Does the budget impress everyone?………………….
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించ బోతున్నారు. గతంలో వరుసగా ఆరు బడ్జెట్‌లను సమర్పించిన మొరార్జీ దేశాయ్ రికార్డును సీతారామన్ అధిగమించనున్నారు. ఇక కొత్త బడ్జెట్ లో ఆర్థిక మంత్రి రాయితీలు .. మినహాయింపులు ప్రకటించవచ్చనే వార్తలు ప్రచారంలో కి రావడంతో పన్ను చెల్లింపు దారులు ఆశతో ఎదురు చూస్తున్నారు.
80C మినహాయింపు పరిమితి పెంచి పదేళ్లు అయింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సారి ఖచ్చితంగా మినహాయింపు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం 80C కింద గరిష్టంగా రూ.1.50 లక్షల నుంచి రూ. 2 లక్షలకు మినహాయింపును పెంచవచ్చని పన్ను చెల్లింపుదారులు భావిస్తున్నారు. ఆవిధంగా జరిగితే టాక్స్ పేయర్లకు ఊరట లభిస్తుంది.
అలాగే ఈసారి బడ్జెట్ లో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని కూడా పెంచవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం, కొత్త , పాత సిస్టమ్‌లపై రూ. 50,000 వరకు స్టాండర్డ్ డిడక్షన్ అందుబాటులో ఉన్నది. దీన్ని రూ.లక్ష వరకు పెంచవచ్చు అనే ఊహాగానాలున్నాయి. దీని వల్ల ప్రయోజనం ఏమిటంటే ఖర్చులకు సంబంధించిన రుజువుగా రసీదులు జత పరిచే అవసరం ఉండదు.
కొత్త – పాత వ్యవస్థలలో ప్రాథమిక మినహాయింపు పరిమితిని కూడా పెంచవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రాథమిక మినహాయింపు పరిమితి ప్రస్తుత కొత్త విధానంలో రూ.3 లక్షలు, పాత విధానంలో రూ.2.50 లక్షలు వరకు ఉంది. రెండు విధానాల్లో రూ.5 లక్షలకు పెంచవచ్చని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే రూ.5 లక్షల వరకు సంవత్సర ఆదాయం ఉన్నవారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.
కొత్త పన్ను విధానంలో శ్లాబ్‌లు ఎక్కువగా ఉన్నాయని పన్ను చెల్లింపుదారులు చెబుతున్నారు. వాటిని తగ్గించాలని కోరుతున్నారు. అదే సమయంలో 20 – 30 శాతం శ్లాబ్‌ల మధ్య 25 శాతం అదనపు పన్నుశ్లాబ్ ను తీసుకురావాలని కోరుతున్నారు. ఈ పన్ను శ్లాబ్ రూ.15 నుంచి 20 లక్షల మధ్య ఉంటే బాగుంటుందని అంటున్నారు. దీనివలన పన్నుభారం తగ్గుతుంది.
కొత్త పన్ను విధానంలో హెచ్‌ఆర్‌ఏ లేదా గృహ రుణానికి సంబంధించి కీలక నిర్ణయం కోవచ్చని కూడా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కొన్నిఅంశాల విషయంలో అయినా ప్రభుత్వం సానుకూలంగా ఉండొచ్చు అన్న ఫీలర్లు గట్టిగా వినపడుతున్నాయి. ఈ బడ్జెట్ లో ప్రజలకు తాయిలాలు ప్రకటించి వారిని ప్రసన్నం చేసుకునే వ్యూహం లో మోడీ సర్కార్ ఉందని అంటున్నారు.