్ణుడు భగవద్గీతలో కూడా ఈ క్రియా యోగం గురించి రెండు చోట్ల ప్రస్తావించాడని అంటారు. కృష్ణుడు వివసత్వునికి దీన్ని గురించి ఉపదేశించగా. ఆయన మనువుకి చెప్పాడని అంటారు.
శరీర వ్యాయామం, మనో నిగ్రహం, ఓంకారం మీద దృష్టి పెట్టి ధ్యానం చేస్తే అది క్రియాయోగమే అని పతంజలి మహర్షి చెబుతారు. ఈ క్రియా యోగం మూలంగా మనిషి ముఖంలో తేజస్సు పెరుగుతుంది. కనులు కాంతివంతమౌతాయి. స్వభావంలో నిర్మలత్వం వస్తుంది.
ఈ క్రియా యోగాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది పరమహంస యోగానంద … ఆయన మరణించే ముందు వరకు కూడా చిరునవ్వుతోనే ఉన్నారట. ఇక క్రియా యోగాన్ని వెలుగు లోకి తెచ్చి ఉద్ధరించింది బాబాజీ
——— KNMURTHY