ఆయన లెక్కలు వేరు కదా !!

Sharing is Caring...

Steps to suit people’s tastes……………….

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు సంఘ సేవకులా ? కాదు. ఆయనెప్పుడూ అలా చెప్పుకోలేదు. అయితే కొన్ని విరాళాలు కలెక్ట్ చేసి ఆయన కొంత వేసి తుఫాన్ బాధితులకు ఇళ్ళు కట్టించారు. అలాగే కొన్ని సందర్భాల్లో విరాళాలు కూడా ప్రకటించారు. అందుకు ఆయనను అభినందించాల్సిందే.

అంతవరకే ఆయన సంఘ సేవ. చాలాకాలం నుంచి తీసుకొస్తున్న పత్రికలను కొన్నాళ్ల క్రితం  ఫౌండేషన్ పరిధిలోకి మార్చారు. డిజిటల్ పత్రికలుగా కొన్నాళ్ళు తీసుకొచ్చారు. అదికూడా భారం కావడంతో .. వాటి వల్ల నష్టాలు వస్తాయని భావించి మూసి వేశారు. ఫౌండేషన్ పెట్టారు కాబట్టి నష్టాలు వస్తున్నా.. సాహిత్య సేవ చేయమనడం సరైనది కాదేమో.

చతుర, విపుల, తెలుగు వెలుగు, బాలభారతం పత్రికలను మూసేసిన సందర్భంగా  సోషల్ మీడియా లో రామోజీ నిర్ణయంపై పెద్ద ఎత్తునే చర్చలు జరిగాయి. పలువురు పలు సలహాలు ఇచ్చారు. రామోజీ ఓ పక్కా వ్యాపారవేత్త. మార్కెట్ లో దేనికో డిమాండ్ ఉంటుందో ? ఏ అంశానికి గ్యాప్ ఉందో సర్వే చేయించుకుని … పలు కసరత్తులు చేసి ఆ ప్రోడక్ట్ను బయటికి తీసుకొస్తారు.

అందులో సందేహం లేదు. ఒక ఫీచర్ పెట్టే ముందు కూడా వాటి మంచి చెడులూ చర్చించిన ఉదాహరణలున్నాయి. ఉదాహరణకు ఈనాడు లో చాలాకాలం ” వారఫలాలు” ఇవ్వలేదు. మిగతా పత్రికల్లో దినఫలాలు, వారఫలాలు ఇచ్చేవారు. చాలామంది ఈ విషయం రామోజీ కి చెప్పినా ఆయన పెద్దగా పట్టించుకోలేదు.

మార్కెట్ సిబ్బంది ఎక్కడికి వెళ్లినా వార ఫలాలు ఎందుకివ్వరు అని అడిగే వారు. మార్కెటింగ్ సేల్స్ సిబ్బంది ఈ అంశాన్ని మిడిల్ మేనేజిమెంట్ దృష్టికి తీసుకెళ్లారు. మార్కెటింగ్ మేనేజర్లు వీక్లి మీటింగ్ లోవారఫలాలు కావాల్సిందే అన్నరీడర్స్ డిమాండ్ ను, ఫీడ్ బ్యాక్ ను రామోజీ ముందు పెట్టారు.

అప్పుడాయన కన్విన్స్ అయి “వారఫలాలు” శీర్షికను ప్రారంభించారు. అలా ఒక చిన్న ఫీచర్ /శిర్షిక పెట్టడానికి అంత ఫీడ్ బ్యాక్ తీసుకున్న రామోజీ ఇరవై ఏళ్ళక్రితం “న్యూస్ టైం” ఆంగ్ల దినపత్రిక పాఠకుల అంచనాను అందుకోలేక పోవడంతో మూసేసారు.ఒక దశలో ప్రియా పచ్చళ్ల  వ్యాపారం కూడా నష్టాల్లో నడిచింది. అపుడే ఎగుమతులు మొదలు పెట్టారు.

ఆ ఐడియా కలిసొచ్చింది. సోమా డ్రింక్ ను మార్కెట్లోకి తీసుకొచ్చినప్పటికీ  వినియోగదారుల ఆదరణ పొందలేకపోయింది. ప్రజలకు బాటిల్ పానీయాలు అలవాటు లేని సమయంలో రామోజీ ఉత్పత్తిని ప్రారంభించాడు. ప్రజలు ఆ బ్రాండ్‌ను అంగీకరించక పోవడంతో ఆ వ్యాపారాన్ని క్లోజ్ చేశారు.

