Taadi Prakash …………………………………………………………..
My Interview with SRI SRI at Vizag ……………………………… 1979లో విశాఖపట్నం ఈనాడులో పని చేస్తున్నపుడు, ఏప్రిల్ 29వ తేదీన మహాకవి శ్రీశ్రీని ఇంటర్వ్యూ చేశాను. ఆంధ్రా యూనివర్శిటీ దగ్గరున్న చలసాని ప్రసాద్ గారింట్లో నాకా అదృష్టం దొరికింది. అప్పుడు నాకు 21 సంవత్సరాలు. 1983 జూన్ 15 సాయంకాలం శ్రీశ్రీ మద్రాసులో కన్నుమూశారు.
జూన్ 14 అంటే ఆ మరచిపోలేని కవి జీవితంలో చివరి రోజు. విరసం ప్రచురణ శ్రీశ్రీ ప్ర.జ (ప్రశ్నలు-జవాబులు)లో నా ఇంటర్వ్యూ వేశారు. 41 సంవత్సరాల క్రితం చేసిన ఆ ఇంటర్వ్యూ ‘‘మీ దగ్గర వుందా?’’ అని సీనియర్ జర్నలిస్టు వేమన వసంతలక్ష్మిగారిని అడిగాను. అర గంటలో వాట్సాప్ చేశారు. వసంతలక్ష్మి గారికి కృతజ్ఞతలు. 1979 మేడే నాడు ఈనాడులో వచ్చిన ఆ ఇంటర్వ్యూ ఇదే.
——————-
‘‘శ్రీశ్రీ ఖాళీగా వున్నారు. వచ్చి మాట్లాడతారా?’’ అని శ్రీశ్రీ మిత్రుడొకాయన ఫోన్ చేశారు. మహాకవితో పిచ్చాపాటీ మాట్లాడే అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు? ‘‘ఈనాడు’’ నుంచి ఇద్దరు జర్నలిస్టులు శ్రీశ్రీ దగ్గర కెళ్లారు…. గదిలో శ్రీశ్రీ తప్ప ఎవరూ లేరు. గది నిండా నిశ్శబ్దం. మధ్యాహ్నం ఒకటిన్నర. లోపలికెళ్లాం. కూర్చోగానే ‘‘వూ…యేవిటి’’… అని కళ్లజోడులోంచి మా కళ్లలోకి చూస్తూ ప్రశ్నల వర్షానికి సిద్ధమయ్యారాయన.
వినోబా గురించి మొదలెడదామని ఆయనే అని ‘‘వినోబా భావే పొట్టి శ్రీరాములంత కీర్తిశేషుడు కావాలని ఆశిస్తున్నాడ’’ని నిర్దాక్షిణ్యంగా అన్నారు. ‘‘మార్క్సిస్టు కమిట్ మెంట్ వుండటం వల్ల కొంతమంది ప్రముఖ రచయితలు రచనలు సాగించలేకపోతున్నారని ఒక ‘‘ఫిర్యాదు’’ వచ్చింది. దాని గురించి ఏమంటారు?’’ అనడిగితే ‘‘యేదో వొకరకమైన కమిట్ మెంట్ లేకపోతే రచయిత ఎలా రాస్తాడు? తెలిసిగానీ, తెలియకుండాగానీ ప్రతి రచయితకీ యెప్పుడూ కమిట్ మెంట్ వుంటుంది. మార్క్సిస్టు కమిట్ మెంట్ వున్న రచయితలకి దానికి తాము కట్టుబడి వున్నామని తెలుసు’’ అని శ్రీశ్రీ చెప్పారు.
“ఇప్పుడున్న సాహిత్య సంఘాల గురించి మీ అభిప్రాయం ఏమిటి?” అని ప్రశ్నించినపుడు మంచం మీద పడుకుని మాట్లాడుతున్న ఆయన కాస్త పక్కకు వొత్తిగిలి ‘‘సినిమా తారల అభిమాన సంఘాల లాంటివి’’ అన్నారు. ‘‘మరి విప్లవ రచయితల సంఘం మాటేమిటి?’’ అనడిగితే ‘‘అది నేటి సాహిత్యానికి మార్గదర్శి’’ అని సిగరెట్ పొగలోకి చూస్తూ చెప్పారు. ‘‘విరసం పుట్టి దాదాపు పదేళ్ళవుతోంది గదా, సాధించిందేమిటి?’’ ‘‘శవ సంస్కృతిని నిరాకరించి, సజీవ సంస్కృతిని ప్రవేశపెట్టింది.
