Taadi Prakash ……………………………………………….
The one and only trend setter……………………………………….
1984 డిసెంబర్ 29… తెల్లవారేసరికల్లా ఒక మెరుపుదాడిలా వచ్చి పడింది ‘ఉదయం’ దినపత్రిక. ఒక ఫ్రెష్ నెస్, ఒక కొత్తదనం. ఒక వూపు,ఒక వేగంతో వచ్చి జనాన్ని ఆకట్టుకుంది. ఎబికె ఎలా అనుకుంటే అలా – పాశం యాదగిరి ఏంరాస్తే అదీ – పతంజలికి ఏది బాగా అనిపిస్తే అలా – మోహన్ ఏ కార్టూన్ వేస్తే అదీ – విజయవాడ ఎడిషన్ లో నా బుర్రకి ..ఏది బాగుందనిపిస్తే అలా – డెయిలీ సీరియల్ తో ఒక కమర్షియల్ వేషం.
కొత్త శీర్షికలూ, ఇంటర్వ్యూలూ, పెద్దపెద్ద రంగుల బొమ్మలూ, సెలబ్రిటీల పరిచయాలూ, సాహితీవేత్తల జ్ఞాపకాలూ, పతంజలి వేట కథలూ – ఆదివారం అనుబంధం, ఒక విజువల్ బ్యూటీ! ఒక లిటరరీ ట్రీట్! ఎబికె ప్లాన్ చేసిన కొత్త…. ఎడిట్ పేజీ లేఅవుట్ అందరికీ నచ్చింది. హఠాత్తుగా ఓరోజు, ఓ చురుకైన విలేకరి, విప్లవ నాయకుడు కొండపల్లి సీతారామయ్యని రహస్యంగా కలిసి ఇంటర్వ్యూ చేశా అన్నాడు. ‘పట్రా’ అన్నారు ఎబికె.
మర్నాడు ఉదయం మొదటి పేజీలో తూటాల్లాంటి కొండపల్లి మాటలు పేలాయి. నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుని ఇంటర్వ్యూ చేయాలని ప్లాన్ చేశారు. ఏం మాట్లాడాలి? ఎబికె, పతంజలి, భోగాది వెంకటరాయుడు మాట్లాడుకుని ఒక్క రాజకీయ ప్రశ్న కూడా లేకుండా సంభాషణ నడిపించాలని అనుకున్నారు. ఎన్టీఆర్ ని అబిడ్స్ ఇంట్లో కలవగానే అతితెలివి రాయుడు
“ఏం బతుకండీ మీది, ఎంత ఖర్మ పట్టిందీ!” అన్నాడు. ఎన్టీఆర్ యిబ్బందిపడి, “ఏం, నాకేమయిందీ” అన్నారు.
ఈ దరిద్రపు రాజకీయాలూ, పొద్దున లేస్తే మంత్రివర్గ సమావేశాలూ, ఎంపీలూ, ఎమ్మెల్యేలూ! మనవల్ని ఎత్తుకొని, వాళ్లతో ఆడుకుని ఎన్నాళ్ళయిందో కదా! అన్నాడు రాయుడు. ఆర్టిస్టూ, ఆవేశపరుడూ అయిన ఎన్టీఆర్ చలించిపోయారు. “అవును” అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. తర్వాత ఇష్టమైన కూరల నుంచి ప్రతి వ్యక్తిగత ప్రశ్నకి ఎన్టీఆర్ సమాధానాలు చెప్పారు. అదొక Model Interview. రాయుడుగారూ వింటున్నారా? జనం ఆ పెద్ద ఇంటర్వ్యూ ని ఎంజాయ్ చేశారు.
