సాహసివిరా! వరపుత్రుడివిరా!!

Sharing is Caring...
Taadi Prakash ……………  

     THE SHOCKING STORY OF JON LEE ANDERSON
———
జాన్ లీ అండర్సన్!అమెరికన్ జర్నలిస్టుల్లో ఆజానుబాహుడు.దేశాలుపట్టి పోతుంటాడు.క్షణం తీరికలేని మనిషి. దేశాధ్యక్షులు,ప్రధాన మంత్రులు,మిలిటరీ కమాండర్లు,ఆత్మాహుతి దళపతులు, డ్రగ్ మాఫియా లీడర్లు,నియంతలు,నరహంతకులతో మాట్లాడుతూనే వుంటాడు. అమెరికన్ సెవెన్ స్టార్ హోటల్లో ఈ రోజొక పెద్దనాయకుడ్ని కలుస్తాడు.
రేపు ఆఫ్ఘనిస్తాన్ కొండగుహల్లో తిరుగుబాటు సేనల అధిపతితో మాట్లాడుతుంటాడు. దూరంగా బాంబులు కురుస్తూనే వుంటాయి. తుపాకీ కాల్పుల మధ్యే రోజులు గడుపుతాడు. యింకో రోజు శాంటియాగోలో నియంత పినోచెట్ ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు.మర్నాడే అమెజాన్ దుర్గమారణ్యాలలో మాఫియా ముఠాలతో మాట్లాడుతుంటాడు. పొరపాటున ఓ పూట ఖాళీ దొరికితే, రివ్వున ఎగిరి ఇంటికెళ్లి, భార్యని, యిద్దరు బిడ్డల్ని పలకరించి వస్తుంటాడు. జాన్ లీ ఆండర్సన్ ప్రతిష్టాత్మకమైన అమెరికా పత్రిక ‘న్యూయార్కర్’ రిపోర్టరు. రచయిత, రాజకీయ వ్యాఖ్యాత, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, వార్ కరస్పాండెంట్.
వార్తలు, వ్యాసాలు, పుస్తకాలు… నిరంతరం రాస్తూనే వుంటాడు. అండర్సన్ వస్తున్నాడంటే దేశాధ్యక్షులు ఎర్రతివాచీ పరిచి ఆహ్వానిస్తారు. ఆ జర్నలిస్టుని కరడుగట్టిన నియంతలు పూలగుత్తులు యిచ్చి పలకరిస్తారు. అండర్సన్లో ఏదో మేజిక్ వుంది. మన పింగళి నాగేంద్రరావుకి గనక ఆండర్సన్ ని పరిచయం చేస్తే, సాహసివిరా, వరపుత్రుడివిరా … శభాష్ అని తప్పక అంటాడు.
…..
అది 2005 వ సంవత్సరం. చలికాలం. మా అన్నయ్య ఆర్టిస్టు మోహన్, నేను మరో యిద్దరు కబుర్లు, జోకుల్తో కాలక్షేపం చేస్తున్నాం. ఫోన్ మోగింది. మోహన్ మాట్లాడాడు. ‘‘పదరా వెళ్దాం’’ అన్నాడు. బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలో కాంగ్రెస్ నాయకుడు కె. కేశవరావు ఇంటికెళ్లాం. ‘‘కూర్చోండి , సార్ వస్తారు’’ అని అటెండర్ చెప్పాడు. నేను కూర్చున్నా. కొన్ని వందల పుస్తకాలు వున్న అల్మరా దగ్గరకెళ్లి మోహన్, జర్నలిస్ట్ కళ్లతో స్కాన్ చేస్తున్నాడు. అయిదారు నిమిషాల తరువాత ఒక పెద్ద పుస్తకం తీశాడు. CHE: JON LEE ANDERSON అని వుంది కవర్ మీద. చేగువేరా జీవితంపై అండర్సన్ రాసిన పుస్తకం తిరగేస్తున్నాం. కంచర్ల కేశవరావు వచ్చారు. 2006 జనవరి 21 నుంచి మూడురోజుల పాటు హైద్రాబాద్ గచ్చిబౌలిలో ఏఐసీసీ సభలు జరుగుతాయనీ, సోనియాగాంధీ సహా కొన్ని వందల మంది నాయకులు వస్తారనీ చెప్పారు. ఆ సందర్భంగా ఒక మంచి సావనీర్ తెస్తున్నామనీ, అందులో వ్యాసాలకు బొమ్మలు, ముఖచిత్రం వేయాలని మోహన్ని అడిగారు. సావనీర్ కమిటీకి చైర్మన్, సంపాదకుడు కేశవరావుగారే. మోహన్ ఓకే అన్నాడు. కాఫీ తాగాక లేస్తుంటే, మోహన్ చేతిలో పుస్తకం చూపించాడు.
