Taadi Prakash………………………………………………..
క్రానికల్ నుంచి వచ్చిన ఏ సబెడిటరో చూసి ఆఫీసుకెళ్లి హుస్సేన్ ఉన్నాడని చెప్పగానే ఫోటోగ్రాఫర్లు తయారు. మర్నాడు మొదటి పేజీలో పెద్ద ఫోటో. అలా వాళ్లెన్నిసార్లు వేశారో లెక్కలేదు.అలా ఒకరోజు ఫోటో చూసి “గురూ హుస్సేన్ కమ్స్ టు టౌన్” అని అందరికీ వూదాను. వెళ్దామా అన్నారు. వెళ్దాం అనుకున్నాం.మాలాగే పలువురు ముక్కూమొహం లేని చిత్రకారులందరికీ ఫోన్లు కొట్టాం. బిలబిలమంటూ అంతా పోగై ‘సినిమా ఘర్’కి వెళ్లాం. ఓ ఇరవై మంది ఉంటామేమో.
ఆ భవంతి పూర్తిగా కట్టడానికింకో రెండేళ్లు పట్టేట్టుంది. ఒట్టి సిమెంట్ స్కెలిటన్ ఉంది. లేని, కట్టని గేట్ దగ్గర వాచ్ మన్ కోసం చూస్తుంటే హుస్సేన్ అంత పొడుగూ, అలాటి తెల్లజుట్టూ గల విగ్రహం కనిపించింది. “సార్ రావడానికో అరగంట పట్టొచ్చు, వెయిట్ చేయండి” అన్నాడు ఆయన. ఆయన హుస్సేన్ సాబ్ పెద్దకొడుకు.రోడ్డుకవతల చెట్టుకింద టీ బండి వాడి దగ్గర కూచున్నాం. మా రైటరూ, క్రిటిక్కూ అయిన శివాజీ, ఆర్టిస్టులు రాజు, బ్రహ్మం, ఆంజనేయులు, అక్బర్, శంకర్, అన్వర్, శ్రీరామ్ ఇంకా చాలామందిమున్నాం. ఈలోగా కవయిత్రి శైలజ వచ్చేసింది. ఇంకా జనం చేరారు. అదిగో రానే వచ్చాడాయన. పొలోమంటూ పోయాం.
ఆయన వాచీ వంక చూసుకుని “యు సీ ఐ హేవ్ నో టైమ్ టు టాక్ టు సచె క్రౌడ్. ఐ హేవ్ గాట్ సమ్ అర్జంట్ బిజినెస్ టు అటెండ్” అంటే ఎలా? డైలమా. “పిల్ల కాకులు మీతో నాకేంటి బే” అంటే అప్పుడెలా? ఏమో. తీరా పలకరిస్తే ఏ గుడ్డూ లేదు. నాతో రండన్నాడు. ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్లేముందు సినిమా ఘర్ లో ఏమేం చేద్దామనుకుంటున్నాడో చెప్పాడు. ఇక్కడ లైబ్రరీ, అక్కడ థియేటర్. పైన స్టుడియో, వర్క్ షాప్ ల హాల్. మీరంతా రెగ్యులర్ గా రండి. ఇక్కడే బొమ్మలేసుకోండి. సినిమాలు చూడండి. సెమినార్లు పెట్టుకోండి. మన ఆర్ట్ గురించి చర్చించండి. నిజానికిది మీదే. ఎప్పుడూ నేనుండాలనేం లేదు. మీకు మీరే ఏదొకటనుకుని అది ఇక్కడే చేసుకోండి – అని చెప్పుకుపోతున్నాడు.