ఓరోజు మహానాయకుడు సుందరయ్య గారు చనిపోయారు. హైదరాబాద్ ‘ఉదయం’లో దేవీప్రియ వచ్చి మోహన్ ముందు కూర్చున్నాడు. రన్నింగ్ కామెంట్రీ రాయాలి. అది పేపర్ మొదటి పేజీలో లెఫ్ట్ సైడ్ న వుండే రెగ్యులర్ పోయెమ్ + ఇలస్ట్రేషన్. నిరంతరం ప్రజల మేలు కోరుకున్న సుందరయ్య
నీలాగా నిప్పులాంటి నేతలు మాకెందరయ్య సోషలిజం ఈ దేశపు బిడ్డల తల నిమిరినపుడు.. ఎర్రని ఆ మబ్బులపై ఎపుడైనా వచ్చిచూడు! అని బ్యూటిఫుల్ గా రాసి పేల్చాడు కవి దేవీప్రియ.
మబ్బుల మీంచి సుందరయ్య వెళుతున్నట్టు మోహన్ బొమ్మ వేశాడు. ఆరోజు, అది చదివి జనం కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలాంటి సరదాలూ, చమత్కారాలూ ‘ఈనాడు’లో ఉండేవి కాదు. ‘ఉదయం’ ఎగిరెగిరి పడుతుంటే ‘ఈనాడు’ flat గా, స్తబ్దుగా వుండేది. ఊరించే కొత్తదనం వార్తలతో కలిసి ప్రవహించే ఒక సృజనాత్మక చైతన్యాన్ని ప్రోత్సహించడమే ఎబికె కంట్రిబ్యూషన్.
ఒకరోజు పొద్దున్నే సుప్రసిద్ధ సంపాదకుడు నార్ల వెంకటేశ్వరరావు చనిపోయారు. ఉదయం’ పెట్టి కొన్ని నెలలు అవుతుందేమో! గూగుల్, ఇంటర్నెట్ లేని రోజులు కదా. నార్ల ఫోటో లేదు. ఎలా? అప్పటికి మా సబ్ ఎడిటర్ అయిన కవి ఖాదర్ మొహియుద్దీన్ కి చెప్పాను. నవోదయకి వెళ్లి నార్ల పుస్తకాలు తెచ్చాడు. నార్ల గురించి కొందరి ప్రముఖుల అభిప్రాయాలు సేకరించుకొచ్చాడు.
నవయుగాల బాట నార్ల మాట కదా. ఆయన రాసిన పుస్తకం కవర్ పేజీపై నార్ల పోర్ట్రెయిట్ ని షార్ప్ గీతల్తో బాపు అద్భుతంగా వేశారు. వివరంగా వార్త రాసి, ఉదయం బేనర్ ఐటమ్ గా దాన్ని spread చేసి నార్ల బొమ్మ పెద్దది పెట్టాను. హెడ్డింగ్ కుదరట్లేదు. అప్పుడు విజయవాడ ‘ఉదయం’లో సబ్ ఎడిటర్ అయిన కే శ్రీనివాస్ (ఇప్పటి ఆంధ్రజ్యోతి ఎడిటర్)ని పిలిచి “మంచి హెడ్డింగ్ ఒకటి పెట్టండి” అని అడిగాను. శ్రీనివాస్ అయిదు నిమిషాలు అటూఇటూ తిరిగి “తెలుగు జర్నలిజం దిక్సూచి నార్ల అస్తమయం” అని రాసిచ్చాడు.
ఆరోజు ‘ఉదయం’ మెయిన్ హెడ్డింగ్ అదే! విశేషం ఏమిటంటే పురాతన తెలుగు జర్నలిజం విధివిధానాల ప్రకారం చావు వార్తలు హైలైట్ చేయడం నిషేధం. గాంధీ, నెహ్రూ స్థాయివాళ్ళు తప్పితే మిగిలిన వాళ్ళు ఎవరు చనిపోయిమా చిన్న ఫోటో, చిన్న వార్త మొదటి పేజీలో వేసి, నివాళి లోపలి పేజీల్లో వేసే దురాచారం వుండింది. మర్నాడు ‘ఉదయం’ ముందు జ్యోతి, ఈనాడు వెలవెలబోయాయి.