తీసుకెళుతున్నావా? అన్నారు. చదివిస్తానన్నాడు మోహన్. ‘‘అదిక్కడ దొరకదు. ఢిల్లీలో కొన్నాను. నాకు తిరిగి యివ్వాలి మళ్లీ’’ అన్నారు. పుస్తకం తీసుకెళ్లేవాళ్లందరూ యేం చెబుతారో మోహనూ అదే చెప్పాడు. మంచి జర్నలిస్ట్, ఇంటలెక్చువల్ అయిన కేశవరావుగారు మోహన్ని మన్నించారు.
………
ఆరోజే ‘చే’ పుస్తకం చదవడం మొదలుపెట్టాడు మోహన్. మిత్రులొస్తే, బొమ్మ వేయాల్సి వస్తే, ఆ బుక్కు నాకు దక్కేది. అలా నెలరోజులకు పైగా చదివాం, యిద్దరం. అది 1200 పేజీల గ్రంథం. విప్లవకారుడు చేగువేరా జీవితమ్మీద సాధికారికమైన, ప్రామాణికమైన Alltime great Biography అది. కళ్లు తడవకుండా, గుండెలు గుబగుబలాడకుండా, ఆశ్చర్యంతో కకావికలు అయిపోకుండా, నెత్తురు సలసల మరిగిపోకుండా ఆ పుస్తకం చదవడం అసాధ్యం. ‘చే’ గురించి మాకు ఎంతో తెలుసు అనుకునే వాళ్లవరైనా, అండర్సన్ పుస్తకం చదివితే, అత్తిపత్తి ఆకుల్లా సిగ్గుతో ముడుచుకుపోతారు.
REAL STORY BEHIND THE BOOK
బ‌హుశా 1991చివ‌రిలో అండ‌ర్స‌న్ క్యూబా హీరో ఫిడేల్ క్యాస్ట్రోకి ఉత్త‌రం రాశారు. చే గురించిన స‌క‌ల స‌మాచార‌మూ, ర‌హ‌స్య‌ప‌త్రాలు, అరుదైన ఫోటోలు నాకు యివ్వ‌గ‌లిగితే స‌మ‌గ్ర జీవిత చ‌రిత్ర రాస్తాన‌ని అన్నాడు. ఎడ్వంచ‌ర్స్‌ని యిష్ట‌ప‌డే క్యాస్ట్రో ఈ గుండెలు తీసే బంటుని వెంట‌నే ర‌మ్మ‌న్నాడు. భార్యాబిడ్డ‌ల‌తో స‌హా రాజ‌ధాని హ‌వానా చేరుకున్నాడు అండ‌ర్స‌న్‌. పిల్ల‌ల్ని స్కూళ్ల‌లో జాయిన్ చేశాడు. క్యూబా నేష‌న‌ల్ ఆర్కైవ్స్‌లో వుండే, క్లాసిఫైడ్ డాక్యుమెంట్ల‌తో స‌హా, మొత్తం స‌మాచారం, ఉత్త‌రాలు, ర‌హ‌స్య సందేశాలు, అప్ప‌టివ‌ర‌కూ ప్రపంచం చూడ‌ని ఫోటోలూ ఆండ‌ర్స‌న్‌కి ఇవ్వ‌మ‌ని ఆదేశించాడు క్యాస్ట్రో. జాన్‌లీ ఆండ‌ర్స‌న్ అనే ప‌రిశోధ‌క రాక్ష‌సుడు అదే రోజు కార్య‌రంగంలోకి దిగాడు. నాటి నుంచి అయిదు సంవ‌త్స‌రాల‌పాటు నాన్‌స్టాప్ రీసెర్చి.
