తండ్రిదో దారి .. తనయుడిదో బాట!!

Sharing is Caring...

The story of three generations …..

ఆ తండ్రి కొడుకుల జీవితాలు అచ్చం సినిమా కథను తలపిస్తాయి. సాధారణంగా సినిమాల్లో ఇలాంటి కథలు ఎక్కువగా ఉంటాయి. తండ్రి  విలన్ … కొడుకు మాత్రం తండ్రి వ్యవహార శైలిని వ్యతిరేకిస్తుంటాడు. తండ్రి చేసే అక్రమాలను ద్వేషిస్తుంటాడు. అవినీతి సంపదను  వాడుకోడు. సామాన్యుడిలా జీవిస్తుంటాడు.  

సరిగ్గా ఇలాంటి సంఘటనలు అండర్ వరల్డ్ డాన్ కి నిజ జీవితంలో ఎదురైనాయి.  పాకిస్తాన్ లో తలదాచుకున్న డాన్ దావూద్ ఇబ్రహీం తనయుడు మోయిన్ నవాజ్ తండ్రి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను చూసి ఛీ పో అన్నాడట. చిన్నప్పటినుంచి తండ్రి వ్యవహారశైలి గమనించిన మోయిన్ నవాజ్ కి దావూద్ అంటే ఏవగింపు కలిగింది.

బెదిరింపులు .. హత్యలు .. స్మగ్లింగ్ … ముఠాలు నిర్వహించడం .. తదితర నేరాలను బాల్యం నుంచే చూసిన నవాజ్ మానవతావాదిగా తండ్రిని వ్యతిరేకించడం సహజమే. చుట్టూ మంది మార్బలం .. కనుసైగ తో బెదిరించి  దేన్నైనా సాధించగల సత్తా … వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి  అధిపతి గా ఉన్న దావూద్ వీటన్నింటిని  తన కుమారుడి కి వారసత్వంగా ఇవ్వాలనుకున్నాడు.

కానీ నవాజ్ ససేమిరా అన్నాడట.  నవాజ్ తన అడుగుజాడల్లో నడవాలని దావూద్ భావిస్తే .. అతగాడు తాత అడుగుజాడల్లో నడుస్తున్నాడు. దావూద్ తండ్రి ఇబ్రహీం కాస్కర్ ముంబాయి లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేసాడు.నిజాయితీ గల వ్యక్తి అని  డిపార్ట్మెంట్ లో అతనికి మంచిపేరుంది. దావూద్ పూర్తిగా డాన్ గా మారకముందే  ఇబ్రహీమ్ కాస్కర్ మరణించారు.

కాగా నవాజ్ కి నిజాయితీ గా ఉండటమంటే ఇష్టమట. ఇస్లాం మత విశ్వాసాలను పూర్తిగా అనుసరిస్తాడట. ఖురాన్ పై మంచి పట్టు సాధించిన నవాజ్ ఒక రోజు సడన్ గా మౌలానా గా మారతానని తండ్రితో చెప్పి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఇంటికి దగ్గర్లో ఉన్న మసీదు లో  కూర్చొని మౌలానాగా సేవలు అందిస్తున్నాడు. మత బోధనలు చేస్తున్నాడు. తనకంటూ ఒక ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించుకుని అందులో ఆనందం వెతుక్కుంటున్నాడు.

ఇక తాను డాన్ అవుతాడని ఆశిస్తే …  కొడుకు మౌలానా గా మారడంతో దావూద్ ఇబ్రహీం మనోవ్యధకు లోనయ్యాడట. వేల కోట్ల సంపద , చీకటి సామ్రాజ్యం ఏమై పోతాయా అని దావూద్ బెంగ పెట్టుకున్నారని ముంబాయి పోలీసుల విచారణలో ఆయన సోదరుడు చెప్పారని కథనాలు ప్రచారం లో ఉన్నాయి.

దావూద్ ఇబ్రహీం కి ముగ్గురు సంతానం. అందులో ఇద్దరు అమ్మాయిలు ..ఒక్కడే కొడుకు. మోయిన్ నవాజ్ లండన్ లో స్థిరపడిన వ్యాపారవేత్త కుమార్తె సానియాను 2011 లో పెళ్లి చేసుకున్నాడు. పెద్ద కూతురు మహరుఖ్ ను   పాక్ క్రికెటర్ జావీద్ మియాందాద్  కుమారుడు జునాయిడ్ మియాందాద్ కిచ్చి 2006 లో పెళ్ళిచేసారు. రెండో అమ్మాయి మెహ్రీన్ ను పాకిస్తాన్ అమెరికన్ అయూబ్ కిచ్చారు. వాళ్లంతా హ్యాపీ గా ఉంటున్నారు.

కొడుకు తన ప్రతిపాదనను తిరస్కరించాక కూడా నవాజ్ మనసు మార్చడానికి దావూద్ పలు ప్రయత్నాలు చేసాడు. భార్య .. బంధువులచేత కూడా చెప్పించాడు. అయినా మోయిన్ నవాజ్ లో ఎలాంటి మార్పు లేదు.చట్ట విరుద్ధ కార్యకలాపాలకు తాను దూరమని మరోమారు స్పష్టం చేసి మసీదు కి దగ్గర్లో ఇల్లు తీసుకుని భార్యా పిల్లలతో కలసి ఉంటున్నాడని సమాచారం.   

తాను నమ్మిన మార్గంలోనే నవాజ్ ప్రయాణిస్తున్నాడు.  కొడుకు  వ్యవహారం తో కొన్నాళ్ళు దావూద్ నలిగి పోయాడు. ప్రపంచంలో చాలామంది వ్యక్తులను శాసించిన దావూద్ కొడుకు ను శాసించలేక పోయాడు.  ఏ తండ్రైనా  తన వారసత్వాన్ని కొడుకు కొనసాగించాలనుకుంటాడు.సినిమా, వ్యాపారం, రాజకీయాలు ఇలా అన్నింటిలో వారసులు వస్తుంటే …. కోట్ల ఆస్తిని కాదని నవాజ్ బిన్నమైన మార్గంలోకి వెళ్లడం నిజంగా గొప్ప విషయమే.  

——  KNMURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!