చిన్నాపెద్దా లేదు. కొత్తపాతా లేదు. నేను మెగా, మీరు మినీ అనే స్టార్ టాన్ ట్రమ్స్ లేవు. ఫస్ట్ ఫ్లోర్ లో బయట ఎండలో చుట్టూ చేరాం. ఇండియన్ ఆర్ట్, మీరూ మరేంటి సంగతన్నాం. ఇండియా అంటే పండగ అన్నాడు.ఇక్కడంతా ప్రతిరోజూ, ప్రతిదీ సెలబ్రేషనేనని చెప్పాడు. బాట పక్కన పచ్చని చెట్లూ, గడ్డీ, విరబూసిన పూలకింద పెద్ద రాయికి హనుమంతుడి ఎర్ర రంగు పూసి ఉంటుంది. ఈ రంగులే ఇండియా. ఇదే మీ బొమ్మలకి సోర్స్ అన్నాడు. మన జానపదుల్లో గిరిజనుల్లో మన కళను వెదుక్కోండి. అవే మన రంగులు, అవే మన పండగ. మీరు కొత్తగా ఏమీ కనిపెట్టక్కర్లేదు. అవి చూడండి. వేయండి. చాలు అంటున్నారు.
నాలుగ్గంటల పాటు మేం అడగడం, ఆయన చెప్పడం.చిన్నప్పుడు ఆయన బంధువులున్న పాతబస్తీలో తిరగడం, ఇక్కడి వీధులు, చార్మినార్, లాడ్ బజార్, బొంబాయి వెళ్లి సినిమా బేనర్ పెయింటింగ్ చేయడం చాలా చెప్పాడు. అంధేరీ లో చిత్రప్రసాద్ తో చిన్న గదిలో ఉండి బ్లాక్ టీలే తిండిగా బతికిన కాలం గురించి అడిగితే చిత్తప్రసాద్ డ్రాయింగ్స్ పప్పెట్స్ గురించి చాలా చెప్పాడు.ఆయన బొమ్మని ఆయన స్టెల్లోనే గీసిన నా డ్రాయింగ్ మీద సంతకం పెడుతూ “నన్ను రవీంద్రనాథ్ ఠాగూర్ ని చేశావుగా” అన్నాడు. మరి “మీరు అదే గదా” అంటే పువ్వులా నవ్వాడు. మా ఆర్టిస్టులంతా అప్పటికప్పుడు గీసిన కేరికేచర్ల మీద అదేపనిగా ఆటోగ్రాఫ్ లిస్తున్నాడు. “ఒరేయ్ నా సంతకం రేటు కోటిరా. నేను కింగుని.” మీ ముష్టి బొమ్మల మీద సంతకం చేసే ముదనష్టం వాళ్ళా కనిపిస్తున్నాన్రా” అనడం లేదు. పదండి పైకెల్దాం అన్నాడు.
సెకండ్, థర్డ్ ఫ్లోర్ లకు మెట్లమీద చెంగు చెంగున ఎగిరి దూకుతు న్నాడు. వెనక మా చిల్లర గుంపు. ఒక్కో మెట్టు మీద ఆయన కాలు పడుతుంటే వెనక ఆయన పైజమా పైకి లేచి కాలిపిక్కలు పసుప్పుచ్చుగా బలంగా కనిపించాయి. మాకు ఆయాసాలొచ్చాయి గానీ ఆయన దర్జాగా వెళ్తున్నాడు. పైన మూడో ఫ్లోర్ లో మన చిరంజీవి, బాలకృష్ణలకు వేసే హోర్డింగంతటి కేన్వాసులు, ఫ్రేముల్లేనివి… అవి హుస్సేన్ కంటే రెండింతలు పొడుగున్నాయి. అంత బరువు మోయడం మాలాటి వాళ్ళకి జరిగే పనికాదు. ఆయన మాత్రం చులాగ్గా ఎత్తేసి దాన్ని పేద్ద హాలంతా రోల్ చేసి, ఆ బొమ్మలన్నిటి వివరాలూ చెప్తున్నాడు.