అలాగే సినిమా నిర్మాణాన్నికూడా కొంత కాలం నుంచి రామోజీ పక్కన బెట్టారు. మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ కూడా క్లోజ్ అయినట్టే. ఇక పత్రికల విషయానికొస్తే 2017 లోనే వాటిని మూసివేయాలనే నిర్ణయం తీసుకున్నారు. న్యూస్ ప్రింట్ వ్యయం పెరగడం, యాడ్స్ లేకపోవడంతో నష్టాలు మొదలైనాయి. అయితే కొంత వ్యయం తగ్గించుకుని వాటిని డిజిటల్ వెర్షన్‌లకు మాత్రమే పరిమితం చేశారు.

సాధారణంగా, ఏదైనా వెంచర్ ప్రారంభించిన తర్వాత దాన్ని మూసివేయడం రామోజీ కి అలవాటు లేదు. తక్షణ విజయాన్ని రామోజీ విశ్వసించరు. కానీ కొంత కాలం చూసి నిర్ణయం తీసుకుంటారు.  ప్రజల మారుతున్న అభిరుచులకు అనుగుణంగా రామోజీ తనను తాను ట్యూన్ చేసుకుంటాడు. ప్రజలు ఒక నిర్దిష్ట ఉత్పత్తిని అంగీకరించరని భావిస్తే మూసివేయడానికి వెనుకాడరు.

అదలా ఉంటే సుదీర్ఘ కాలంపాటు సాహిత్య ప్రయోజనానికి కట్టుబడి తెలుగు భాషకు, తెలుగు సాహిత్యానికి నిరుపమాన సేవలు అందించిన విపుల- చతుర మాస పత్రికలను కూడా మూసి వేశారు. అలాగే తెలుగు భాషోద్ధరణ సంకల్పంతో పురుడుపోసుకున్న ‘తెలుగువెలుగు’, ప్రత్యేకించి బాలలకోసమే పుట్టిన ‘బాలభారతం’ పత్రిక కూడా మూత పడింది. ఈ నాలుగు పత్రికల్ని మూసివేస్తున్నట్టుగా.. వీటిని ప్రచురిస్తున్న రామోజీ ఫౌండేషన్ తరఫున  మేనేజింగ్ ట్రస్టీ అధికారికంగా ప్రకటించింది.

కరోనానంతర పరిస్థితులు , మీడియాలో వచ్చిన కుదుపులు.. ఈ పత్రికల ఉసురు తీసింది. కరోనా సంక్షోభం మీడియా మీద తీవ్రమైన ప్రభావం చూపిన క్రమంలో ఈనాడు దినపత్రికలో కూడా అనేక మార్పు చేర్పులు, ప్రతిష్టంభనలు ఏర్పడ్డాయి. ఎన్నడూ లేనిది- సిబ్బందికి లేఆఫ్‌లు ప్రకటించారు. వేలమంది సిబ్బంది.. నెలలో సగం రోజులూ పనీ లేక.. వేతనమూ లేక అలమటించిపోయారు.

ఈనాడు సర్కులేషన్ కూడా దారుణంగా పడిపోయింది. ఈనాడు కు కూడా అంత సంక్షోభం ఉందా? ఇప్పటివరకు అప్రతిహత జైత్రయాత్రను కొనసాగించిన ఈనాడు కూడా కరోనా దెబ్బకు చిగురుటాకులా వణికిపోయిందా..? గ్రూపు పత్రికలను మూతపెట్టుకునే దశకు వచ్చిందా..? అని ఎవరికయినా అనుమానాలు కలగడం సహజం.

కానీ అవన్నీ నిజాలే. అంత తీవ్ర పరిస్థితి లేకపోవచ్చు. కానీ ముందు చూపుతో భారం పెరగకుండా జాగ్రత్త తీసుకున్నారని కూడా భావించవచ్చు. ఒక వ్యాపార వేత్తగా ఆయన జాగ్రత్త పడటంలో తప్పులేదు. లేకపోతే నిండా మునిగిపోయే ప్రమాదం ఉంది. రామోజీ గ్రూప్ లో ఇంకా నష్టాలు వస్తున్నకొన్ని సంస్థలు ఉన్నాయి. వాటి విషయం లో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో తెలీదు.
——— K.N.MURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!