1985 జూలై 17. విజయవాడ. ‘ఉదయం’ ఆఫీసు. హైదరాబాద్ నించి వచ్చిన ఎడిటర్ ఎబికె ప్రసాద్ న్యూస్ ఎడిటర్ కె రామచంద్రమూర్తితో, నాతో మాట్లాడుతున్నారు. పక్కనున్న ల్యాండ్ లైన్ ఫోన్ మోగింది. .. మాట్లాడాను. ఏంటీ? అన్నారు ఎబికె. “కారంచేడులో హత్యాకాండ జరిగింది. ఐదుగుర్ని చంపేశారు” అని చెప్పాను. ఎవరూ? అన్నారాయన. “మన కమ్మవాళ్లే” అని చెప్పాను.
“మొత్తం వార్తంతా నాకివ్వు. ఎడిటోరియల్ రాస్తాను” అన్నారాయన ఇన్స్టెంట్ గా. అంత fast గా, quick గా రియాక్ట్ కావడమే ఎబికె ప్రత్యేకత. సాయంత్రానికి వార్త, ఫోటోలు సిద్ధం చేశాం. ఎబికె ఒక చరిత్రాత్మకమైన సంపాదకీయం రెడీ చేశారు. దానికి ‘కారంచేడు కండకావరం’ అని హెడ్డింగ్ పెట్టారు.
ఆ వార్తని ‘ఉదయం’లో ఫ్లాష్ చేశాము. బాధితులు చెప్పిందీ, కత్తి పద్మారావు ఇంటర్వ్యూ, నిరసన, అరెస్టులు, శవాల్ని ఎక్కడికి తీసుకెళుతున్నారు? లాంటి సకల వివరాలతో హోరెత్తించాము. కండకావరం – 1, 2, 3 అని వరసగా మూడు రోజులు, మూడు సంపాదకీయాలు రాశారు ఎబికె. సహజంగానే కారంచేడు హత్యాకాండని తొక్కిపట్టి, అతి చిన్న వార్తలుగా యిచ్చాయి జ్యోతి, ఈనాడు.
ఆ రెండు పెద్ద పేపర్లూ పనిగట్టుకుని ఉపేక్షించినా కారంచేడు దళితుల ఆగ్రహ ప్రదర్శన కొన్ని రోజుల్లోనే మహోద్యమంగా మారింది. ‘ఉదయం’ పేరు మార్మోగిపోయింది.ఎబికె ని ‘ప్రజల మనిషి’ అన్నది అందుకే!
కమ్యూనిస్టు పార్టీ తొలినాటి ఉద్యమ దినపత్రిక ‘విశాలాంధ్ర’లో మొదట చిన్న సబెడిటర్ గా జాయిన్ అయ్యారు ఎబికె. 1964లో పార్టీ చీలింది. 1967లో మార్క్సిస్టు పార్టీని కాదని తీవ్రవాదులనబడే విప్లవకారులు బయటికొచ్చారు. తర్వాత ది గ్రేట్ తరిమెల నాగిరెడ్డి వర్గం ‘జనశక్తి’ అనే వారపత్రికని విజయవాడలో ప్రారంభించింది.
సంపాదక బాధ్యుడు ఎబికె ప్రసాద్. ప్రతివారం జనశక్తి చివరి పేజీలో ‘మలిపుట’ అని ఎబికె రాజకీయ వ్యాఖ్య రాసేవారు. అప్పట్లో అది బాగా పాపులర్ అయింది. ఆనాడు లెఫ్టిస్టులంతా తప్పకుండా చదివే ఆర్కే కరంజియా టాబ్లాయిడ్ పత్రిక BLITZ చివరి పేజీలో కేఏ అబ్బాస్ LAST PAGE అనే కాలం రాసేవారు. బహుశా అదే ఎబికె గారికి ఇన్స్పిరేషన్ కావచ్చు.