మీ ఇంట్లో చిన్న పిల్లలు రెండుకొండలూ, సూర్యుడూ, చెట్టూ, ఇల్లూ వేసి ఎలా చెప్తారో అచ్చం అట్లాగే. అంతకుముందు రోజే ఆయన బొమ్మలు మొదలెట్టినట్టూ, అది మాకు పిల్లాడిలా చూపిస్తున్నట్టు ఉంది. ఇంత అమాయక వెర్రిబాలుడితో వేగటమెట్లాగా అనిపించింది.ఈతడి స్వీప్ అసాధ్యమనీ అనిపించింది.మామూలుగా పత్రికల వాళ్లూ, ఏ సబ్జెక్ట్ లోనూ ఎలాటి లోతూ లేని విలేకరులు అడిగే స్టాక్ కొశ్చిన్స్ కొన్ని ఉంటాయి. మీరీ వృత్తిలోకెలాగోచ్చారు. మీ విజయ రహస్యమేంటి? యువతరానికి మీరిచ్చే సందేశమేంటి? ఇలాంటివి ఎవరినైనా, ఎప్పుడైనా, ఎన్నైనా అడగొచ్చు. అచ్చం మేం గూడా అంతే మూర్ఖంగా, బోలుగా అడిగాం.
ఆయనన్నాడు :”ఈ ఫీల్డ్ లోకి చాలామంది ఫాన్సీతో వస్తారు. నిజానికి దారి తప్పి వస్తారు. అందులో తొంభై శాతం, గట్టిగా చెప్పాలంటే తొంభై తొమ్మిది శాతం ఆర్టిస్టులు కారు. ఎవరో ఒకరిద్దరో ఇంకా కొద్దిమందో ఆర్టిస్టులు కాగలుగుతారు. మిగతా వాళ్లంతా ఆర్టిస్టులు కారు” అన్నాడు. వీళ్లంతా “రనాఫ్ ది మిల్” అని చెప్పాడు. గుండె గుభిల్లంది. మేం దారితప్పిన గొర్రెలమా? రనాఫ్ ది మిల్ గాళ్ళమా? మమ్మల్ని రక్షించే ఏసుక్రీస్తు ఏడోసారి పునరుత్థానము చెందునా. తెల్వది. గ్రేటెస్ట్ ఎవరో?
ఇరవయ్యేళ్ళ నాటి మాట. న్యూయార్క్ నుంచి ఫ్రాన్సిస్ న్యూటన్ డిసౌజా వచ్చాడు. అప్పటి ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఎడిటర్ ప్రితీష్ నంది ఇంటర్వ్యూ చేశాడు. డిసౌజా అంటే మాటలు కాదు. బోల్డన్ని మాటలు కూడా. హుస్సేన్ లాంటి వాళ్లకంటే చాలా ముందువాడు. ప్రపంచంలో పేరున్న ఆర్టిస్టు. మన గోవా బిడ్డడు. ఎవ్వర్నీ లెక్కచేసే బాపతు కాదు. అనుకుంటే ఎంత మాటైనా అనేస్తాడు. ఎంత గొప్ప ఆర్టిస్టో అంత లోతైన విమర్శకుడు. ఆర్.కె. లక్ష్మణ్ వేసే కాకుల మీద మీ అభిప్రాయం అనడిగితే అవి ఇండియన్ ఆర్ట్ కి దిష్టిబొమ్మలన్నాడు. ఇంకా ఇలాంటి వైల్డ్ కామెంట్స్ అయింతర్వాత: “ఈ భూ పెపంచకంలో ఇప్పుడున్న గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ఎవరనుకుంటున్నారు?” అనడిగితే తడుముకోకుండా “ఇప్పుడెలాగూ పికాసో చచ్చిపోయాడు గనక ప్రపంచంలోకెల్లా గొప్ప ఆర్టిస్టుని నేనే” అన్నాడు. తర్వాత కొంతకాలానికి న్యూయార్క్ లో డిసౌజా చనిపోయాడు. అప్పట్నుంచి హుస్సేన్ సాబే గ్రేటెస్ట్ అని మేము ఫిక్సయిపోయాం.