రెప్ప‌వాల్చ‌ని రాత్రులెన్నో…
చేగువేరా తెలిసిన వాళ్ల‌నీ, చేని క‌లిసిన వాళ్ల‌నీ, చేతో బొలీవియ‌న్ జంగిల్స్‌లో తుపాకులు ప‌ట్టుకు తిరిగిన వాళ్ల‌నీ, చివ‌రికి చేని వెంటాడి, బంధించి కాల్చి చంపిన వాళ్ల‌నీ…లాటిన్ అమెరికా అంతా వెతికి..తిరిగి…గాలించి ప‌ట్టుకుని ఆండ‌ర్స‌న్ మాట్లాడాడు. అలా కొన్ని వంద‌ల మందిని క‌లిశాడు. వేల పేజీల స‌మాచారం సేక‌రించాడు. అయిదేళ్ల‌ శ్రమ ఫలితం – CHE: A REVOLUTIONARY LIFE పుస్త‌కం.
1997లో ప‌బ్లిష్ అయిన ఆ పుస్త‌కం చ‌దివి క‌మ్యూనిస్టులూ, యాంటీ క‌మ్యూనిస్టులూ, నాన్ క‌మ్యూనిస్టులూ నిర్ఘాంత‌పోయారు. అన్ని దేశాల్లో బెస్ట్ సెల్ల‌ర్‌గా ల‌క్ష‌లాది ప్ర‌తులు అమ్ముడుపోయింది. చే గురించి అంత విస్తృత‌మైన ప‌రిశోధ‌న‌, స‌మాచారం చ‌దివిన ర‌చ‌యిత‌లూ, జ‌ర్న‌లిస్టులూ విస్తుపోయారు. యావ‌త్ ప్ర‌పంచాన్ని ప్ర‌భావితం చేసిన ఒక విప్ల‌వవీరుడి జీవిత క‌థ యిలా క‌దా రాయాలని విమ‌ర్శ‌కులు మెచ్చుకున్నారు.
`చే`ని ఎక్క‌డ పాతిపెట్టిన‌ట్టు?
ఎర్నెస్టో చేగువేరాని 1967 అక్టోబ‌ర్ 9వ తేదీన బొలీవియా అడ‌వుల్లో La Higvera అనేచోట కాల్చి చంపారు. అమెరిక‌న్ సీ.ఐ.ఏ వ్యూహంతో బొలీవియా సీక్రెట్ ఏజెంట్లూ, సైనికులూ `చే`ని అంతం చేశారు. చంపాం స‌రే, ఇప్పుడేం చేయాలి? అనే పెద్ద ప్ర‌శ్న వాళ్ల బుర్ర‌ల్ని తొలిచేసింది. చ‌రిత్ర ఎన్న‌టికీ మ‌రిచిపోని లాటిన్ అమెరికా లెజెండ‌రీ విప్ల‌వ హీరోని చంపామ‌ని వాళ్ల‌కి తెలుసు. `చే`ని ఎక్క‌డ ఖ‌న‌నం చేసినా…అది, తెల్లారేస‌రిక‌ల్లా ప్ర‌పంచ పుణ్య‌క్షేత్రం అయిపోతుంది. క‌న‌క, ప‌క‌డ్బందీగా ఒక ప్ర‌ణాళిక సిద్ధంచేసి, గొయ్యి తీసిన వాళ్ల‌కీ, పాతిపెట్టిన వాళ్ల‌కి కూడా ఆ ప్ర‌దేశం తెలియ‌కుండా స‌క‌ల జాగ్ర‌త్త‌లూ తీసుకున్నారు.
