Badrinath…………………………………………..
దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలలో బద్రీనాథ్ ఒకటి. చార్ ధామ్ యాత్రలో భాగంగా చివరిగా దర్శించే క్షేత్రం ఇదే. ఈ క్షేత్రానికి ఎన్నో విశిష్టతలు, ప్రత్యేకతలు ఉన్నాయి. బద్రీనాథ్ ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ఉన్నటు వంటి తీర్థాల్లో సమస్త దేవతలూ ఉన్నట్లు పురాణాలు చెబుతాయి. ఈ క్షేత్రంలో విష్ణువు రేగుచెట్టు రూపంలో ఉన్నట్లు చెబుతారు.
అదే విధంగా ఇక్కడ ఉన్నటు వంటి ఒక జలపాతం దగ్గరకు వెళ్ళినపుడు నీటి తుంపరలు అందరిపై పడవని కేవలం పుణ్యాత్ముల పై మాత్రమే నీరు పడుతుందని చెబుతారు. చాలా మంది దీనిని ప్రత్యక్షంగా చూశామని చెబుతుంటారు. హిందూ పురాణాల ప్రకారం భారత దేశంలో 108 దివ్య క్షేత్రాలు ఉన్నాయి. ఇందులో బద్రీనాథ్ కూడా ఒకటి.
ఆదిశంకరాచార్యులు వారు అలకనందా నదీ తీరంకు వచ్చినపుడు ఆయనకు ఒక సాలగ్రామం లభిస్తుంది. దీనిని తప్తకుండ్ వేడి నీటి చలమలో శుద్ధి చేసి అక్కడే ప్రతిష్టించారు.ఆ సాలగ్రామాన్ని ప్రతిష్టించిన ప్రాంతంలోనే 16వ శతాబ్దంలో గర్హ్వాల్ రాజు బద్రీనాథ్ విగ్రహాన్ని ప్రతిష్టించారని చరిత్ర చెబుతోంది.
మరో కథనం ప్రకారం సంస్కతంలో బద్రి ఫలము అంటే రేగు పండు. ఈ ప్రాంతంలో విపరీతంగా రేగుపళ్లు పండటం వల్ల ఇక్కడ ఉన్న లక్ష్మీనారాయణుడికి బద్రీనాథుడని పేరు వచ్చిందని అంటారు. గర్హ్వాల్ కొండ పై అలకనందా నదీ తీరంలో 3133 మీటర్ల ఎత్తులో నర నారాయణ కొండల మధ్య ఉన్న నీలకంఠ శిఖరానికి దిగువ భాగంలో ఉంది బద్రీనాథ్ దేవాలయం. ఆలయం ఎత్తు 50 అడుగులు. ఈ ఆలయ ముఖ ద్వారం భారతీయ అద్భుత శిల్ప కళకు నిదర్శనంగా నిలుస్తుంది.
ఆలయం పై కప్పు బంగారు రేకులతో తాపడం చేయడం వల్ల ఎంతో మనోహరంగా కనిపిస్తుంది. శ్రీ కష్ణుడు నారాయణుడిగా, అర్జునుడు నరుడిగా ఆశ్రమ జీవితం గడిపిన ప్రదేశం ఇదే అంటారు. గంగానది భూమికి దిగివచ్చే సమయంలో తన శక్తి వంతమైన ప్రవాహాన్ని భూమి భరించడం కష్టమని భావించి 12 పాయలుగా చీలి పోయింది. అందులో అలకనందా నది ఒకటి. ఆ నది ఇక్కడ దగ్గర్లోనే ఉంది.
కురుక్షేత్రం తర్వాత పాండవులు స్వర్గారోహణ చేసే సమయంలో ఇక్కడికి వచ్చినట్లు వ్యాస భారతంలో ప్రస్తావించారు. అందులో వర్ణించిన గుహలను ఇప్పటికీ ఇక్కడ చూడవచ్చు. ప్రధాన దేవాలయానికి 8 కి. మీ దూరంలో వసుధార అనే చిన్న జలపాతం ఉంది. ఈ జలపాతం దగ్గరకు వెళితే నీటి తుంపరలు అందరి పైనా పడవు. కేవలం పుణ్యాత్ముల పై మాత్రమే నీరు పడుతుందని చెబుతారు.
బద్రీనాథ్ కేదరీనాథ్ కు దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శీతాకాలంలో ఇక్కడ వాతావరణం మానవుల సంచారానికి అనువుగా ఉండదు. అందువల్లే ఈ క్షేత్రంలో స్వామివారిని దర్శించుకోవడానికి వేసవి కాలంలోనే అనుమతిస్తారు.బద్రీనాథ్ పుణ్య క్షేత్రానికి దగ్గరగా వ్యాస గుహ ఉంది. ఇక్కడే వేద వ్యాస మహర్షి మహా భారతం, ఇతర గ్రంధాలను రాశారని అంటారు.
భారత దేశపు చివరి గ్రామమైన మనా కూడా బద్రీనాథ్ ఆలయానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. మనా గ్రామానికి అవతల ఉన్న సతోపంత్ సరస్సును సందర్శించేందుకు చాలా మంది యాత్రికులు సుదీర్ఘ ట్రెక్ కు వెళుతుంటారు. ఇక్కడకు దగ్గర్లో భవిష్య బద్రీ దేవాలయం ఉంది. ఇది జోషి మఠానికి 17 కిలోమీటర్ల దూరంలో తపోవనం దగ్గరగా ఉంటుంది.
ఇక్కడ నరసింహస్వామి కొలువై ఉంటాడు. భవిష్యత్తులో ఛార్ ధామ్ లో ఒకటైన బద్రీనాథ్ చేరుకోలేని పరిస్థితి వస్తుందని అప్పుడు విష్ణుమూర్తి ఈ దేవాలయంలోనే కొలువవుతాడని ఇక్కడి పూజారులు చెబుతుంటారు.అందువల్లే ఈ దేవాలయానికి భవిష్య బద్రీ దేవాలయం అనే పేరు వచ్చింది.
కరోనా వల్ల గత రెండేళ్లుగా ఇక్కడ ఆంక్షలున్నాయి. అందుకే తక్కువ సంఖ్యలో భక్తులు యాత్రకు వెళ్లారు. కానీ ఈసారి ఆంక్షలను సడలించడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. ఇటీవల ఈ యాత్ర మొదలైంది. ప్రారంభంలోనే కొంతమంది భక్తులు అనారోగ్యంతో చనిపోవడంతో ప్రభుత్వం ఆరోగ్య పరీక్షలను తప్పని సరి చేసింది. ఈ సారి యాత్రలో పాల్గొనదలచిన భక్తులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం ప్రవేశపెట్టారు. యాత్రీకులు తగు జాగ్రత్తలు తీసుకుని వెళ్లడం మంచిది.