People were terrified……………………………..
సరిగ్గా పద్నాలుగేళ్ల క్రితం …. నవంబర్ 26, 2008 రాత్రి పది మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు ముంబైలో వివిధ ప్రధాన ప్రదేశాలలో కాల్పులు జరిపారు. బాంబుల వర్షం కురిపించారు. సుమారు 70 గంటల పాటు ఈ మారణ కాండ కొనసాగింది. నాటి దుర్ఘటనలో 166 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మందికి పైగా గాయపడ్డారు. నాలుగు రోజులపాటు ప్రజలు భయంతో వణికిపోయారు.
ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వే స్టేషన్, నారిమన్ హౌస్ బిజినెస్ .. రెసిడెన్షియల్ కాంప్లెక్స్, కామా హాస్పిటల్, లియోపోల్డ్ కేఫ్, ఒబెరాయ్ ట్రైడెంట్ హోటల్, తాజ్ హోటల్ పై ఉగ్రవాదులు బాంబు దాడులు చేశారు. చిత్తమొచ్చిన రీతిలో రెచ్చిపోయారు. ఆర్థిక రాజధాని ముంబాయి ని లష్కరే తోయిబా ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని విధ్వంస కాండ కు దిగారు.
పాకిస్థాన్‌లోని కరాచీ ఓడరేవు నుంచి హైజాక్ చేసిన ఫిషింగ్ ట్రాలర్‌లో ఉగ్రవాదులు రహస్యంగా ముంబై చేరుకున్నారు. నగరంలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు పోలీసు వ్యాన్‌తో సహా కార్లను హైజాక్ చేసి గ్రూపులుగా విడిపోయి దాడులు చేశారు.
మొదటి దాడి జరిగిన ప్రదేశం ఛత్రపతి శివాజీ టెర్మినస్.రాత్రి 9.20 గంటల ప్రాంతంలో ఇక్కడ దాడి జరిగింది. దాదాపు 90 నిమిషాల పాటు ఉన్మాదుల మాదిరి వెంటపడి 58 మంది ని పొట్టన బెట్టుకున్నారు. ఈ దాడుల్లో 100 మందికి పైగా గాయపడ్డారు.
రెండవ దాడి దాదాపు 8-10 నిమిషాల తర్వాత నారిమన్ హౌస్ బిజినెస్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో జరిగింది. దాడికి ముందు ఉగ్రవాదులు గ్యాస్ స్టేషన్‌ను పేల్చివేశారు. రాత్రి 9.40 గంటల సమయంలో నలుగురు ఉగ్రవాదులు లియో పోల్డ్ కేఫ్‌పై దాడి చేశారు. అక్కడ భోజనం చేస్తున్న వారిపై కాల్పులు జరిపి 10 మందిని చంపారు.ఈ దాడి 10 నుండి 15 నిమిషాల వరకు కొనసాగింది.
ఉగ్రవాదులు రెండు ట్యాక్సీలలో బాంబులు అమర్చి మరో ఐదుగురిని బలిగొన్నారు. ఈ ఘటనలో 15 మంది గాయపడ్డారు.తర్వాత తాజ్ మహల్ ప్యాలెస్ .. టవర్ హోటల్‌కు వెళ్లారు. అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్న అతిథులపై దాడి చేశారు. ఆపై బార్లు, రెస్టారెంట్లకు లోకి జొరబడ్డారు.
ఇద్దరు టెర్రరిస్టులు హోటల్‌లోకి ముందు ద్వారం గుండా ప్రవేశించి గ్రెనేడ్‌లు విసిరి .. కాల్పులు జరిపారు.ఈ ముట్టడిలో వారు కనీసం 31 మందిని చంపారు. తాజ్ మహల్ హోటల్ సెంట్రల్ డోమ్ కింద ఉగ్రవాదులు బాంబులు పేల్చారు. దీంతో మంటలు అంటుకున్నాయి. ఈ మంటలు తాజ్ పై అంతస్తులకు పాకాయి.
ఇద్దరు ఉగ్రవాదులు రెస్టారెంటు ద్వారా ఒబెరాయ్-ట్రైడెంట్ హోటల్ లోకి ప్రవేశించారు. హోటల్‌లో ఉన్న జనాలపై కాల్పులు జరిపారు. ఇక్కడ దాదాపు 30 మందిని చంపారు.CST రైల్వే స్టేషన్‌పై దాడి చేసిన తర్వాత, కసబ్, ఇస్మాయిల్ ఖాన్ కామా ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకున్నారు.
వారు ఆసుపత్రి వెనుక గేటు వద్దకు వచ్చారు. అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది అన్ని తలుపులకు తాళం వేశారు. ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రి వెలుపల పోలీసు బృందంపై మెరుపుదాడికి పాల్పడ్డారు, ATS చీఫ్ హేమంత్ కర్కరేతో సహా ఆరుగురిని చంపి, వారి జీపును హైజాక్ చేశారు.కసబ్ ,ఇస్మాయిల్ ఖాన్ గిర్గావ్ చౌపటీ సమీపంలో పోలీసులకు దొరికారు.
అక్కడ పోలీసు కానిస్టేబుల్ తుకారాం ఓంబ్లే వారిని అడ్డుకున్నాడు. అంతలో పోలీసులు అక్కడకు చేరుకొని కాల్పులు జరిపారు.కసబ్ ప్రాణాలతో దొరకగా ఇస్మాయిల్ ఖాన్ మృతి చెందాడు. సాయుధ దళాల నాలుగు రోజుల ఆపరేషన్‌లో తొమ్మిది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక్క మహ్మద్ అజ్మల్ కసబ్ ను మాత్రమే సజీవంగా పట్టుకుని కోర్టులో హాజరు పర్చారు. కోర్టు అతనికి మరణ శిక్ష విధించింది. 2012 నవంబరు నెలలో పూణేలోని ఎరవాడ సెంట్రల్ జైలులో అతగాడికి మరణశిక్ష అమలు చేశారు.
post updated on 27/11/2022