A man who is adored by many…………………
ఇతడు నా వాడు, అతను పరాయివాడు అన్నది అల్ప బుద్ధుల ఆలోచన. వారు, వీరు ..ఈ ప్రపంచమంతా నా కుటుంబమే అనేది విజ్ఞుల దృష్టి. ఈ విజ్ఞులు అందరి క్షేమం కోరుకుంటారు.ఆది శంకరాచార్యులు రెండో కోవకు చెందిన వారు.
ఆయన అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ యావద్భారతాన్ని రెండుసార్లు చుట్టి వచ్చారు. మన సంస్కృతీ సంప్రదాయాల్లో ఉన్నభిన్నత్వాన్ని ఆయన స్వయంగా చూశారు. వాటి మధ్య ఏకత్వాన్ని సాధించాలనుకున్నారు.
భారతదేశంలో తూర్పు దిక్కున పూరీలో గోవర్థన పీఠాన్ని, దక్షిణాన శృంగేరిలో శారదా పీఠాన్ని, పశ్చిమాన ద్వారకలో కాళికా పీఠాన్ని, ఉత్తర దిక్కున బదరిలో శ్రీ పీఠాన్ని స్ధాపించారు. దేశం మొత్తం ఐక్యంగా ఉండాలన్న దూరదృష్టిని, భిన్నత్వంలో ఏకత్వాన్ని ఆయన అప్పుడే విశదీకరించారు.ఈ శంకరమఠాలు అద్వైత వేదాంతాన్ని సంరక్షిస్తూ .. వాటిని ప్రచారం చేయడంలో నిమగ్నమైనాయి.
ఈ మఠాలు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వానికి కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. మత సంప్రదాయాల కొనసాగింపులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. శంకరమఠాలు సామాజిక సంక్షేమ కార్యక్రమాలు, ధార్మిక కార్యకలాపాలలో పాల్గొంటూ, సమాజ శ్రేయస్సుకు దోహదపడుతున్నాయి.
ఆది శంకరులు జగద్గురువు. అంటే ఆయన చేసిన బోధనలన్నీ తత్త్వ సంబంధమైనవే కదా… నేటియువతకు ఉపయోగమేంటి? అనే సందేహం కలగవచ్చు. ఈ సందేహానికి సమాధానం శంకరుని జీవితంలోని సంఘటనలే చెబుతాయి. సనందుడు అనే విద్యార్థి శంకరుల వద్ద చదువుకోడానికి వచ్చాడు. చెప్పింది చెప్పినట్లు చదవడం.. చేయడం వల్ల అతనంటే శంకరులకు ఇష్టం పెరిగింది.
అది మిగిలినవారికి కష్టమనిపించింది. ఆ విషయాన్ని శంకరాచార్యులు గమనించి వాస్తవాన్ని అందరికీ తెలియజెప్పాలనుకున్నారు. ఓ రోజున సనందుడు, ఇతర శిష్యులు నదికి అవతల ఒడ్డున ఉన్నారు. ఇటు వైపు నుంచి వైపు శంకరుడు, సనందుడిని కేకవేసి పిలిచారు. నది దాటడానికి అక్కడ యే సాధనమూ లేదు.
సనందుడు గురువు గారు పిలిచారు కాబట్టి నేను వెళ్లాలి అనే దృఢ సంకల్పంతో నది మీద అడుగులేసుకుంటూ నడుచుకుంటూ వచ్చాడు. సనందుడి సంకల్ప బలంతో అతడి అడుగుల కింద నీటి మీద తేలే పద్మాలు పుట్టుకొచ్చాయి. అప్పటినుంచి అతగాడికి పద్మపాదుడనే పేరు వచ్చింది. ఆ సంఘటన ద్వారా గురువు మాట మీద గురి ఎలా ఉండాలో సనందుడు నిరూపించారు.
ఆది శంకరాచార్యుల వారికి జ్ణాపక శక్తి చాలా ఎక్కువ.కేరళ రాజు రాజశేఖరుడు ఓ మూడు గ్రంధాలు రాసి వాటిని శంకరాచార్యుల వారికి వినిపించాడు. ఆ తర్వాత చాలా కాలానికి మళ్లీ శంకరాచార్యులు వద్దకు వచ్చినపుడు తాను రాసిన మూడు గ్రంధాలు అగ్ని ప్రమాదంలో మసి అయిపోయాయని బాధ పడ్డాడు రాజశేఖరుడు.
అప్పుడు శంకరాచార్యులు వారు ‘నువ్వు నాకు వినిపించిన గ్రంధాలు విన్నది విన్నట్లు మళ్లీ చెబుతాను రాసుకో’ అని మూడు గ్రంధాలను అక్షరం పొల్లుపోకుండా తిరిగి చెప్పాడు. శంకరుల వారి మేథోశక్తికి ఇదో మచ్చుతునక.రాజశేఖరుడు ఆశ్చర్యబోయి ఆయనకు వందనం చేసి వెళ్ళిపోయాడు.
శంకరాచార్యుల వారి జన్మస్థలం ‘కాలడి’ కేరళలో ఉంది … ఆయన తల్లిదండ్రులు ఆర్యాంబ, శివగురువు… గురువు గోవింద భగవత్పాదులు వారు. ఆయన 108 గ్రంథాలు రాశారు. కనకధారా స్తోత్రం, గణేశ పంచరత్న స్తోత్రం, భజగోవిందం, శివానందలహరి, సౌందర్యలహరి, లక్ష్మీనృసింహకరావలంబం శంకర విరచితాలు.