1967లో `చే`ని హ‌త‌మార్చితే 1997దాకా అంటే
30 సంవ‌త్స‌రాలపాటు చేని ఖ‌న‌నం చేసిన ప్ర‌దేశం ప్ర‌పంచానికి తెలీదు. ఎట్ట‌కేల‌కు ఆ ర‌హ‌స్య‌ప్ర‌దేశాన్ని క‌నిపెట్టిన‌వాడు జాన్‌లీ ఆండ‌ర్స‌న్‌! ప‌రిశోధ‌న‌లో భాగంగా ఒక బొలీవియ‌న్ రిటైర్డ్ ఆర్మీ జ‌న‌ర‌ల్‌ని క‌లిసి మాట్లాడిన‌ప్పుడు ఆండ‌ర్స‌న్ ఆ స‌మాచారం రాబ‌ట్ట‌గలిగాడు. “అదెలా సాధ్య‌మైంది?“ అని ఒక ఇంట‌ర్వ్యూలో ఆండ‌ర్స‌న్‌ని అడిగితే, “ఏమో, నాకేం తెలుసు? “ నా మాట‌ల్లో ఏం ధ్వ‌నించిందో ఆ జ‌న‌ర‌ల్ ర‌హ‌స్య ప్ర‌దేశం ఎక్క‌డో నాకు చెప్పాడు. ఆశ్చ‌ర్యం ఏమిటంటే అక్క‌డ త‌వ్వితే చే అస్తిక‌లు దొరికాయి. వాటిని క్యూబా తీసుకొచ్చి అధికార లాంఛ‌నాల‌తో మిత్రుడు చే అంత్య‌క్రియ‌లు ఘ‌నంగా జ‌రిపించాడు కాస్ట్రో. దాంతో లాటిన్ అమెరికా తిరుగుబాటు వీరులు చే, కాస్ట్రో స‌ర‌స‌న యీ జ‌ర్న‌లిస్ట్ ఆండ‌ర్స‌న్ పేరు చేరిపోయింది.
……….
1957 జ‌న‌వ‌రి 2న కాలిఫోర్నియాలోని లాంగ్‌బీచ్‌లో ఆండ‌ర్సన్ జ‌న్మించాడు. త‌ల్లిదండ్రుల ఉద్యోగాల‌వ‌ల్ల 18 సంవ‌త్స‌రాలు వ‌చ్చేస‌రికి, ఎనిమిది దేశాలు మారాల్సి వ‌చ్చింది. అందుకే “నాకో సొంత వూరంటూ ఏదీ లేదు“ అంటాడు ఆండ‌ర్స‌న్‌. త‌ల్లి ప్రొఫెస‌ర్‌. చిన్ని పిల్ల‌ల క‌థ‌లు బాగా రాసేది. “చ‌ద‌వ‌డం, రాయ‌డం మా అమ్మ‌వ‌ల్లే వ‌చ్చిన‌ట్టున్నాయి“ అంటారాయ‌న‌. న‌న్ను క‌దిలించిన‌దీ, ఒక గొప్ప అనుభ‌వంగా నాలో క‌ల‌కాలం నిలిచి పోయిన‌దీ `చే`ని ఖ‌న‌నం చేసిన ప్ర‌దేశాన్ని క‌నిపెట్ట‌డ‌మే. నేను యుద్ధ‌రంగాల్లో తిరిగినందువ‌ల్లా మిలిట‌రీ అధికారులు, నియంత‌లూ, హృద‌యంలేని రాక్ష‌సులతో క‌లిసి తేలిగ్గా మాట్లాడ‌గ‌లిగినందువ‌ల్ల ఎన్నో ర‌హ‌స్యాలూ, స‌మాచారం నాకు తెలిశాయి అన్నారాయ‌న‌. 1979లో పెరూలోని `లిమా టైమ్స్‌`లో జ‌ర్న‌లిస్ట్ కెరీర్ మొద‌ల‌య్యింది. ప్ర‌త్యేకించి, దిన‌వార‌ప‌త్రిక‌ల్లో ప‌నిచేయ‌డం క‌న్నా, పుస్త‌కాలు రాయ‌డ‌మే ఆండ‌ర్స‌న్‌కి యిష్టం. అయితే ప‌త్రిక‌ల్లో ప‌నిచేయ‌డంవ‌ల్ల విమానా ప్ర‌యాణాలు, హోట‌ళ్ల‌లో వుండ‌డం లాంటి ఖ‌ర్చుల‌న్నీ వాళ్లే భ‌రిస్తారు. ఒక పెద్ద‌ప‌త్రిక జ‌ర్న‌లిస్ట్‌గా రాజ‌కీయ నాయ‌కుల్ని, దేశాధ్య‌క్షుల్ని, ఉన్న‌తాధికారుల‌ను క‌ల‌వ‌డం తేలిక‌వుతుంది.