ఈ సజీవ సంస్కృతికి వంగపండు ప్రసాదరావు, చెరబండరాజు, ప్రతినిధుల’’ని ఆయన చెప్పారు. ‘‘ఇపుడు విరసం చురుగ్గా పని చేయడంలేదేం?’’ అంటే ‘‘ఆటుపోటులుంటాయి గదా’’ అని సరిపుచ్చారు. విరసం వల్ల ప్రయోజనం అలా వుంచి, విరసంలో ఆంతరంగిక విభేదాలూ, మొదలైన వాటి వల్ల హాని జరిగింది కదా అని అడిగినపుడు ఆయన కొంత ఇబ్బంది పడ్డారు. ‘‘కొంత మంది సాహిత్యవేత్తలకు హాని కలిగింది’’ అంటూ సగం వొప్పుకున్నారు.
విరసం సాధించిన ప్రయోజనాలతో పోలిస్తే హాని లెక్కలోకి రాదన్నారు. ‘‘నాస్తికత్వాన్ని సమాజాల ద్వారా ప్రచారం చేయడం ఒక రకంగా సంస్కరణవాదమే కదా, కమ్యూనిస్టు అయిన మీకు ఆ సమాజంలో శాశ్వత సభ్యత్వం యేమిటి?’’ అనడిగినపుడు ‘‘నాస్తికత్వమూ విప్లవమే కదా. రాజకీయాలు కనబడకుండా వుండటానికి కొందరు నాస్తికత్వాన్ని ప్రచారం చేస్తారు. కమ్యూనిజం వస్తేనే నాస్తికత్వం వస్తుంది.’’ అని చెప్పారు.
కాసేపు మౌనం. అంతరాళ… భయంకర ప్రాంతరాలనా నీ విహారం…. మంచినీళ్లు తాగి యిటు చూశారు. ‘‘కారల్ మార్క్స్ గానీ, లెనిన్ గానీ నాస్తికత్వాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని ఎక్కడన్నా చెప్పారా?’’ కెరలించకు శాంతి తరంగాలను అన్నట్లు చుట్టూ అల్మరాల్లో మౌనంగా ఉన్న పుస్తకాల వంక చూస్తూ ‘‘మార్క్స్, లెనిన్ లు మానవత్వాన్ని ప్రచారం చేశారు. అంటే దైవత్వాన్ని నిరసించారనేగా.’’ ‘‘మన దేశంలో కమ్యూనిజం వస్తుందంటారా?’’ అన్నప్పుడు, ఆయన ప్రవక్తలా నవ్వేరు. పెదవుల మీద ఆ సన్నని చిరునవ్వు చటుక్కున మాయమైంది.
సిగరెట్టు వెలిగించి గట్టిగా దమ్ములాగారు. యేదో ‘‘నక్షత్రాంతర్నిబిడ నిఖిలగానాన్ని’’ విన్నట్టు ఆలోచనల్లోంచి తేరుకుని, ‘‘కమ్యూనిజం ప్రపంచమంతటా వస్తుంది’’ అని ప్రకటించారు. ‘‘అయితే, మనకి కొంచెం ఆలస్యంగా రావచ్చు. దీనికి ఆస్తికులూ, ఆస్తి గలవాళ్లూ యెన్నో ఆటంకాలు కల్పిస్తారు. అయినా నేను ఆశావాదిని. నా జీవిత కాలంలోనే కమ్యూనిజాన్ని చూస్తానని అనుకుంటున్నా’’ అన్నారు.
ఎవడు బతికాడు మూడు యాభయిలు అంటే, ‘‘నేను రెండు యాభయిలు బతికినా చాలు’’ అని గుండె నిండిన విశ్వాసంతో చెప్పారు. అంతలో నక్సలైట్లు ‘రంగ ప్రవేశం’ చేశారు. ‘‘నక్సలైట్లు నిద్ర పోలేదు. వాళ్లు అండర్ గ్రౌండ్ లో రెడార్మీ (ఎర్రసేన)ని తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మనకు ప్రజా ఎర్రసేన వుండి తీరాలి. దీనికి మధ్య తరగతి జనం చేసేదేం లేదు. రైతులూ, కూలీలూ వున్న ఎర్రసేన వుండాలి. వాళ్లే తెలుగు దేశానికి నిజమైన స్వాతంత్ర్యాన్ని సంపాదిస్తారు’’ అంటూ ‘శ్రామిక సంస్కృతి’ని నెలకొల్పాలని అన్నారు.
