అమ్మా!  నాన్నఏడీ ?

Sharing is Caring...

Kontikarla Ramana…………………………………అమ్మా!  నాన్నఏడీ ?

నాన్న చాలాదూరంలో.. దేశ సేవలో ఉన్నాడు తల్లీ ..  తొందరలోనే వస్తాడు.. ఇదీ ఆ అమ్మ జవాబు. ఏళ్ళు గడిచిపోతున్నాయి.. బిడ్డలు రోజు అడుగుతున్నారు. తల్లి అదే సమాధానం చెబుతోంది. 
ఒక రోజు ఆ తండ్రి రానే వచ్చాడు!

అదీ 38 ఏళ్ల తర్వాత.  కానీ సజీవంగా కాదు.. నిర్జీవంగా.. ఓ విగత జీవిగా.  తండ్రి వస్తాడని ఇద్దరు బిడ్డలు.. భర్త వస్తాడన్న ఆ భార్య నిరీక్షణలో  కన్న కలలు ఆవిరైపోయాయి . వచ్చిన ఆ వీర సైనికుడి మృతదేహం ఆ కుటుంబాన్ని నిర్ఘాంతపర్చింది.. నిశ్ఛేష్ఠుల్ని చేసింది.ఆ మృతదేహం ఎవరిదో కాదు  చంద్రశేఖర్ హర్బోలా ది. 

అత్యంత కఠినమైన సియాచిన్ మంచు పర్వతంపై  శత్రుదేశాలతో యుద్ధం కంటే…  అక్కడి మంచుతో కప్పబడే ఆ వాతావరణమే అక్కడి సైనికుల ప్రధాన శత్రువు.  1984లో అప్పటి పాకిస్థాన్ కుట్రలను చేధించే క్రమంలో చేపట్టిన ఆపరేషన్ మేఘదూత్ తర్వాత.. ఏర్పడిన  పరిస్థితుల కారణంగా  అటు పాకిస్థాన్ ఇటు భారత్ కానీ.. ఇరు దేశాలు సియాచిన్ ప్రాంతంలో తమ క్యాంపులను ఎత్తేయలేక పోయాయి.

అక్కడ సైనికుల మోహరింపు అనివార్యమైంది. అలాంటి పరిస్థితుల్లోనే అక్కడి  హిమాపాతంలో చంద్రశేఖర్ హర్బోలాతో పాటు.. మరో 19 మంది ఆ మంచుకొండల్లో కనిపించకుండా పోయారు. 15 మంది మృతదేహాలైతే దొరికాయి కానీ.. హర్బోలాతో పాటు.. మరో నలుగురి ఆచూకీ లేదు. 

సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత…  పెద్ద కూతురికి 46 ఏళ్ళు.. చిన్న బిడ్డకు 42 ఏళ్ల వయస్సు వచ్చాకగానీ.. చంద్ర శేఖర్  విగతజీవిగా  లభ్యమవ్వడం.. ఆ కుటుంబాన్నే కాదు.. యావత్ దేశాన్నీ కలవరపరిచింది.

హర్బోలా తిరిగి వస్తాడని… పాక్ సైన్యం అతణ్ని బంధించి ఉండొచ్చునని… ఎప్పటికైనా  భర్తను చూస్తానన్న ఒకింత భరోసా.. భార్య శాంతీదేవిలో కనిపించేది. కానీ సజీవంగా వస్తాడని ఎదురుచూసిన భర్త నిర్జీవంగా రావడం … తమ కళ్లముందే అంత్యక్రియలు జరగడంతో ఆ కుటుంబం లో విషాదం నెలకొంది. 

ఎప్పటికైనా తన భర్త వస్తాడన్న ఆశ, ఇంకోవైపు తన ఇద్దరు బిడ్డలను ఉన్నంతలో  బాగా చదివించి ప్రయోజకులు చేయాలన్న తపన ఈ రెండే శాంతీదేవీలో కనిపించేవి. భర్త హర్బోలా మిస్సింగ్ తర్వాత ఆర్మీ సహకారంతో ఆమె నర్సింగ్ కోర్సును పూర్తి చేసి స్థానికంగా భాగేశ్వర్ జిల్లాలోని ప్రభుత్వాసుపత్రిలో నర్సుగా పనిచేస్తూ.. తన ఇద్దరు ఆడపిల్లలను సాకిందే తప్ప.. ఆమె మళ్లీ పెళ్లి చేసుకోవాలన్న యోచన చేయలేదు. ఎందుకంటే భర్త తిరిగివస్తాడన్న ఆశతో. 

పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో కొద్ది రోజుల క్రితం ఆర్మీకి అనుమానం వచ్చి దగ్గరికెళ్లడంతో.. చంద్రశేఖర్ హర్బోలా మృతదేహం కనిపించింది. ఐడీ నంబర్ సాయంతో చెడిపోయిన బాడీ ని  గుర్తుపట్టగల్గారు. దేశానికి స్వాతంత్య్రం  వచ్చి 75 ఏళ్లవుతున్న ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు జరుపుకునే రెండురోజుల ముందు.. హర్బోలా మరణవార్త శాంతీదేవి కుటుంబాన్నీ, యావత్ భరతజాతినీ కుదిపేసింది.

మనం పల్లెల్లో, పట్టణాల్లో, మన ఇళ్లల్లో గుండెలపై  చేయి వేసుకుని హాయిగా నిద్రపోతున్నామంటే హర్బోలా వంటి వీర సైనికులు హిమాపాతాలను, మంచుతుఫాన్లను కూడా లెక్క చేయకుండా అందిస్తున్న కాపలా సేవలకు  దర్పణం పట్టే ఘటన ఇది!  హర్బోలా కుటుంబం మాదిరిగా ఎదురుచూస్తున్న నాల్గు కుటుంబాల కథ కూడా ఇలాంటిదే. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!