ఈ young, dynamic, talented కుర్ర ఎబికె ని కేఎల్ఎన్ ప్రసాద్ గమనించారు. “రావోయ్ ఆంధ్రజ్యోతి”కి అన్నారు. చీఫ్ సబ్ ఎడిటర్ గా జ్యోతిలో గౌరవప్రదమైన ఉద్యోగం పొందారు ఎబికె. ఉత్సాహవంతుడైన ఈ జర్నలిస్టు, ‘మనవాడు’ అని గుర్తించిన రామోజీరావు ‘ఈనాడు’ పెడదాం రమ్మని పిలిచారు…. and the Rest is History!
‘ఉదయం’ ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయింది. 1995లో ఎబికె, వ్యాపారస్తుడు గిరీష్ సంఘీ మాట్లాడుకున్నారు. ‘వార్త’ అనే చక్కటి పేరుతో దినపత్రిక పెట్టాలనుకున్నారు. అణుమాత్రమైనా ఉత్సాహం తగ్గని ఎబికె కత్తిలాంటి కొత్త కుర్రాళ్ళనీ, మెరికల్లాంటి జర్నలిస్టుల్నీ పోగేశారు. 95 చివరిలో రంగరంగ వైభవంగా ‘వార్త’ ప్రారంభం అయింది.
అచ్చు ఉదయంలాగే ముచ్చటైన లేఅవుట్ , ముద్దొచ్చే ఆధునిక డిజైన్తో ‘వార్త’ రావడం రావడమే జనాన్ని వూగించింది. నాటి పత్రికా రంగాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. కే శ్రీనివాస్, సివిఎస్ రమణారావు, వర్థెల్లి మురళి, శివప్రసాద్, సువర్ణ కుమార్, మెరుగుమాల నాంచారయ్య, తుమ్మలపల్లి అనంత్, దేశిరాజు, నామాడి శ్రీధర్… లాంటి ప్రతిభావంతులంతా ఎబికెతో కలిసి ‘వార్త’ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పటి బీబీసీ తెలుగు ఎడిటర్ , సీనియర్ జర్నలిస్ట్ జిఎస్ రామ్మోహన్ రాటుదేలింది ‘వార్త’లోనే!
తెలుగు రాజకీయ వార్తలపై ‘ఈనాడు’ అనే ఒక గండభేరుండ పక్షి పెత్తనాన్ని, మొనోపలీనీ సక్సెస్ ఫుల్ గా బ్break చేయగలిగాయి ‘ఉదయం’, ‘వార్త’. ఆ రెండు పత్రికల విజయం వెనక వున్న ఒక అజేయ శక్తి పేరు ఎబికె ప్రసాద్.
ఏమిటి ఎబికె సూపర్ స్పెషాలిటీ? చదువుకోవడమూ, రాసుకోవడమూ ఎబికె ప్రధాన వ్యాపకం అయినప్పటికీ దినపత్రికల్లో పనిచేయడం వల్ల కోట్లకు పడగలెత్తిన అనేకమంది వ్యాపారులతో భుజం కలిపి నడిచారాయన.
‘జ్యోతి’ కేఎల్ఎన్ ప్రసాద్, ఆయన కుమారుడు జగదీష్ ప్రసాద్, ‘సుప్రభాతం’ రత్తయ్య, ‘ఈనాడు’ రామోజీరావు, దాసరి నారాయణరావు, గిరీష్ సంఘీ, క్రానికల్ వెంకట్రామిరెడ్డి, ‘ప్రభ’ ముత్తా గోపాలకృష్ణ, రామ్ నాథ్ గోయంకా వంటివాళ్ళతో ఆయన కలిసి పనిచేశారు. దేశముదుర్లు అయిన ఈ పెట్టుబడిదారుల పత్రికల్లో ది అల్టిమేట్ రిక్రూటింగ్ అథారిటీ మాత్రం ఎబికె గారే!
