చార్ ధామ్ యాత్ర అంటే ? ( 2 )

Sharing is Caring...

Trekking in Himalayas…………………………………. 

మంచుకొండల్లో కొలువైన కేదార్ నాధుడిని దర్శించడం అంత సులభం కాదు.  మండు వేసవిలో కూడా అక్కడ 5 డిగ్రీలకంటే ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. చార్ ధామ్ యాత్రలో భాగంగా కేదార్ నాథ్ క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు.  తప్పక చూడాల్సిన క్షేత్రాల్లో కేదార్‌నాథ్ ఒకటి.

ఇది ఉత్తరా ఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లా గర్హ్వాల్ కొండల పై భాగంలో ఉంది. కేదారేశ్వరుని  ఆలయం సముద్ర మట్టానికి 3584 మీటర్ల ఎత్తులో ఉంది. కొండలను, గుట్టలను ఎక్కుతూ వెళ్లి ఆ శివుడిని దర్శించుకోవాలి. అలా ప్రయాణించడం ఓ అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని భక్తులు చెబుతుంటారు.  శైవ క్షేత్రాల్లో ఇది ముఖ్యమైనది కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలోనే వస్తుంటారు.

మే నెల నుంచి నవంబర్ వరకు గుడి తెరిచి ఉంటుంది. హిమపాతాలు ఎక్కువ కాబట్టి మిగిలిన సమయంలో ఆలయాన్ని మూసి ఉంచుతారు. ఈ గుడిని ఆదిశంకరాచార్యులు  నిర్మించారని చెబుతారు. కేదార్‌నాథ గుడి వెనుక భాగంలో ఆదిశంకరుల సమాధి ఉంది.యాత్రీకులు ఈ సమాధిని సందర్శించవచ్చు.

కేదారనాథ్ క్షేత్రం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. కురుక్షేత్ర యుద్ధానంతరం సగోత్రీకుల హత్యాపాతకం నుంచి బయట పడటానికి పాండవులు శివుని కోసం గాలిస్తూ ఇక్కడికి చేరారు.ఇక్కడే కొన్నాళ్ళు ఉన్నారని అంటారు.  కాగా 2013  వరదల సమయంలో  కేదార్ నాథ్ తీవ్రంగా ప్రభావితమైంది.

ఆలయ సముదాయం, చుట్టుపక్కల ప్రాంతాలు, కేదార్‌నాథ్ కొంత మేరకు నష్టపోయాయి.ఎత్తైన పర్వతాల నుండి ప్రవహించిన వరద నీటి కారణంగా  నాలుగు గోడలకు ఒక వైపున కొన్ని పగుళ్లు మినహా ఆలయ నిర్మాణానికి ఎటువంటి పెద్ద నష్టం జరగలేదు.  ఒక పెద్ద రాయి అడ్డుగా నిలిచి  వరద నుండి ఆలయాన్ని రక్షించింది.

గౌరీ కుండ్ నుంచి కాలినడకన ఆలయానికి చేరుకోవాలి . ఈ మార్గం లో  వృక్షాలతో కూడిన పచ్చని పర్వతాలు, జలపాతాలు యాత్రీకులకు కనువిందు చేస్తాయి. కేదార్ నాధుని ఆలయం పర్వత శిఖరాగ్రంలో ఉంటుంది.  శిఖరాగ్రాన్ని చేరుకుని  కేదారేశ్వరుడిని దర్శించి కిందకు రావడం మరిచి పోలేని  అనుభూతి గా మిగులుతుందని యాత్రీకులు చెబుతుంటారు.

నడవలేని వారిని గుర్రాలు ,డోలీల ద్వారా కొండపైకి తీసుకెళతారు. గౌరీ కుండ్ నుంచి స్వామి ఆలయానికి 14 కి.మీ దూరం ఉంటుంది. రెగ్యులర్ గా నడక అలవాటు ఉన్నవారికి ఈ దూరం పెద్ద కష్టం కాదు.సునాయాసంగా నడవగలరు. ఆరోగ్య పరిస్థితి బాగున్నవారే యాత్రకు వెళ్లడం మంచిది. మార్గ మధ్యంలో ఏడు కిలో మీటర్ల తర్వాత రాంబాడా అనే ప్రాంతంలో టీ, కాఫీ, ఫలహారాలు దొరుకుతాయి. చీకటి పడితే పడుకోడానికి వసతి సౌకర్యాలు కూడా ఉంటాయి.

గౌరీకుండ్ లో మాములుగా ఉండే వాతావరణం నాలుగు కిలోమీటర్ల తర్వాత మెల్లగా మారుతుంది, చలి పెరుగుతుంది. ఎండాకాలంలో కూడా పది డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. కేదారినాథ్ కొండపైన 5డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది. వీటిని తట్టుకుని వేలాది భక్తులు స్వామిని దర్శించుకుని వెళుతుంటారు.

కేదార్నాథ్  వెళ్ళడానికి హరిద్వార్ లో కార్లు అందుబాటులో ఉంటాయి. సొంతంగా ప్రయాణించాలంటే మాత్రం రిషికేశ్ కు రావాల్సిందే. ఉదయం 8 గంటలకు రిషికేశ్ లోని ఉత్తరాఖండ్ ఆర్టీసీ స్టేషన్ నుంచి గౌరీకుండ్ కి బస్సులు  దొరుకుతాయి. అక్కడనుంచి కాలినడకన ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!