బ్యాలెట్ తో క్యాబినెట్ మంత్రుల పేర్లూ, చిరునామాలు మాత్రమే మారతాయని బెర్నార్డ్ షా చెప్పిన దాన్ని శ్రీశ్రీ గుర్తు చేశారు. దేశంలోని వివిధ నక్సలైట్ గ్రూపులు కలిసే అవకాశం వుందా అంటే ‘‘దేశంలో అంతర్యుద్ధం రావాలి. అప్పుడే ఈ గ్రూపులు కలుస్తాయి. పోరాటమే వీళ్లని కలుపుతుంది’’ అన్నారు. ‘‘బెంగాల్ ఈ రోజు ఏం ఆలోచిస్తుందో ఇండియా రేపు అదే ఆలోచిస్తుందని అనేవారు వొకప్పుడు. అలాగే నేడు చైనా యేం ఆలోచిస్తుందో రేపు ప్రపంచం అదే ఆలోచిస్తుంది’’ అని శ్రీశ్రీ ధృఢంగా చెప్పారు.
‘‘మావో భావాలకు కట్టుబడి వున్నంతకాలం చైనా తప్పు చేయనేరదు’’ అన్నారు. చైనా మావో భావాలకు తిలోదకాలిచ్చి పెడమార్గం పట్టినప్పుడు మీరు వ్యతిరేకిస్తారా? అన్నపుడు…. కొన్ని సెకన్లు ఎటో చూస్తూ వుండిపోయారు. ఆయన ఏయే ఘోషలు, భాషలు, దృశ్యాలు తోచాయో… ఏయే చిత్ర విచిత్ర శ్యమంత రోచిర్నినహం చూశారో… ‘‘వ్యతిరేకిస్తాను’’ అని నిక్కచ్చిగా చెప్పారు! ‘‘యోప్పుడూ, ‘చైనా’లు వుంటూనే వుంటాయి. రేపు ఆఫ్రికాలోనో, మరో చోటనో చైనాలు వుద్భవించవచ్చు’’ అన్నారు.
‘‘జాతీయత వల్లే వియత్నాం, చైనాల మధ్య యుద్ధం జరిగింది. ఆ రెండు దేశాల కమ్యూనిస్టు పార్టీలకు విభేదాలు లేవు. అసలు కమ్యూనిస్టు దేశాల మధ్య సరిహద్దులు ఉండకూడదు. అది ఇరవై రెండో శతాబ్దంలో సాధ్యమౌతుందేమో…. ’’ అంటూ కళ్లజోడు సవరించుకుని అలా చూస్తూ వుండిపోయారు. స్వాతంత్ర్యం, సమభావం, సౌభ్రాతృత్వం సౌహార్ధం పునాదులై ఇళ్లులేని జనవాళికి శుభం పూచే రోజు ఆ చూపుల్లో ఘనీభవించి పోయింది.
పాత పదాలు, డిక్షన్, వర్ణనలు, అలంకారాలు, ఛందస్సు, ఉపమానాలు, పద్ధతులు, ఆచారాలు కవిత్వంలోనీ, జీవితంలోనీ యింక మళ్లీ లేవకుండా వాటి నడ్డి విరక్కొట్టి ధ్వంసం చేసి రోడ్డు వేసి పదండి ముందుకు అన్న శ్రీశ్రీ- ‘‘నేడు వ్యావహారిక భాషా వుద్యమం కుంటుపడటానికి నేటి విద్యా విధానమే కారణం’’ అని చెప్పారు. ‘‘వ్యవహారికాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి చిన్నప్పటి నుండి మాతృభాషలోనే చదువు చెప్పాలి. పిల్లలకి వ్యవహారికమే సులభంగా బోధపడుతుంది. అనేక ప్రయోజనాలున్నందువల్ల మన లిపిని సంస్కరించాలి. ఇది తక్షణం చేయాల్సిన పని. ప్రతి వ్యక్తీ మాతృభాష కాక ఇంగ్లీషు నేర్చుకోవాల’’ని చెప్పారు.
