నా హిమాలయ యాత్రలో జరిగిన ఒక సంఘటన మీతో పంచుకోవాలనుకుంటున్నాను. రిషికేశ్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో కొండకోనల్లో నీలకంఠాలయం వుంటుంది. అక్కడ ఆయన దర్శనం చేసుకున్నాక పార్వతీ మాత మందిరం చూడాలనే కోరికను అణుచుకోవటం కొంచెం కష్టమే. కానీ ఆ మందిరం వరకు వెళ్ళటం ఇంకా కష్టం.కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే మార్గం, లక్ష్యం రెండూ సుస్పష్టమే .
దాదాపు ఐదు కిలోమీటర్లు నడక దారి, కొండలు, లోయలు, ఎగుడు,దిగుడు మార్గంలో ప్రయాణం.ఈ మందిరానికి ఒక ప్రత్యేకత వుంది. పరమశివుడ్ని పెళ్ళాడాలనే కోరికతో పార్వతీ దేవి ఇరవై వేల సంవత్సరాలు తపస్సు చేసిందనీ, దానికి మణికూట పర్వతాన్ని వేదికగా చేసుకుందనీ పురాణాలు చెబుతున్నాయి.
ఆ పర్వతంపైన, పార్వతీ దేవి తపస్సు చేసిన ప్రదేశంలోనే ఈ పార్వతి మాత మందిరం వుంది. అక్కడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోకపోతే రిషికేశ్ యాత్ర అసంపూర్ణం గానే భావించాల్సి వుంటుంది. ఆ ఉద్దేశ్యం తోనే నడక ప్రారంభించాను.ఇదిగో ఇక్కడి నుంచే భైరవుడి పాత్ర మొదలయ్యింది.
నీలకంఠాలయం నుంచి నడక ప్రారంభించగానే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ, ఒక శునక రాజం నా వెనుక నడక ప్రారంభించింది. నేను ఎక్కడ విశ్రమిస్తే, తనూ అక్కడే విశ్రాంతి తీసుకునేది . నేను నడిస్తే తనూ నడవటం, నేను ఆగితే తనూ ఆగటం చేస్తూ వచ్చింది. సహజంగా కుక్కలంటే నాకు భయం, అలాంటిది అది నా వెంట నడుస్తుంటే లోపల కాస్త కంగారుగానే అన్పించింది.
అయితే అది బయట పడనివ్వకుండా గంభీరంగానే ప్రయాణం సాగించాను.దారిలో అక్కడక్కడా చిన్న చిన్న విశ్రాంతి కేంద్రాలు వుంటాయి. అక్కడ ఏళ్ళ తరబడి నివాసం వుండే స్థానిక జనులో, సాధువులో వుంటారు. వాళ్ళు నన్ను చూడగానే నమస్కార్ మహారాజ్ జీ అనటం మొదలెట్టారు. నాకేం అర్ధం కాలేదు.ఎందుకలా అంటున్నారో అడిగేలోగానే వారే చెప్పారు.
భైరవ్ జీ (భైరవుడు) మీతో వున్నారు.మీకు ఎస్కార్ట్ గా, అంగరక్షకుడిగా ఆయన వస్తున్నారు. ఆయన సాధారణ సాధువుల వెంట రారు. మీలో ఏదో శక్తిని గుర్తించారు. అందుకే మీతో వస్తున్నారు. మీకు దర్శనం చేయించి, తిరిగి తీసుకు వచ్చి ఎక్కడ నడక మొదలెట్టారో అక్కడ సురక్షితంగా వదిలేస్తారు అని చెప్పారు.
నాకు కొంచెం తర్కం,హేతువాద ఆలోచనలు కాస్త ఎక్కువే.ఒక జర్నలిస్ట్ గా ఆలోచించటం మొదలెట్టాను.ఊళ్ళ లోనూ, నగరంలోనూ అప్పుడప్పుడూ ఇలా కుక్కలు ఎవరో ఒకరి వెంట వెళ్ళటం చూసాను. ఇదీ అదే బాపతేమో అనుకున్నాను. కానీ, ఇక్కడే నేను పొరపడ్డాను. మూడు నాలుగు విశ్రాంతి కేంద్రాల వద్ద వున్నవాళ్ళు కూడా నా వెనుక వున్న భైరవుడిని చూసి గౌరవించడం, నాకు నమస్కారం పెట్టడం జరిగింది.
వాళ్ళు చెప్పినదాని ప్రకారం అది రోజూ రాదు. ఎప్పుడో వారానికో, పది రోజులకో ఒక సారి వస్తుంది. అలాగని సామాన్య సాధువులతో రాదు. అది వెంట వచ్చిన వాళ్ళంతా మహానుభావులే, శక్తివంతులే అని వాళ్ళు చెప్పారు. గత కొద్ది సంవత్సరాలుగా ఇది ఇలాగే జరుగుతోంది. మేము కళ్ళారా చూశాం… చూస్తున్నాం అని చెప్పారు.
అయినా నా మనసు అంగీకరించలేదు. నేనేమిటో నాకు తెలుసు కదా. కానీ, చిత్రంగా, ఆ భైరవుడు ఒక సుశిక్షితుడైన సైనికుడిలా, అంగరక్షకుడిలా, నాతొ వచ్చి నాకు దర్శనం అయిన తర్వాత, వాళ్ళు చెప్పినట్లుగానే, నడక ప్రారంభించిన చోట నన్ను వదిలి వెళ్ళాడు.
ఇక్కడ మిత్రులకు ఒక మనవి.ఇదంతా మీకు నమ్మాలనిపిస్తే నమ్మండి,లేకపోతె నమ్మకండి. వదిలేయండి.ఇది నా స్వీయ అనుభవం.