రాజకీయాలపై ‘ చిరు ‘ ఏమన్నారంటే ?

Sharing is Caring...

మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లో కొస్తారా ? జన సేన పార్టీ లో చేరతారా ? ఊహాజనితమైన  … సందేహాలతో కూడిన ప్రశ్నలివి. జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ కొత్త చర్చకు తెరతీశాయి. పవన్ కళ్యాణ్ కు తోడుగా చిరంజీవి వస్తారని నాదెండ్ల చెప్పడం తో ఈ ఊహాగానాలు మొదలైనాయి.

తోడుగా రావటం అంటే పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇవ్వటం వంటిదే అనుకోవాలి. ఇదివరలో  ప్రజారాజ్యాం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి రాజ్యసభ సభ్యత్వం స్వీకరించి .. కేంద్ర మంత్రి పదవి చేపట్టిన చిరంజీవి ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. సినిమాలు చేసుకుంటున్నారు.

రాజకీయాలకు దూరమైన తర్వాత కూడా పలు సందర్భాల్లో చిరు ఇక రాజకీయాల్లోకి రానని చెప్పారు. అయినా  కొందరు అభిమానులకు ఎక్కడో ఏదో ఆశ. చిరు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాడని .. ఏదో చేస్తాడని. ఆ ఆశాభావాన్ని పెంచేలా నాదెండ్ల మాట్లాడారు. కొందరికైతే  చిరు రాజకీయ పున ప్రవేశంపై ఇంకా సందేహాలున్నాయి.

ఈ సందేహాలను నివృత్తి చేస్తూ చిరు కొద్దిరోజుల క్రితమే ఒక ప్రకటన చేసారు. ఇకపై తాను కేవలం మెగాస్టార్ మాత్రమే అని.. తిరిగి రాజకీయాల్లోకి రావడం తనకు ఇష్టం లేదని తేల్చి చెప్పేసారు.  మొన్నటి డిసెంబర్ నెలలో హీరోయిన్ సమంత నిర్వహిస్తోన్న సామ్ జామ్  షోకు వచ్చిన చిరంజీవి అక్కడ రాజకీయాలపై తన మనసులో మాట చెప్పేసారు.కానీ కొందరు మాత్రం  చిరంజీవిని మళ్లీ రాజకీయాల్లోకి  తీసుకురావాలని చూస్తున్నారు.

ఆ మధ్య ఓ జాతీయ పార్టీ చిరంజీవి కోసం ప్రయత్నించిందని.. రాజ్యసభ సీట్ ఆఫర్ చేసిందనే వార్తలు ప్రచారంలో కొచ్చాయి. మరోవైపు ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేనతో కలిసి చిరు పని చేస్తారనే వార్తలు ఎన్నో సార్లు వచ్చాయి. అందువల్ల అభిమానులు కూడా కొంత గందరగోళంలో ఉన్నారు.

కరెక్టుగా  నెలరోజుల క్రితమే  తనకు ప్రస్తుతం సినిమాలు తప్ప మరో లోకం లేదని చిరు స్పష్టం చేశారు. తమ్ముడు జనసేన పార్టీతో కలిసే ఆలోచనలు కూడా లేవని తేల్చిచెప్పారు.  రాజకీయాల్లో ఉన్న 10 సంవత్సరాలలో చాలా విషయాలు తెలుసుకున్నానని.. పాలిటిక్స్‌ తనకు సరిపడవని అర్థమైపోయిందని చెప్పారు మెగాస్టార్.

నటుడిగా చాలా సంతోషంగా ఉన్నానని చెప్పిన చిరు.. ఇకపై రాజకీయాల జోలికి పోనని కన్ఫర్మ్ చేసారు.  మరో జన్మంటూ ఉంటే అప్పుడు కూడా నటుడిగానే పుట్టాలని ఉందని చెప్పుకొచ్చారు. ఇన్ని చెప్పిన చిరు మనసు మార్చుకుని రాజకీయాల్లోకి వస్తారా అనేది నూరు శాతం సందేహమే. చిరు సన్నిహిత వర్గాల ద్వారా ‘తర్జని’ కి అందిన సమాచారం ఏమిటంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తి లేదని. చూద్దాం ఏమి జరుగుతుందో ? 

————- KNM 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!