పనికిమాలిన పక్కచూపు…….మనవాడు, మహానుభావుడు… దేశం గాని దేశంలో పండుటాకులా రాలిపోయాడు. అతను మనకిచ్చిన కళను తలచుకుందాం. ఈ సంపదను దాచుకుందాం. చూసుకుందాం… అనుకోవాల్సిన సమయంలో మన ఛానల్స్, పత్రికల్ని చూస్తే బెంగేస్తుంది. ఆయన మరణం గురించి నాలుగు ముక్కలు రాసీ, చెప్పకముందే మాధురీ దీక్షిత్ పేరూ ‘గజగామిని’ సినిమా ముందుకు తీసుకొచ్చేస్తాయి. అంతలో టబు, అనుష్క శర్మ, అమృతారావ్, విద్యాబాలన్ పేర్లోచ్చేస్తాయి. వాళ్ళతో ఆయన ఉన్న క్లిప్పింగ్స్ బుల్లితెర మీద కదుల్తాయి. లేదా లండన్ క్రిస్టీస్ లో మొన్ననే ఒక సెట్టు ఆయిల్స్ ఫలానా ఇన్ని కోట్లకు పోయిందిట గురూ అని ఒకడు. మరి ఎస్.హెచ్. రజా బొమ్మలెంతకి పలికాయి? ఈ రేటు హుస్సేన్ కంటే ఎక్కువా? త్యాబ్ మెహతా కంటే తక్కువా? అంటాడింకొకడు. చెప్పులెందుకేసుకోడో! ఒకసారి చాలా పెద్ద ఫంక్షన్ లోకి బూట్లు లేవని రానివ్వకపోతే వెనక్కి తిరిగెళ్లాడట తెల్సా అని మరొకడు. ఇరానీ చాయ్ లోకి ఉస్మానియా బిస్కెట్ ముంచితే గానీ గొంతు దిగదటగా అని ఇలా ఎన్నెన్నో.
మాధురీ దీక్షితో మరొకళ్లో గొప్ప నటీమణులు కావచ్చు. నిజం కూడా. చాందినీబార్ సినిమాలో టబు అద్భుతమైన నటన చూసినప్పుడు ఇంత గొప్ప ఆర్టిస్టుని మన సినిమాల్లో బొడ్డు చూపి నడుం ఊగించే ఆడ మాంసంగా చూపిస్తారేమని బాధ ముంచుకొచ్చేస్తుంది.
హుస్సేన్ కళ గురించి తలచుకోవాల్సిన టైమ్ లో .. ఆ పని మానేసి టబును తలచుకోడమంటే ఆవిడ గొప్ప కళకి జరిగిన అన్యాయాన్నే మనం హుస్సేన్ కి చేస్తున్నామని లెక్క. చాలామంది కళాకారులకి ఈ అన్యాయం జరిగింది. పికాసో పెయింటింగ్ లూ, శిల్పాలూ, రాతలూ చూడ్డం, మాట్లాడితే వినడం మానేసి ఆయన పన్నెండు మంది పెళ్లాల్ని మార్చాడని చెప్పుకున్నాం.
అలాంటి హాలీవుడ్ సినిమాలనే చూశాం. విన్సెంట్ వాంగో చెవికోసుకున్నాడనీ, చెయ్యి కాల్చుకున్నాడనీ మాట్లాడుకోడం తప్ప అతని పెన్సిల్ డ్రాయింగ్ లు, పెయింటింగ్ లు చూడ్డానికి టైమెక్కడిది. మహా అయితే మొన్నే యూరప్ లో ‘సన్ ఫ్లవర్స్’ ఇన్ని కోట్లకు వేలంలో పోయిందట. ఇది రికార్డు రేటంట అని చెప్పుకుంటాం. “ఐ పూల్డ్ ఒన్ హండ్రెడ్ మిలియనీర్స్” అని పికాసో ఎప్పుడో చెప్పిన విషయాన్ని మేం తలచుకున్న మర్నాడే శివసేన బాల్ థాకరే ఆ కొటేషన్ నీ జర్నలిస్టులకు గుర్తు చేశాడు. ఏమో హుస్సేన్ కూడా అలా చేశాడేమో మనకేం తెలుసు. మనం ‘ఆర్ట్’ అనే దాన్ని వదిలేసి అడ్డమైన వాటిని పట్టుకువేళ్ళాడ్డం ఇకనైనా మానెయ్యాలి. పనికిమాలిన పక్కచూపుల వల్ల అసలు సంగతి ఆవిరైపోతుంది.
PL. READ IT ALSO ………... హుస్సేన్ సాబ్ మనకిచ్చిందేంటి… మనం చూసేదేంటి?(1)