గుండెల్లో క‌సి, కాళ్ల‌లో చ‌క్రాల్తో పుట్టిన ఈ ఎడ్వంచ‌ర‌స్ జ‌ర్న‌లిస్టు, గ‌త నాలుగు ద‌శాబ్దాలుగా పిచ్చిప‌ట్టిన‌ట్టుగా ప్ర‌పంచ‌మంతా తిరుగుతున్నాడు. చిలీ న‌ర‌హంత‌క నియంత అగ‌స్టో పినోఛెట్‌, క్యూబా నేత ఫిడెల్ కాస్ట్రో, వెనిజులా యోధుడు హ్యూగో చావెజ్‌ల జీవిత క‌థ‌లు రాశాడు. గొడ‌వ‌లు, ఘ‌ర్ష‌ణ‌లు, హ‌త్య‌లు, ర‌క్త‌పాతం, యుద్ధాలు జ‌రిగే అన్ని చోట్లా ఆండ‌ర్స‌న్ వుంటాడు. క‌లంతోనూ, క‌త్తితోనూ, క‌ల‌ష్నికోవ్‌తోనూ, చ‌రిత్ర‌నెత్తుటి పాద‌ముద్ర‌ల్ని గాయ‌ప‌డిన అక్ష‌రాలుగా మారుస్తాడు. ఆ వాక్యాల్లో నిష్పాక్షిక‌త‌..ఆ అక్ష‌రాల్లో మెరిసే నిజాయితీ, సామాన్యజ‌న‌జీవ‌న వేద‌న‌ల క‌న్నీటి త‌డి మ‌న‌ల్ని కుదిపేస్తాయి. క్యూబా, నిక‌రాగ్వా, చిలీ, ఆఫ్ఘ‌నిస్తాన్‌, సిరియా, ఇరాక్‌, లెబ‌నాన్‌, లిబియా, అంగోలా, సోమాలియా, సూడాన్‌, మాలి, హైతీ, ఎల్ సాల్వ‌డార్‌… యీ జాబితాకి అంతే వుండ‌దు.
ఈ దేశాల రాజ‌కీయ సంక్షోభాలు, నేరాలు, ఘ‌ర్ష‌ణ‌లు, ప్ర‌భుత్వ ప‌త‌నాలు, పరిణామాల‌పై పుస్త‌కాలు రాశాడు. యింకా యిప్ప‌టికీ రాస్తూనే వున్నాడు. కాకులు దూర‌ని అమెజాన్ అడ‌వుల్లోకి హెలికాప్ట‌ర్‌లో వెళిపోతాడు. దేశాధ్య‌క్షుల్నీ, ప్ర‌ధాన‌మంత్రుల్నీ, సుప్రీంకోర్టు జ‌డ్జీల‌నీ, హోం మంత్రుల్నీ, అల‌వోక‌గా తుపాకుల్తోనో, బాంబులు విసిరో చంపి పారేసే క్రూర‌మైన డ్ర‌గ్ మాఫియా డాన్‌ల‌ని క‌లుస్తాడు. తిరిగి వ‌చ్చి అదంతా రాస్తాడు.
