Topudu bandi Sadiq ……………………..
Believed in hardship…………………………
అతడు అదృష్టాన్ని నమ్ముకోలేదు.అడ్డదారులు తొక్కలేదు. తన రెక్కల కష్టాన్నే నమ్ముకున్నాడు. ఆత్మ విశ్వాసాన్నే పెట్టుబడిగా పెట్టాడు.పల్లె నుంచి పొట్టచేతపట్టుకొని,కాలే కడుపుతో, ఖాళీ జేబుతో పట్నానికి వచ్చాడు.పాతికెళ్లలో కోట్లకు పడగెత్తాడు.ఇది కోట్లమందికి స్ఫూర్తినిచ్చే మంగినిపల్లి యాదగిరి కథ.
మెదక్ జిల్లా నిజాంపేట్ మండలం కల్వకుంట్ల గ్రామానికి చెందిన మంగినిపల్లి పోచయ్య,పోచమ్మ దంపతులకు నలుగురు బిడ్డలు.ముగ్గురు కొడుకులు,ఒక కూతురు.అందరిలోకి పెద్దవాడు యాదగిరి ఊళ్ళోనే పదో తరగతి చదివాడు.పై చదువులు చదివించే స్థోమత లేని తండ్రి కూలి పనికి వెళ్లమన్నాడు.
తండ్రీ తాతల్లా ఊళ్ళోనే కూలివాడిగా మిగిలిపోదల్చుకోలేదు. పట్నం వెళ్లి ఏదైనా వ్యాపారం చేస్తానన్నాడు. డబ్బుల్లేని ఆ తండ్రి కొడుకును పట్నం వెళ్లకుండా ఆపాలనుకున్నాడు.కానీ పెద్ద కలలు కనే యాదగిరి ఖాళీ జేబులతోనే హైద్రాబాద్ చేరుకున్నాడు.అక్కడి నుంచి తన మహాప్రస్థానం మొదలైంది.
నెత్తిమీద గంప పెట్టుకొని పాతపేపర్లు, పాత పుస్తకాలు కొంటాం అంటూ బయలు దేరాడు.ఏడాది పాటు కష్టపడి కూడబెట్టిన డబ్బులతో ఒక పాత సైకిల్ కొనుక్కున్నాడు.విద్యానగర్,నల్లకుంట,శంకర్ మఠ్ ప్రాంతాల్లో తిరిగాడు.ఆ తర్వాత వ్యాపారం పెరిగి నారాయణ గూడా గల్లీల్లో ఒక చిన్న డబ్బా ఏర్పాటు చేసుకున్నాడు.ఆ తర్వాత ఒక పాత ఆటో,ఆ తర్వాత ఒక ట్రాలీ సమకూర్చుకుంటూ అంచెలంచెలుగా వ్యాపారాన్ని విస్తరించుకుంటూ పోయాడు.
చాలా కాలనీల్లో యాదగిరి డబ్బాలు వెలిశాయి.ఎవరింట్లో,షాపులో ఎక్కడ పాత పేపర్లు,పుస్తకాలు,వేస్ట్ మెటీరియల్ ఉన్నా అది యాదగిరి దగ్గరికే చేరేది.యాదగిరి చేతికింద పనిచేసే వాళ్ళ సంఖ్య పెరిగింది.20 ఏళ్ళు తిరిగేసరికి వేస్ట్ పేపర్ బిజినెస్ కి బాద్ షా అయ్యాడు.అక్కడితో ఆ ప్రయాణం ఆగలేదు.నగరం నలుమూలలకు విస్తరించాడు.
పలు ప్రాంతాల్లో పెద్ద పెద్ద గోడౌన్ లు ఏర్పాటు చేసుకున్నాడు.ఇప్పుడు అతని దగ్గర ఒరిస్సా, బీహార్,రాజస్థాన్ లకు చెందిన 80 మంది ఉద్యోగులున్నారు.పరోక్షంగా కొన్ని వేల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు.50 కోట్ల టర్నోవర్ సాధించాడు.ఇంతచేసి యాదగిరి వయసు 41 ఏళ్లు మాత్రమే.
యాదగిరి తమ్ముళ్లను ప్రయోజకులను చేసాడు.ఒక తమ్ముడు ప్రభుత్వ ఉద్యోగి అయ్యాడు.మరో తమ్ముడు వ్యాపారంలో చేదోడుగా ఉన్నాడు.చెల్లి పెళ్లి చేసి పంపించాడు.యాదగిరి భార్య అనిత,వాళ్లకు ముగ్గురు కొడుకులు.సంపాదించిన దాంట్లో దానధర్మాలు నిరంతరం చేస్తూ ఉంటాడు.తన పనుల వల్ల తండ్రికి మంచి పేరు,గౌరవం దక్కుతున్నాయని,అప్పుడు పట్నం వెళ్ళొద్దన్న తండ్రి ఇప్పుడు తనని చూసి మురిసిపోతుంటాడని చెప్పాడు.
తాను చదువుకున్న స్కూల్ తో పాటు చుట్టుపక్కల స్కూళ్లకు కూడా పుస్తకాలు ఇస్తుంటాడు. ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించేందుకు నగదు బహుమతులు ఇస్తూ ఉంటానని చెప్పాడు.తోపుడుబండి చేస్తున్న కార్యక్రమాల గురించి తెలుసుకొని తమ ప్రాంతంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించమని కోరాడు.దానికి అవసరమైన పూర్తి సహకారం అందిస్తానని చెప్పాడు.అప్పటికప్పుడు కల్లూరు తీసుకెళ్లమని కొన్ని నోట్ బుక్స్,కాపీ రైటింగ్ బుక్స్ ఇచ్చాడు.
అలాగే నగరంలో కలెక్ట్ చేసిన మెటీరియల్ ప్యాకేజ్ కు అవసరమైన బ్యాగ్ లు,బాక్స్ లు ఇచ్చాడు. విజేతలు ఎక్కడో అమెరికా,చైనాల్లో నే కాదు.కళ్ళు తెరిచి చూస్తే మన కళ్ల ముందే ఉంటారు.ఆ విజయుణ్ణి చూడాలనుకుంటే అంబర్ పేట్ అలీ కేఫ్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు.
రియల్ హీరో కి సెల్యూట్.