అలా కొన్ని వందల మంది, – ఇంకా ఎక్కువేనేమో – యువకులకు ఉద్యోగాలిచ్చి, తర్ఫీదు యిచ్చి జర్నలిస్టులుగా తీర్చిదిద్దిన వాడాయన. ఆరోజుల్లో జీతాలు తక్కువే! అయినా చేతినిండా పనికి కొదవలేదు.ఎబికెతో కలిసి, కమిటెడ్ గా ఒక కసితో పనిచేసిన వాళ్లలో ఎంతోమంది ఎడిటర్లుగా, బ్యూరో చీఫ్ లుగా, సమాచార కమిషనర్లుగా ఉన్నత ప్రభుత్వోద్యోగులుగా స్థిరపడ్డారు. మోహన్ లాంటి ఒక పెద్ద పొలిటికల్ కార్టూనిస్టునీ, మంచి ఆర్టిస్టునీ మనకి యిచ్చినవాడు ఎబికె మాత్రమే!
నేను చాలమంది ఎడిటర్లతో సన్నిహితంగా మెలిగాను. కలిసి పనిచేశాను. నండూరి రామ్మోహనరావు, పురాణం సుబ్రమణ్య శర్మ, తుర్లపాటి కుటుంబరావు, సి రాఘవాచారి, వాసుదేవ దీక్షితులు, పొత్తూరి వెంకటేశ్వరరావు, గార శ్రీరామ్మూర్తి, ఐ వెంకట్రావు, ఆర్వీ రామారావు, రాంభట్ల కృష్ణమూర్తి, గజ్జెల మల్లారెడ్డి, కేఎన్ వై పతంజలి, కె రామచంద్రమూర్తి, సి కనకాంబరరాజు, ఎంవిఆర్ శాస్త్రి నాకు బాగా తెలిసినవాళ్ళు. అలనాటి జి కృష్ణ గారూ, పి. పుల్లయ్య గారు కూడా తెలుసు. వీళ్ళెవరూ కూడా ఎబికె అంత awesome power ని ఎంజాయ్ చేసినవాళ్లు కారు.
వీరిలో ఎవరికి వారు ప్రత్యేకమైన వ్యక్తిత్వం గలవాళ్లే అయినా, ఎబికె లాగా కొన్ని జనరేషన్స్ ని influence చేసినవాళ్లు కారు. చివరగా ఎబికె సాహిత్య సంపాదకీయాల గురించి చెప్పుకోవాలి. త్రిపురనేని శ్రీనివాస్ లాంటి కుర్రకవుల నుంచి పేరుప్రతిష్టలు పొందిన అనేకమంది కవులు, రచయితల పుస్తకాలను పరిచయం చేస్తూ, సమీక్షిస్తూ ఎబికె రాసిన సండే సంపాదకీయాలు చదివి తీరాల్సినవి.
మంచి వాక్యమూ, చదివించే శైలీ, సొగసైన వాక్యవిన్యాసమూ, ప్రవాహం లాంటి నడకా పాఠకుణ్ణి సమ్మోహితుణ్ణి చేస్తాయి. ఆయన literery dexterity ఆశ్చర్యం గొలుపుతుంది.కళలు, రాజకీయాలు, సాహిత్యం, చరిత్ర, అంతర్జాతీయ పరిణామాలు, మహనీయుల జీవిత చరిత్రలూ క్షుణ్ణంగా చదివినవాడు, అధ్యయనం చేసినవాడు ఎబికె ప్రసాద్.
ఇంతకీ ఎబికె ఏమీ సంపాదించుకోలేదా? నాకు తెలిసి పది నుంచి పదిహేను వేల పుస్తకాలు ఆయన సంపాదించుకోగలిగారు. నిరంతర అధ్యయనం, సృజనాత్మక శక్తీ ఆయన్ని ఉత్తమ జర్నలిస్టునీ, గొప్ప సంపాదకుణ్ణీ చేశాయి. ఒక trend setter గా నిలబెట్టాయి.