అన్ని జాగ్ర‌త్త‌లూ తీసుకునే వెళ‌తాడు ఆండ‌ర్స‌న్‌. అయినా ఎప్పుడూ చావుకి జానెడు దూరందాకా వెళ్లి వ‌స్తూనే వుంటాడు. బాంబులు కురుస్తున్న బాగ్దాద్ యుద్ధ‌రంగంలో తిరిగాడు. కొండ‌గుహ‌ల్లో తాలిబాన్ల‌తో కబుర్లుకొట్టి మేక‌కాళ్ల పాయా తాగాడు. ప‌చ్చినెత్తురుతాగే మెక్సికన్ క్రిమిన‌ల్ గ్యాంగ్ బాస్‌తో మాట్లాడాడు. ప్ర‌మాదం అంచుమీద నించొని పుస్త‌కాలు రాయ‌డాన్ని జ‌ర్న‌లిజ‌మే అంటారా?
………….
మార్క్‌వెజ్ తో స్నేహం!
నోబెల్ బ‌హుమ‌తి పొందిన ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత కొలంబియా ర‌చ‌యిత గాబ్రియేల్ గార్షియా మార్క్‌వెజ్‌ని ఆండ‌ర్స‌న్ క‌లిశాడు. మార్క్‌వెజ్ ర‌చ‌న‌ల్లోని మేజిక‌ల్ రియ‌లిజం సాహిత్య ప్ర‌పంచాన్ని ఒక కుదుపు కుదిపింది. మార్క్‌వెజ్ కూడా జ‌ర్న‌లిస్టే. మార్క్‌వెజ్ లాంటి ఒక అంత‌ర్జాతీయ ర‌చ‌యిత‌ని ఏడు నెల‌ల‌పాటు ఎప్పుడుబ‌డితే అప్పుడు క‌లిసి మాట్లాడే అవ‌కాశం చేజిక్కించుకున్నాడు ఆండ‌ర్స‌న్‌.! ఆయ‌నొక మ‌హోన్న‌త మాన‌వుడు. నాది ఒక అసాధార‌ణ‌మైన అనుభ‌వం. అవి నా జీవితాన్ని మార్చిన రోజులు. మార్క్‌వెజ్ చనిపోయాక‌, కొలంబియాలోని మార్క్‌వెజ్ ఫౌండేష‌న్‌లో అధ్యాప‌కుడిగా వున్నాను. మార్క్‌వెజ్ వార‌స‌త్వంలో భాగ‌స్వామిని కావ‌డం నాకెంతో సంతృప్తిని యిస్తోంది అంటారు ఆండ‌ర్స‌న్‌. మార్కెవెజ్‌పై కూడా ఒక పుస్త‌కం రాశారు.
………
సాహ‌స‌మే జీవితంగా బ‌త‌క‌డం నాకు యిష్టం. అలా బ‌తికే వాళ్ల‌ని ప్రేమిస్తాను. బ‌తుకంతా టేబుళ్ల ముందు క‌ర్చీల్లో కూర్చొని రాసే ర‌చ‌యిత‌ల‌ని నేను భ‌రించ‌లేను. వాళ్ల‌ని చూసి త‌ట్టుకోలేను. నేను ఎలా వుండాల‌నుకుంటునానో .. అలా వుండ‌డాన్నే యిష్ట‌ప‌డ‌తాను. I wanted to see the wild world. I wanted to live the history of my time. అని మ‌న క‌ళ్ల‌ల్లోకి చూస్తూ చెబుతాడు ఆండ‌ర్స‌న్‌. “I became a journalist because I wanted to see the world my self. I wanted to get my fingernails dirty”

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!