This is the meaning of that proverb………..
“రామాయణంలో పిడకల వేట”- అనే సామెత నా చిన్నతనంలో తరచూ వినిపించేది. పిడకల వేట అనగానే పిడకలను వెతికి తెచ్చుకోవడం అనే అర్థం వస్తుంది. నిజానికి పిడకలు అలా వెతికి తెచ్చుకునేవి కావు. ఈ మాటని అర్థం చేసుకోవడానికి ఒకప్పటి గ్రామీణ ప్రాంతాల నేపథ్యం తెలియాలి.
వందేళ్ల క్రితం ముఖ్యంగా గ్రామాల్లో వంట చేసుకోవడానికి, స్నానానికి వేడి నీళ్లు కాచుకోవడం కోసం ప్రతి ఇంట్లో కట్టెలని వాడేవారు. కట్టెల పొయ్యి వెలిగించాలి అంటే పిడకలను ఖచ్చితంగా వాడాలి. పిడకలు ఆవు లేదా బర్రె పేడను ధాన్యం పొట్టు లేదా కట్టెలు కాల్చగా వచ్చిన బొగ్గు ముక్కల పొడితో కలిపి ఉండలు చేసి తమ దొడ్డిలో గోడకు కొట్టేవారు.
అవి గోడమీదనే బాగా ఎండి పిడకలు గా తయారయ్యేవి. అవి ఇంట్లో లేకపోతే కట్టెలపొయ్యి వెలగదు, రోజు నడవదు. అందువల్ల ఎవరికివారు అవసరానికి సరిపడా పిడకలు ఉంచుకునే వారు. అయితే పాడి ఆవులు లేదా బర్రెలు కేవలం కొంత మందికి మాత్రమే ఉండేవి. కాని పిడకలు అందరికీ అవసరం. మరి ఎలా? ఇక్కడ మొదలవుతుంది పిడకలకోసం పేడకళ్ల లేదా పేడ కడుల వేట.
ఆవులను, బర్రెలను జీతం మీద పనిచేసే కాపరులు ప్రతి ఇంటినుంచి తోలుకొని ఊరు చివర మేపుకొని సాయంత్రానికి గ్రామంలోకి తోలేవారు. అవి వాటంతట అవే తమ యజమాని ఇంటికి చేరుకునేవి. అలా మేత మేసి వస్తూ దారి పొడవున పేడ వేస్తూ వెళ్లేవి. నేలమీద అలా పడిన పేడని ‘పేడకడి’ అంటారు. బహువచనం ‘పేడ కడులు’ లేదా ‘పేడకళ్ళు’.
అలా పశువులు వేసిన పేడ కడులను కొంత మంది వెతికి ఇంటికి తెచ్చుకుని పిడకలు చేసుకునేవారు. ఆ రోజుల్లో గ్రామాల్లో ఇంటి ముందు పేడ నీళ్ళతో కళ్ళాపి చల్లడం, పేడతో ఇల్లు అలకడం ప్రతి ఇంట్లో నిత్యావసరాలు. అందువల్ల ఇంట్లో పశువులు లేని వాళ్ళు పశువులు వచ్చే దారిలో పేడకళ్ళను (పేడ కడులను) వెతికి తెచ్చుకోవటానికి వెళ్ళే వారు.
ఇక సామెతలోకి వద్దాం. గ్రామలలో ఆ రోజుల్లో ఆరుబయట గుడి ప్రాంగణంలో పండుగ దినాల్లో సాయంత్రం పురాణ కాలక్షేపాలు జరిగేవి. ఒక రోజు ఓ పండితుడు గుడిలో సాయంత్రం రామాయణం మీద అద్భుతమైన ప్రవచనం చెబుతున్నాడు. అక్కడ చాలా మంది భక్తులు చేరి ఉత్సాహంగా వింటున్నారు.
ఇంతలో దూరంగా బర్రెలు గుంపులు గుంపులుగా ఇళ్ళకు వెళుతున్నాయి. అది చూసి వారిలో పిడకల అవసరం ఉన్న కొందరు పేడకడులు ఏరుకోవడం కోసం మధ్యలో లేచి వెళ్లి పోతున్నారు. దానివల్ల ప్రసంగానికి ఆటంకం కలగటంతో పండితుడికి నిరుత్సాహం కలిగింది.
అలా వెళుతున్న వారిని చూసి, “ పుణ్య ప్రదమైన రామాయణం వింటూ మధ్యలో ఈ పేడకళ్ళ వేట ఏమిటి?” అని వాపోయాడు.అలా ఆ ’పేడకళ్ళ వేట’ కాస్త కాల క్రమంలో జనాల నోట ‘రామాయణంలో పిడకల వేట’ గా మారిపోయింది..
…..శ్రీధర్ గారి సౌజన్యంతో