‘‘సోవియట్, చైనా మధ్య విభేదాలు వున్నంత కాలం రెండు కమ్యూనిస్టు పార్టీలూ సమైక్యం కాలేవు. మార్క్సిస్టు పార్టీ ఎర్రరంగు పూసుకున్న కమ్యూనిస్టు పార్టీ. భారత కమ్యూనిస్టు పార్టీ తెల్ల కమ్యూనిస్టు పార్టీ. వ్యాపార దక్షత గల పార్టీ కూడా’’ అని శ్రీశ్రీ అన్నారు. రెండు కమ్యూనిస్టు పార్టీలూ సమైక్యంగా పోరాటాలు జరిపితే హర్షిస్తారా అని అడిగితే ‘‘తప్పకుండా’’ అన్నారు. కొత్తగా ఏర్పడనున్న విజయనగరం జిల్లాకి ‘‘గురజాడ జిల్లా’’ అని పేరు పెట్టాలని చాలా మంది అంటున్నారు. మీరేమంటారు? అనడిగితే
‘‘యస్ అంటాను’’ అని టక్కున చెప్పారు. ‘‘నిజమైన విజయనగరం హంపీ విజయనగరం- కర్ణాటకలో మరో విజయ నగరం వుంది. అందువల్ల కొత్త జిల్లాకి ‘గురజాడ జిల్లా’ అని పేరు పెట్టడమే బాగుంటుంది’’ అని శ్రీశ్రీ అన్నారు. ‘‘గురజాడ అత్యంత తేలికైన మాటలతో సాధారణమైన పదాలతో రాస్తే, శ్రీశ్రీ క్లిష్ట సమాసభూయిష్టమైన కవిత్వం రాశారు. అందువల్ల శ్రీశ్రీ గురజాడకు నిజమైన వారసుడు కాడంటున్నారు. మీరేం చెబుతారు’’ అనడిగితే ‘‘నిజంగా జానపద సాహిత్యం యిచ్చిన వుత్తేజంతో గురజాడ రచనలు చేశారు. నాది ఎక్కువగా పట్టణ జీవితం అవడం మూలాన ఆ బాటలో సూటిగా నడవలేకపోయాను’’ అని చెప్పారు.
‘‘గుంటూరు శేషేంద్ర శర్మ క్లాసికల్ ట్రైనింగ్ ఎక్కువ వున్నవాడు. విశ్వనాధ కంటే ఆయనే సంస్కృతం యెక్కువ చదువుకున్నాడని నేననుకుంటాను. శేషేన్ ‘‘మండే సూర్యుడు’’ విప్లవ భావాలకి సుముఖంగా వుంది. ఈ వ్యవస్థ మారాలనీ, కమ్యూనిజం దిశగా పయనించాలనీ కోరే వ్యక్తి శేషేన్. అయితే ఆయన నిజమైన విప్లవకారుడు కాదు’’ అన్నారు శ్రీశ్రీ. శేషేన్ గురించి మరేమనుకుంటున్నారో ఖచ్చితంగా చెప్పండని అడిగితే ‘‘గోడ మీద కోకిల’’ అన్నారు.
‘ఇంకా యేమిటి?’- ‘‘హంసతో ఆర్నెల్లు అనే నవల రాద్దామనుకుంటున్నాను.’’ దానికి యితివృత్తం యేమిటి? ‘‘ఆ టైటిల్ ఆధారంగా రాస్తాను. యేమిటి రాస్తానో నాకే తెలీదు…..’’ అన్నారాయన. మళ్లీ గదిలో నిశ్శబ్దం ఆవరించింది. ‘‘ఇక లేద్దాం నాకు ట్రెయినుకి టైమైంది’’ అన్నారు. మొయిల్దారిన బయల్దేరిన జగన్నాధుని రథ చక్రాల్ ఆయన్ని పిలిచాయి. సెలవంటూ మమ్మల్ని వదిలి….. తలవంచుకు వెళ్లిపోయారు శ్రీశ్రీ……… చిరునవ్వులనే పరిషేచన చేస్తూ.
శ్రీ శ్రీ ఇంటర్వ్యూ గ్రేట్,
ఆగట్టు నుంటావా, ఈగట్టు నుంటావా
పాట గుర్తుబుకొచ్చింది ఏదోగట్టు పట్టుకోవాలే….
ధన్యవాదాలు
Rathnamuv