The tallest human structure……………………………..
ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటి ‘గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’ (Great Wall of China). దాదాపు 13,170.7 మైళ్ల పొడవు( 21196.18 కిమీ ) ఉండే ఈ చారిత్రక కట్టడం ప్రపంచంలోనే ఎత్తైన గోడగా కూడా ప్రసిద్ధి గాంచింది.గ్రేట్ వాల్ ఆఫ్ చైనా చరిత్రలో ఇప్పటివరకు నిర్మితమైన అతి పొడవైన మానవ నిర్మాణం.
చైనాకు ఉత్తరాన ఉన్నసంచార తెగల నుంచి శత్రు దాడులు జరగకుండా రక్షణ పొందడానికి ఈ గ్రేట్ వాల్ నిర్మించబడింది. ఇది చైనా వాణిజ్య మార్గాన్ని రక్షించడానికి కూడా ఉపయోగపడింది.డిసెంబర్ 1987లో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిర్మాణం 300 B.C.E లో ప్రారంభమైంది. 18వ శతాబ్దపు మింగ్ రాజవంశం సమయంలో నిర్మాణం ముగిసింది.
ఈ గోడను 6 వేర్వేరు చైనీస్ రాజవంశాలు నిర్మించాయి.సుప్రసిద్ధ క్విన్ రాజ వంశం కాలం లో ఉత్తర గోడలు అనుసంధానమైనాయి.గోడ సగటు ఎత్తు 6-7 మీటర్లు.. ఎత్తైన ప్రదేశంలో 14 మీటర్ల వరకు ఉంటుంది. గోడ సగటు వెడల్పు 6.5 మీటర్లు.గ్రేట్ వాల్ ఆఫ్ చైనా 2,700 సంవత్సరాలకు పైగా పాతది.
గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తూర్పు తీరంలో షాన్హై పాస్ వద్ద మొదలై … గన్సు ప్రావిన్స్‌లోని జియాయు పాస్ వద్ద ముగుస్తుంది. గోడ వేర్వేరు దిశల్లో నిర్మితమైంది. మధ్యలో పర్వతాలు.. సరస్సులు ఉంటాయి. చైనాలో సాంస్కృతిక విప్లవం సమయంలో (1966-1976) గోడ నుండి సేకరించిన ఇటుకలను గృహాలు, రిజర్వాయర్లు, ఇతర భవనాల నిర్మాణంలో ఉపయోగించారు.ఇప్పటికీ 5,000 మైళ్లకు పైగా గోడలు ఉన్నాయి.
గ్రేట్ వాల్ కేవలం ఒకే గోడ కాదు.. ఉత్తర చైనాలోని 15 ప్రావిన్సులలో 43,721 వారసత్వ ప్రదేశాలతో కూడిన విశాల ప్రాంతం. మధ్యలో కొన్నికోటలున్నాయి. బాదలింగ్, ముటియాన్యు ప్రాంతాలలో గోడ సురక్షితంగాఉంది. ఇప్పటి వరకు చిన్నపాటి పునరుద్ధరణ తప్ప,1644 నుండి గోడ పై ఎటువంటి మరమ్మత్తు పనులు జరగలేదు.ఇది ఒక వైపే కట్టిన గోడ కాదు.సరిహద్దుగా రెండు వైపులా గోడలు కట్టి మధ్యలో మార్గాన్ని వదిలారు. గోడకు మధ్యలో కొన్ని చోట్ల మెట్లు,కొంత కాలిబాట,ఎగుడు దిగుడు ఉంటాయి.
1984లో డాంగ్ యావోహుయ్ అనే ఎలక్ట్రికల్ ఇంజనీర్, గ్రేట్ వాల్ ప్రొటెక్టర్ తన ఇద్దరు సహచరులతో కలిసి 508 రోజులు (సుమారు 17 నెలలు) నడుస్తూ గ్రేట్ వాల్ మొత్తాన్ని పరిశీలించారు. గోడను ఎక్కువగా సందర్శించే విభాగాన్ని బాదలింగ్ అని పిలుస్తారు.ఇది బీజింగ్ సమీపంలో ఉంది. ఈ ప్రాంతాన్ని ఒకే సంవత్సరంలో దాదాపు 63 కోట్లమంది సందర్శించారని అంటారు. పీక్ సీజన్‌లో రోజుకు 70,000 మంది సందర్శకులు వస్తుంటారు. చైనా వెళితే తప్పనిసరిగా గ్రేట్ వాల్ ను చూసిరండి.